తానాలో ‘బ్లడ్ బుక్’.. అది ఎన్నారై మీటింగ్ నా? ఇంకా ఏమైనాన?

ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరయ్యారు.;

Update: 2025-07-07 06:34 GMT
తానాలో ‘బ్లడ్ బుక్’.. అది ఎన్నారై మీటింగ్ నా? ఇంకా ఏమైనాన?

ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లినా మన నేతల తీరు మారడం లేదు. ఎంతసేపు అవే రాజకీయ వైషమ్యాలు.. రెచ్చగొట్టే రాజకీయాలు ఇక్కడా చేస్తూ అమెరికాలోనూ అవే వల్లెవేస్తూ ఈసడింపు కలిగేలా చేస్తున్నారు. తాజాగా తానా ఉత్సవాలకు హాజరైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. అక్కడ ప్రవాస భారతీయులు , ఎన్నారైల సంక్షేమం, అభివృద్ధి, సంస్కృతి సంప్రదాయాలపై మాట్లాడాల్సింది పోయి.. ఇవే ఏపీ రాజకీయాలను రెడ్ బుక్, బ్లడ్ బుక్ అంటూ మాట్లాడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అమెరికా వెళ్లినా అదే కక్షపూరిత వ్యవహారశైలిని ప్రదర్శించడం ఏంటని ఎన్నారైలందరూ అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది.

ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణంరాజు తరచు వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన తాజాగా అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరయ్యారు. అక్కడ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు. రఘురామ మొన్నటి ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన మంత్రి పదవిని ఆశించారు. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించలేకపోయారు. డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇవ్వడంతో ఆయన సర్దుకున్నారు. అయితే ఇప్పుడు తానా మహాసభల్లో తనకు రెండు మంత్రిత్వ శాఖలపై ఆశ ఉందని తేల్చి చెప్పారు. ఆ రెండు శాఖలు తనకు అప్పగిస్తే తన పనితీరును చేసి చూపిస్తానని అన్నారు.

- కొద్ది రోజులకే రెబల్‌గా..

ఎన్నికలకు ముందు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు రఘురామకృష్ణంరాజు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కానీ కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆ పార్టీకి దూరమయ్యారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాత్రం ఆయనను సస్పెండ్ చేయలేదు. అనర్హత వేటు వేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నిత్యం అప్పటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు రఘురామకృష్ణం రాజు. ఈ క్రమంలో ఆయన అరెస్టు కూడా జరిగింది.

-అరెస్టు చేసి చిత్రహింసలు..

వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును ఓ పుట్టినరోజు నాడు హైదరాబాద్ వెళ్లి ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి పోలీస్ అధికారులు విచారణ పేరిట చేయి చేసుకున్నారని రఘురామకృష్ణం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తరువాత కోర్టుకు వెళ్లి ఊరట దక్కించుకున్నారు. అయితే నాడు తనకు ఎదురైన పరాభవాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీలో చేరి, మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి పదవి తీసుకోవాలని భావించారు. తద్వారా తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూశారు. కానీ ఆయనకు మంత్రి పదవి లభించలేదు.

-తానా సభల్లో సంచలనం

తాజాగా తానా మహాసభలకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణం రాజుకు ఆహ్వానం అందింది. దీంతో ఆ మహాసభలకు హాజరయ్యారు. అక్కడ సభా వేదికపై ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. ఏపీ శాసనసభ్యులంతా ముక్తకంఠంతో కోరి తనకు మంత్రి పదవి ఇప్పిస్తే ఓ రెండు శాఖలను తీసుకుంటానని బదులిచ్చారు రఘురామ. రోజులో హోం శాఖను ఎనిమిది గంటలు, వైద్య ఆరోగ్యశాఖను రెండు గంటలు ఇస్తే తనకు ఎదురైన రక్తధార కు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేయిస్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద రెడ్ బుక్ లేదని, అది వేరే వారి వద్ద ఉందని, తన వద్ద ఉన్నది ‘బ్లడ్ బుక్’ అంటూ వ్యాఖ్యలు చేశారు.రఘురామకృష్ణంరాజు అంత పగతో రగిలిపోతున్నారా అనే చర్చ బలంగా జరుగుతోంది. ఈ మాటలకు ఎన్నారైలు అవాక్కయ్యారు. ఇది తానా సభ అని.. ఇక్కడ మాట్లాడాల్సింది ప్రవాస భారతీయులు, తెలుగు వారి సంప్రదాయాలు.. అమెరికాలో వారి కష్టాలు, బాధలు, అభివృద్ధి గురించి చర్చించాలని.. కానీ రఘురామ మాత్రం ఏపీ పాలిటిక్స్ ను ప్రస్తావించడంతో అంతా అవాక్కయ్యారు. అది ఎన్నారై మీటింగ్ నా? ఇంకా ఏమైనాన? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఈ సంఘటన తానా సభల ఉద్దేశ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇవి ఎన్నారైల కలయికకు వేదికగా ఉండాలా, లేక భారత రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రతీకార రాజకీయాలకు అడ్డాగా మారాలా అనేది ఆలోచించాల్సిన విషయం.

Full View
Tags:    

Similar News