2026 ఐటీ ప్రపంచంలో రారాజు రేసులో ఉన్న కంపెనీలు ఇవే..?
ఇది కేవలం కంపెనీల ర్యాంకింగ్ మాత్రమే కాదు; భవిష్యత్ ఆర్థిక శక్తి ఎటు కదులుతోందో చెప్పే మ్యాప్ కూడా.;
డిజిటల్ యుగంలో చమురు స్థానాన్ని ఇప్పుడు డేటా, బొగ్గు స్థానాన్ని కోడ్ ఆక్రమించాయి. ప్రభుత్వాలు కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, స్టార్టప్‌లు కావచ్చు అందరికీ ఇప్పుడు ఐటీ సేవలే ఆధారం. అలాంటి నేపథ్యంలో 2026లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ సర్వీస్ బ్రాండ్ల జాబితా ఒక కీలక సంకేతం ఇస్తోంది. ఇది కేవలం కంపెనీల ర్యాంకింగ్ మాత్రమే కాదు; భవిష్యత్ ఆర్థిక శక్తి ఎటు కదులుతోందో చెప్పే మ్యాప్ కూడా.
అగ్ర స్థానంలో యాక్సెంచర్
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది యాక్సెంచర్ (Accenture). దాదాపు $42.3 బిలియన్ల బ్రాండ్ విలువతో ప్రపంచ ఐటీ సేవల రంగాన్ని ఈ కంపెనీ ఏలుతోంది. ఆక్సెంచర్ బలమేంటంటే.. అది కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు. కన్సల్టింగ్, క్లౌడ్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ.. ప్రతి ట్రెండ్‌లో ముందే ఉంటుంది. పెద్ద పెద్ద ప్రభుత్వాలు, మల్టీనేషనల్స్ ‘డిజిటల్ మార్పు’ అనగానే ముందుగా తలుచుకునే పేరు ఆక్సెంచర్ కావడం యాదృచ్ఛికం కాదు.
రెండో స్థానంలో టాటా..
రెండో స్థానంలో ఉంది భారత గర్వకారణం టాటా కన్సల్‌టెన్సీ (Tata Consultancy Services -TCS). $21.2 బిలియన్ల బ్రాండ్ విలువతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఐటీ సర్వీస్ బ్రాండ్‌గా నిలవడం భారత్‌కు పెద్ద గుర్తింపు. TCS బలం స్థిరత్వం. తక్కువ రిస్క్, దీర్ఘకాలిక క్లయింట్ సంబంధాలు, భారీ డెలివరీ సామర్థ్యం. ‘నిశ్శబ్దంగా కానీ బలంగా’ ఎదిగే సంస్థకు ఇది ఉత్తమ ఉదాహరణ. మూడో స్థానంలో ఇన్ఫోసిస్ నిలిచింది. $16.4 బిలియన్ల విలువతో ఇన్ఫోసిస్ ఇప్పుడు సంప్రదాయ ఐటీ సేవల నుంచి బయటకి వచ్చి ఏఐ (AI), డిజిటల్, ఆటోమేషన్ వైపు గట్టిగా అడుగులు వేస్తోంది. గతంలో ‘ప్రాసెస్ కంపెనీ’గా గుర్తింద దక్కించుకున్న ఇన్ఫోసిస్ ఇప్పుడు ‘నాలెడ్జ్ & ఇన్నోవేషన్ కంపెనీ’గా మారేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మార్పే దాని బ్రాండ్ విలువలో ప్రతిబింబిస్తోంది.
యూఎస్ దిగ్గజ కంపెనీ ఐబీఎం..
అమెరికాకు చెందిన దిగ్గజం ఐబీఎం (IBM) $11 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉంది. ఒకప్పుడు ప్రపంచ ఐటీకి పర్యాయపదంగా ఉన్న ఐబీఎం, ఇప్పుడు క్లౌడ్, హైబ్రిడ్ ఐటీ, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్లపై ఫోకస్ పెట్టింది. స్టార్టప్‌లతో పోలిస్తే వేగం తక్కువైనా, నమ్మకంలో ఐబీఎంకు ఇప్పటికీ తిరుగులేదు. జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డేటా, ఫ్రాన్స్‌కు చెందిన క్యాప్ జమిని లాంటి సంస్థలు టాప్-6లో నిలవడం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ఐటీ సేవలు ఇక అమెరికా–భారత ద్వైపాక్షిక రంగం కాదు. యూరప్, జపాన్ లాంటి దేశాలు కూడా గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ జాబితాలో మరో ముఖ్యమైన అంశం టాప్-10లో నాలుగు భారతీయ కంపెనీలు ఉండడం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, విప్రో కలిసి చూస్తే, భారత ఐటీ రంగం కేవలం ‘చౌక లేబర్’ మీద ఆధారపడిన పరిశ్రమ కాదని మరోసారి రుజువవుతోంది. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. భారత కంపెనీల్లో ఏ ఒక్కటీ ఆక్సెంచర్ స్థాయిలో బ్రాండ్ విలువను సాధించలేకపోయింది. అంటే మనకు స్కేలు ఉంది, టాలెంట్ ఉంది.. కానీ గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్‌షిప్ ఇంకా పూర్తిగా దక్కలేదు.
భవిష్యత్తులో ఈ జాబితా మారే అవకాశాలున్నాయి. AI సేవలు, జెనరేటివ్ AI, ఇండస్ట్రీ-స్పెసిఫిక్ సొల్యూషన్లు ఏ కంపెనీ ఎంత వేగంగా అందిపుచ్చుకుంటుందో, అదే దాని బ్రాండ్ విలువను నిర్ణయిస్తుంది. కేవలం కోడ్ రాయడం కాదు, వ్యాపార సమస్యలను పరిష్కరించగలగడం.. అదే రేపటి ఐటీ రాజ్యం. 2026 జాబితా ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తోంది.. ఐటీ సేవల యుద్ధం ఇప్పుడు ప్రారంభ దశలో కాదు, పరిపక్వ దశలో ఉంది. ఇక్కడ నిలవాలంటే టెక్నాలజీతో పాటు ఆలోచనల్లోనూ నాయకత్వం అవసరం.