పురంధేశ్వరికి కేంద్ర మంత్రి అవడమే లక్ష్యమా ...

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి ఈసారి ఖాయమా అంటే అవుని అని ఆమె అభిమానులు అనుచరులు అనవచ్చు.;

Update: 2023-11-09 04:03 GMT

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి ఈసారి ఖాయమా అంటే అవుని అని ఆమె అభిమానులు అనుచరులు అనవచ్చు. కానీ ఆమె మీద విమర్శలతో విరుచుకుని పడే వైసీపీ నేతలు చెప్పడం మాత్రం విడ్డూరమే అనుకోవాలి.

వైసీపీ నేత సినీ నటుడు పోసాని క్రిష్ణ మురళి లాంటి వారు అయితే పురంధేశ్వరి రాజకీయాలని ఎండగడుతూనే ఆమె కేంద్ర మంత్రి అవుతారు. ఇది ఖాయం. అందుకోసమే ఆమె చేయాల్సింది చేస్తున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు.

ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి టార్గెట్ ఒక్కటే టీడీపీతో పొత్తు కలపడం తాను ఎంపీ కావడం అని ఆయన అంటున్నారు. అలా గెలిచిన తరువాత ఆమె ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని అదే ఆమె టార్గెట్ అని అంటున్నారు

ఇక బీజేపీ టీడీపీ పొత్తు లేకపోతే ఆమె టీడీపీలోకి చేరిపోయి అయినా ఎంపీగా పోటీ చేసి ఆ తరువాత ఇండియా కూటమి కేంద్రంలో వస్తే అందులో చేరి అయినా మంత్రి అవుతారని అంటున్నారు ఇది నిజంగా జరుగుతుందా పురంధేశ్వరి ఆ రకమైన వ్యూహంతో ఉన్నారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

జగన్ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కావాలని కోరుతూ పురంధేశ్వరి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కే లేఖ రాశారు. పదేళ్ళుగా బెయిల్ మీద ఉన్నారని ఆమె మొత్తం అంతా ఆ లేఖలో ఏకరువు పెట్టారు. దీని మీద వైసీపీ ఒక్క లెక్కన మండిపోతోంది. మంత్రి ఆర్కే రోజా అయితే జగనే స్వయంగా తన మీద కేసుల విచారణను తొందరగా పూర్తి చేయాలని కోరుకున్నారని చెప్పుకొచ్చారు.

పురంధేశ్వరిది స్వార్ధపూరిత రాజకీయం టీడీపీతో కుమ్మక్కు రాజకీయం అని ఆమె అంటున్నారు. పోసాని కూడా చంద్రబాబు మీద సీబీఐ విచారణకు ఎందుకు సుప్రీం కోర్టుని కోరలేదు అని ప్రశ్నించారు. ఇవన్నీ పక్కన పెడితే పురంధేశ్వరి ఈసారి కేంద్ర మంత్రి అవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది.

అయితే ఆమె రాజకీయ జీవితం 2024 ఎన్నికల నాటికి రెండు దశాబ్దాల కాలం అవుతుంది. అందులో తొలి పదేళ్ళ కాలం సాఫీగా సవ్యంగా సాగిన మలి పదేళ్ళూ మాత్రం ప్రతిపక్షంలో పదవీ వియోగంతోనే సాగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించి ఉన్నారు.

ఇక పురంధేశ్వరికి దాదాపుగా ఈ టెర్మ్ తో రాజకీయం ఆపేయాలని ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి దగ్గుబాటి వారి వారసుడిగా హితైష్ ని తెర మీదకు తెచ్చి పోటీ చేయించాలని ఉందని అంటున్నారు. ఈ ఎన్నికల వరకూ అయితే అది కుదరడంలేదు. ఆ మధ్యన హితైష్ టీడీపీ టికెట్ మీద పోటీ చేతారని అది కూడా చీరాల నుంచి పోటీకి దిగాలని కూడా భావించారు.

అయితే పురంధేశ్వరి బీజేపీలో ఉండడంతో కుమారుడిని టీడీపీ ద్వారా పోటీ చేయించడం కుదరదని రాజకీయంగా సమీకరణలు తేడా వస్తాయని భావించి ఆగారని అంటారు. ఇక ఈ దఫాకు పురంధేశ్వరి తానుగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా ఉంటూ రానున్న అయిదేళ్ళలో హితైష్ కి రాజకీయంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అందువల్లనే ఆమె రాజకీయంగా కీలకంగా ఉంటున్నారని, పొత్తుల కోసం చూస్తున్నారని అంటున్నారు. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదరకపోతే ఆమె బీజేపీలో ఉండరని వైసీపీ నేతలు అంటున్నారు. మరి పురందేశ్వరి అలా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News