వంగవీటి కోసం.....క్రిష్ణా తీరాన రాజకీయ కలకలం
వారు ముగ్గురూ మంచి మిత్రులు వారి స్నేహ బంధం రాజకీయాలకు అతీతం అయిందని చెబుతూ ఉంటారు.;
వారు ముగ్గురూ మంచి మిత్రులు వారి స్నేహ బంధం రాజకీయాలకు అతీతం అయిందని చెబుతూ ఉంటారు. అయితే వర్తమాన రాజకీయాల్లో రక్తబంధాలే పలుచన అయిపోయిన నేపధ్యం ఉంది అందువల్ల ఈ బంధాలను చూసిన వారు కూడా వెనక రాజకీయం ఉందనే అనుకుంటారు. అదేమీ లేదు అని వారు చెబుతున్నా ప్రచారం మాత్రం ఆ విధంగానే సాగుతూ వస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు మిత్రులు ఎవరూ ఏమా కధ అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.
ముగ్గురు మిత్రులు కలిసారు :
ఇదిలా ఉంటే వంగవీటి రాధాక్రిష్ణకు రీసెంట్ గా ఒక కుమార్తె జన్మించింది. బారసాల వేడుకకు వైసీపీ కీలక నేతలు హాజరు కావడమే అసలైన విశేషం. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ కలసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఊయలలో పాపను చూసి వీరంతా మురిసిన దృశ్యాలు అలాగే కలిసి కబుర్లు చెప్పుకుంటున్న సన్నివేశాలు అన్నీ వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది కేవలం కుటుంబపరమైన కార్యక్రమంగా సాగినా కూడా దీని వెనక కూడా రాజకీయమేదో ఉందా అన్న చర్చకు తెర లేస్తోంది.
రాధా సంగతి ఏమిటి :
తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధాక్రిష్ణకు పదవి అయితే ఇప్పటిదాకా ఏదీ లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ పదవులు అనేకం భర్తీ అయ్యాయి. కానీ రాధకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు, అలాగే కీలక నామినేటెడ్ పదవులు కూడా భర్తీ అయ్యాయి. వీటిలో సైతం రాధా ఊసే లేదు. దాంతో ఆయన అనుచరులు అభిమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎపుడో రెండు దశాబ్దాల క్రితం ఎమ్మెల్యే పదవి తప్ప రాధాకు అధికార పదవులు ఏవీ దక్కలేదని వారు గుర్తు చేసుకుంటున్నారు.
అసంతృప్తి ఉందా :
ఇదిలా ఉంటే రాధాకు ఏ పదవులూ దక్కలేదన్న అసంతృప్తి అయితే ఆయనలో ఉందా అంటే ఏమీ తెలియడం లేదు, కానీ అనుచరులు అభిమానులు మాత్రం మధన పడుతున్నారు అన్నది వాస్తవం అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కూటమి అధికారంలోకి రాగానే రాధాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేస్తారని అభిమానులు అనుకున్నారు కానీ అలా జరగలేదని కూడా అంటున్నారు. దీంతో రాధా ఆలోచనలు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. రాధా గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. దాంతో ఆయన మౌనం వెనక ఏమి ఉందని కూడా అంతా ఆలోచిస్తున్నారు.
వైసీపీ వ్యూహమేంటి :
ఇక ఏపీలో వైసీపీ రాజకీయ వ్యూహాలు దానికి ఉన్నాయి. వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకోవాలని ఎన్నికల ముందు నుంచే ఆలోచన చేస్తూ వచ్చింది అని అంటారు. ఇపుడు చూస్తే వంగవీటి వర్గంలో అసంతృప్తి ఉందని వార్తలు వస్తున్న క్రమంలో తమ పార్టీకి చెందిన కీలక నేతల ద్వారా వంగవీటితో రాయబారాలు నడుపుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. కొడాలి నాని వల్లభనేని వంశీ ఈ ఇద్దరూ రాధా ఇంటికి రావడంతో ఈ ప్రచారం మరింత ఎక్కువ అయింది. ఈ ఇద్దరు నేతలు దానికి ముందు జగన్ ని కలసి వచ్చారని కూడా చెబుతున్నారు
రాజకీయంగా ఒకే దారిలోకి :
దాంతో వంగవీటిని పార్టీ వైపు రప్పిస్తారా ఈ మిత్రుల మధ్య ఉన్న అనుబంధం తో రాజకీయంగా ఒకే దారిలోకి వస్తారా అన్నదే చర్చగా ఉంది ఇదే ఇపుడు కృష్ణా తీరాన రాజకీయంగా సాగుతున్న కలకలంగా మారింది. అయితే 2027లో వంగవీటికి కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆ మీదట మంత్రి చాన్స్ ఉన్నా ఉండొచ్చు అని టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట. అందువల్ల వంగవీటి తొందర పడి జంప్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని అనే వారు ఉన్నారు అయితే కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ కి మాత్రమే వచ్చారు తప్ప వేరే విధమైన రాజకీయాలు లేవని అంటున్న వారూ ఉన్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.