రగులుతున్న రేవంత్ సైన్యం..
దీంతో ఆయన ప్రమాణ స్వీకార దృశ్యాన్ని నేరుగా వీక్షించేందుకు.. కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు.;
``తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ముందు నడిపించి.. బలమైన కేసీఆర్ను ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఎదిరించి పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డికి అన్యాయం చేస్తారా?`` అంటూ.. ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి పీఠం ఎవరికి అప్పగించాలనే విషయాన్ని తేల్చడంలో నాన్చుడు ధోరణిని అవలంభిస్తోంది. అయితే..రేవంత్‌రెడ్డి అభిమానులు, ఆయన నియోజకవర్గం ప్రజలు కూడా.. రేవంతే సీఎం అవుతారని ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఆయన ప్రమాణ స్వీకార దృశ్యాన్ని నేరుగా వీక్షించేందుకు.. కొడంగల్ నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే.. అనూహ్యంగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. లెక్కకు మించిన నాయకులుసీఎం సీటుకోసం.. వేచి చూస్తున్నారు. కోమటిరెడ్డివెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, భట్టి విక్రమార్క వంటి అనేక మంది నాయకులు సీఎం సీటుకు పోటీ పడుతున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నామని, అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పుడు.. పార్టీని పొదివి కాపాడుకున్నామని.. ఇప్పుడు ఎవరినో తీసుకువచ్చిన సీఎంను చేస్తారా? అని అంతర్గత సమావేశాల్లో హాట్ వ్యాఖ్యలు సంధిస్తున్నారు. దీంతో సీఎం సీటు రేవంత్కు ఇచ్చే విషయంపై అధిష్టానం తర్జన భర్జన పడుతోంది.
మరోవైపు నాయకులు రేవంత్‌కే డిప్యూటీ సీఎం ఇవ్వాలని.. లేకపోతే.. ఆయనను పూర్తిగా పక్కన పెట్టి.. వేరే ఎవరికైనా ఇవ్వాలనే వాదనను తెరమీదకి తెచ్చారు. ఆయన కింద తాము పనిచేసేది లేదని.. చాలా మంది నాయకులు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఈ విషయాలు బహిర్గతం కావడంతో రేవంత్‌కు మద్దతుగా ఉన్న ఆయన అనుచరులు.. ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున బయటకు రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజ్‌భవన్ సహా ఖైరతాబాద్ జంక్షన్లలో గుమిగూడి ధర్నాలకు పిలుపునిచ్చారు. అయితే, అలెర్ట్ అయిన పోలీసులు నిరసన కారులకు సర్ది చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.