పవన్ ని టార్గెట్ చేస్తున్న కవిత...ఇదెక్కడి లాజిక్కు ?

తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని పేరుతో కవిత తన కొత్త పార్టీని పెట్టి సరికొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశారు.

Update: 2026-06-06 18:29 GMT

తెలంగాణా రక్షణ సేన షార్ట్ కట్ లో టీఆర్ఎస్ అని పేరుతో కవిత తన కొత్త పార్టీని పెట్టి సరికొత్త రాజకీయాన్ని స్టార్ట్ చేశారు. 2028 ఎన్నికలు లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. అయితే కేసీఆర్ స్థాపితమైన టీఆర్ఎస్ ఈ రోజు బీఆర్ ఎస్ గా ఉన్న పార్టీ గట్టిగా పట్టుకున్న తెలంగాణా సెంటిమెంట్ ని తన పార్టీ ఎదుగుదలకు కవివ వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అదే పనిగా విమర్శలు చేస్తూ ఆయన ఆంధ్రా మూలాలు ప్రశ్నిస్తున్న కవిత మీద తెలంగాణా బీజేపీ నాయకుడు, ఎంపీ అయిన రఘునందరావు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ అయితే ఓకేనా :

కవిత ఎంతసేపూ పవన్ తెలంగాణాలో పర్యటించడాన్ని తన రాజకీయ పార్టీని విస్తరించడాన్ని తప్పు పడుతూండం పట్ల రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. పవన్ ఎన్డీయేలో భాగం అని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజున దేశాన్ని పాలిస్తున్న ఎన్డీయేలో జనసేన భాగం అన్నట్లుగా ఆయన వెల్లడించారు. ఇక రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చు, సమావేశాలూ, సభలు పెట్టుకోవచు. ప్రెస్ మీట్లు కూడా నిర్వహించవచ్చు అని రఘునందన్ రావు చెప్పారు. కానీ పవన్ ని కవిత ఈ విషయంలో ప్రాంతీయతత్వంతో విమర్శించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఏపీకి వెళ్తే కవిత ఎందుకు వద్దనలేదని రఘునందన్ రావి సూటిగా ప్రశ్నించారు.

రతనాల సీమ చేస్తామని :

కేసీఆర్ సీఎం గా ఉండగా ఏపీకి వెళ్ళారని, వైసీపీ మహిళానేత రోజా ఇంటికి కూడా వెళ్ళారని రఘునందన్ రావు గుర్తు చేశారు. అంతే కాదు రాయలసీమను రతనాల సీమగా చేస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరి బీఆర్ఎస్ ని విస్తరించేందుకు కేసీఆర్ వేరే రాష్ట్రాలకు వెళ్తే అపుడు కవిత ఎందుకు వద్దనలేదని లాజిక్ పాయింట్ నే రఘునందన్ రావు తీసారు. ఈ రోజున పవన్ హైదరాబాద్ లొ సభ పెట్టాలనుకుంటే తమ ఉనికికే ముప్పు వస్తుందని భావించే ఈ విధంగా కవితతో పాటు చాలా మంది మాట్లాడుతున్నారని రఘునందన్ రావు విమర్శించారు.

పాయింటే కదా మరి :

రఘునందన్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తే పాయింటే కదా మరీ అనిపించక మానదు. పవన్ తెలంగాణలో తన పార్టీని విస్తరించకూడదు అంటున్న వారు అంతా కేసీఆర్ జాతీయ పార్టీ రాజకీయాల గురించి ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ గురించి ఎందుకు మాట్లాడరు అంటే జవాబు చెప్పాల్సి ఉంది కదా అని అంటున్నారు. ఇదిలా ఉంటే కవిత పవన్ ని టార్గెట్ చేయడం విమర్శలు చేయడం పట్ల కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె పార్టీని జనంలోకి తీసుకుని పోయే ప్రయత్నంలో ఈ సెంటిమెంట్ అస్త్రాన్ని తీస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా పవన్ ప్రెస్ మీట్ తాలూకా ప్రకంపనలు అయితే ఇంకా తెలంగాణాలో ప్రతిధ్వనిస్తున్నాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News