ఈసీని వెంటాడుతున్న రాహుల్ గాంధీ... మరో సంచలన పోస్ట్!
దీనిపై అటు బీజేపీ, ఇటు ఈసీ స్పందించి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించాయి. అయినప్పటికీ రాహుల్ తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.;
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ఆంగ్ల దినపత్రికలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ అటూ బీజేపీ, ఇటు ఎన్నికల కమిషన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ, పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే! ఆ కథనం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై అటు బీజేపీ, ఇటు ఈసీ స్పందించి, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించాయి. అయినప్పటికీ రాహుల్ తగ్గేదేలే అంటూ పోస్టులు పెడుతున్నారు.
అవును... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా జరిగాయని, ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో పెంచారని రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్లు, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకాన్ని నియంత్రించే చట్టాన్ని సవరించి.. వారి ఎంపిక బాధ్యతను వహించే ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించారని అన్నారు.
అయితే... ఈ "మ్యాచ్ ఫిక్సింగ్" వాదనలను అటు బీజేపీ ఖండించగా.. ఇటు ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. మొత్తం ఓటింగ్ పారదర్శకంగా జరిగిందని, అన్ని రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఆ ఎన్నికలకు హాజరయ్యారని ఎన్నికల సంఘం పేర్కొంది. రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తెలిపింది. ఈ నేపథ్యంలో రాహుల్ మరోసారి స్పందించారు.
ఇందులో భాగంగా... ఎన్నికల కమిషన్ నుంచి పారదర్శకత కోసం తన డిమాండ్ ను తీవ్రతరం చేస్తూ ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా... మహరాష్ట్ర పోలింగ్ బూత్ ల నుంచి డిజిటల్ ఓటరు జాబితాను, సాయంత్రం 5 గంటల తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లను విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఈ సందర్భంగా... డియర్ ఈసీ అని మొదలుపెట్టిన రాహుల్... మీరు ఒక రాజ్యాంగ సంస్థ అని తెలిపారు. ఈ సందర్భంగా.. మీరు దాచడానికి ఏమీ లేకపోతే, తన వ్యాసంలోని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని.. మెషిన్ రీడబుల్, డిజిటల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలని.. తద్వారా విశ్వసనీయత నిరూపించుకోవాలని అన్నారు!
ఇదే సమయంలో... ఎగవేత అనేది మీ విశ్వసనీయతను కాపాడదు అని ఎన్నికల కమిషన్ కు సూచించిన రాహుల్ గాంధీ... నిజం చెప్పడం వల్లే విశ్వసనీయత కాపాడబడుతుందని పేర్కొన్నారు! దీంతో... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ను రాహుల్ గాంధీ వెంటాడే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు!