పాలిటిక్స్ లో సోలో హీరోలు కాలేరా ?

దాంతో రీల్ హీరోని చూసి ఫ్యాన్స్ ఈలలు గోలలు చేస్తారు. వారి దృష్టిలో ఈ హీరోలు అంతా డెమ్మీ గాడ్స్ గా మారిపోతారు.;

Update: 2025-07-28 07:30 GMT

సినీ హీరో అంటే ఆ గ్లామర్ ఇమేజ్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, ఒంటి చేత్తో పది మందిని కొడతాడు. ఒంటి మీద బట్ట నలగకుండా జుట్టు చెదరకుండా ఏ మాత్రం అలసిపోకుండా ఈ ఫైట్లు అతి సునాయాసంగా చేస్తాడు. దాంతో రీల్ హీరోని చూసి ఫ్యాన్స్ ఈలలు గోలలు చేస్తారు. వారి దృష్టిలో ఈ హీరోలు అంతా డెమ్మీ గాడ్స్ గా మారిపోతారు.

రాజకీయ తెర మీద అలా :

కట్ చేస్తే చాలా మంది హీరోలకు రాజకీయాల్లోకి రావాలని ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. దాంతో వారు సొంతంగా పార్టీ పెట్టి వస్తున్నారు. తమకు ఉన్న అభిమాన జన బలాన్ని చూసుకుంటున్నారు. తాము వస్తే కనుక ఆ అగ్ర సిం హాసనం తమదే అని ఆశలు పెంచుకుని అంచనాలు వేసుకుని మరీ రాజకీయ రంగంలోకి అడుగు పెడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం హీరోలకు అన్నీ కలసి రావడం లేదు అనే అంటున్నారు. సొంతంగా హీరోలుగా వెండి తెరను ఏలిన వారు పాలిటిక్స్ లో మాత్రం సైడ్ హీరోలుగానో కొన్ని సార్లు పక్క వాయిద్యాలుగానో మారిపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

ఒక ఎన్టీఆర్ ఒక ఎంజీఆర్ :

తమిళనాడు సినీ రంగానికి రాజకీయ రంగానికి మంచి బంధం ఉంది. అది దశాబ్దాల పాటు అలాగే కొనసాగుతూ వచ్చింది. కరుణానిధి ఎంజీఆర్ ఇద్దరూ సినీ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే జయలలిత సైతం సినీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అయితే వీరంతా కూడా ముఖ్యమంత్రులుగానే పదవులు అలంకరించారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు సీఎంలుగా పనిచేశారు కూడా. ఇక తెలుగు నాట చూస్తే ఆ రేర్ ఫీట్ ఒక్క ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది. ఆయన వెండి తెరను ఏలుతూ రాజకీయాల్లోకి వచ్చి తొమ్మిది నెలలలో సీఎం అయిపోయారు. కానీ ఆయన తరువాత వచ్చిన వారు ఎంపీలుగానో కేంద్ర మంత్రులుగానో లేక రాష్ట్ర మంత్రులుగానో పనిచేశారు.

ఇదే తీరులో సాగుతోందిగా :

తమిళనాట విజయకాంత్ మంచి నటుడు. మాస్ ని రజనీకాంత్ తరువాత అంతే స్థాయిలో ఉర్రూతలూగించిన వారు. ఆయన సొంతంగా పార్టీ పెడితే ఓడిపోయారు. ఒకసారి తాను ఒక్కడే గెలిచారు. మరో ఎన్నికల్లో జయలలిత అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లు సాధించారు. ఆ తరువాత పార్టీ పెద్దగా గెలిచింది లేదు. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ పార్టీ పెట్టారు. 2021 ఎన్నికల్లో పోటీ చేశారు. తాను కూడా ఎమ్మెల్యేగా ఓటమి చూసారు. ఇక లాభం లేదనుకుని డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. ఫలితంగా ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యారు.

పొత్తులు ఉంటేనే రాజకీయం :

రాజకీయాల్లో రీల్ హీరోలు రాణించడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని సమస్యలూ ఉన్నాయి. వారి వేసిన పాత్రలను చూసి బయట కూడా అలాగే ఉంటారు అని జనాలు అనుకుంటారు. అది మేలు కంటే ఇబ్బందే ఎక్కువ చేస్తుంది. వారి ఇమేజ్ కూడా మరో సమస్య. ఇక రెగ్యులర్ పొలిటీషియన్స్ మాదిరిగా వారు జనంతో కలిసి పోలేరు. దీంతో వారి రాజకీయం ఒక పరిమితంగానే సాగుతోంది. అందుకే సొంతంగా నడపడం వల్ల వచ్చే ఇబ్బందుల కంటే పొత్తులతో ముందుకు సాగడమే బెటర్ అనుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినా తరువాత కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని 2019లో ప్రయత్నం చేసినా అనుకున్న ఫలితాలు రాలేదు. దాంతో ఆయన 2024లో టీడీపీ బీజేపీలతో కలసి పొత్తులు పెట్టుకుని అధికారంలో భాగమయ్యారు.

దళపతి సాధిస్తే రికార్డు :

ఇక తమిళనాడులో మరో సూపర్ స్టార్ రాజకీయ పార్టీని పెట్టారు. దళపతి విజయ్ పార్టీ ఒంటరిగానే పోటీకి దిగుతామని చెబుతోంది. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ ఒకేసారి అధికార డీఎంకే కూటమికి మరో వైపు విపక్షంలోని అన్నాడీఎంకే కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు కూటములను పక్కకు నెట్టి జన బలాన్ని తన వైపు తిప్పుకుని అధికారంలోకి వస్తే కనుక ఆయన రికార్డు బద్ధలు కొట్టినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News