ఐటీ సలహాదారుగా పని చేశాను కాబట్టే అరెస్టు.. బెయిలివ్వాలన్న కసిరెడ్డి

ఏపీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.;

Update: 2025-04-19 05:22 GMT

ఏపీ మద్యం కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి తాజాగా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో తాను ఐటీ సలహాదారుగా వ్యవహరించానని.. అందుకే తనను మద్యం కుంభకోణంలో ఇరికించి.. ఏ క్షణంలో అయినా అరెస్టు చేయించే వీలుందన్నారు. అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పని చేసిన ఆయన.. తాను ఐటీ విధానాలకే పరిమితమయ్యానే తప్పించి.. ఇతర శాఖలు.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ విధానంలో తనకు సంబంధం లేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

గత ప్రభుత్వంతో సంబంధం ఉందన్న ఏకైక కారణంగానే తనను మద్యం కుంభకోణం కేసులో ఇరికించినట్లుగా ఆయన వాపోయారు. తనను మద్యం స్కాంలో ఇరికించి అరెస్టు చేసి వేధించాలని దర్యాప్తు సంస్థ చూస్తుందన్న ఆయన.. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. వైసీపీ హయాంలో ఏపీబీసీఎల్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డిని మాత్రశాఖకు పంపిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని.. అన్నీతానై వ్యవహరించిన వాసుదేవరెడ్డిని బయటకు వెళ్లేందుకు వీలుగా రిలీవ్ చేసిన ప్రభుత్వం.. గత సర్కారులో సంబంధం ఉన్న తన లాంటి వాళ్లను టార్గెట్ చేయటం అన్యాయమన్నారు.

తన ఇళ్లు.. ఆఫీసులు.. బంధువుల ఇళ్లల్లో ఏకపక్షంగా విచారణ సంస్థ సోదాలు నిర్వహించినట్లుగా పేర్కొన్న రాజ్ కసిరెడ్డి.. తాజా పరిణామాలు తనకు ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ‘ఎప్పుడు కోరితే అప్పుడు దర్యాప్తు సంస్థకు అందుబాటులో ఉంటాను. నేను పేర్కొన్న అంశాల్ని పరిగణలోకి తీసుకోగలరు. గత ఏడాది సెప్టెంబరు 23న మంగళగిరి సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయగలరు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాలపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News