‘మిస్టర్ కూల్’ తోపాటు మిస్టర్ బిజినెస్ : 1000 కోట్ల సామ్రాజ్యాధినేత
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇది అందరి జీవితాల్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.;
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. ఇది అందరి జీవితాల్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం. ముఖ్యంగా రంగుల ప్రపంచం అయిన సినిమాల్లో.. స్వల్పకాలం ఫామ్ తో ఆడే క్రికెట్ లో క్రేజ్ ఉన్నప్పుడే ‘క్యాష్’ చేసుకోవడం అనేది అందరూ చేయాల్సిన ముఖ్యపని.. అలా చేయలేదు కాబట్టే సినీ ఇండస్ట్రీలో ‘సావిత్రి’, రాజనాల లాంటి వారు తమ అంతిమ గడియాల్లో అష్టకష్టాలు పడి మృత్యువాతపడ్డారు.ఇక క్రీడాలోకంలో సచిన్ తో సమానంగా ఆడినా ఆర్థిక పరిణతి కనబరచక ‘వినోద్ కాంబ్లీ’ చివరకు అందరి సాయంతో బతుకు ఇడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సూత్రం ఒంటబట్టించుకున్న టీమిండియా దిగ్గజ కూల్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ముందే సర్దుకున్నారు. తను ఎక్కడి నుంచి వచ్చాడు.. ఎలా ఎదిగాడు అన్నది గుర్తు పెట్టుకొని భవిష్యత్తుకు సరైన బాటలు వేసుకున్నాడు. అతడి ఎదుగుదల సినిమాగా వచ్చింది. భావి క్రికెటర్లకు ఆయన జీవితం ఒక ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినగానే క్రీడాభిమనులకు గుర్తొచ్చేది ‘మిస్టర్ కూల్’ వైఖరి.. హెలిక్యాప్టర్ షాట్లు, భారత్ కు ఎన్నో చిర్మస్మణీయ విజయాలను అందించిన కెప్టెన్సీ.. మైదానంలోనూ ఎంత కూల్ గా.. ఫోకస్డ్ గా ఉంటాడో.. వ్యక్తిగత జీవితంలోనూ అంత నిశ్శబ్ధంగా తన లక్ష్యాలను ఛేదిస్తాడు ధోని.. అయితే అతనిలో క్రికెట్ కు మించిన మరో కోణం ఉంది. అది చాలా మంది గుర్తించని అపారమైన వ్యాపార దృష్టి. క్రికెట్ లో ట్రోఫీలను సాధించినట్లే.. సైలెంట్ కిల్లర్ గా ధోనీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అంచనాల ప్రకారం.. ప్రస్తుతం అతడి వ్యాపారాల విలువ రూ.1000 కోట్లుగా ఉంది.
చెన్నైతో బంధం.. అదే ఒంటబడిన వ్యాపార దృక్పథం
ధోనీ జీవితంలో కెరీర్ లో చెన్నైకి ప్రత్యేక స్థానం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తో కొనసాగుతున్న అతడి అనుబంధం కేవలం క్రీడలకే పరిమితం కాలేదు. ఈ బలమైన బంధం ధోని వ్యాపార దృక్పథాన్ని కూడా మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంతంగా.. సుధీర్ఘంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ధోనీ నైజం. అదే నైజాన్ని వ్యాపార ప్రపంచంలోనూ అమలు చేస్తూ.. వైవిధ్యభరితమైన రంగాలలో పెట్టుబడులు పెట్టారు.
ధోనీ ఫోర్ట్ ఫోలియా.. పలు రంగాల్లో పెట్టుబడులు
ఎంఎస్ ధోని కేవలం ఒకే రంగంలో కాకుండ భవిష్యత్తులో అపారమైన వృద్ధి ఉన్న పలు వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టారు. ధోనికి క్రికెట్ తోపాటు ఫుట్ బాల్ పై కూడా మక్కువ ఉంది. దీనికి నిదర్శనంగా ఇండియన్ సూపర్ లీగ్ లోని చెన్నై ఫుట్ బాల్ క్లబ్ లో ఆయన సహ యజమానిగా ఉన్నారు. ఇక వాహనరంగంలోనూ ప్రవేశించారు. కార్స్ 24 అనే సెకండ్ హ్యాండ్ కార్ల క్రయ విక్రయాల ఫ్లాట్ ఫామ్ లో ధోని పెట్టుబడి పెట్టారు. ఇక ఎలక్ట్రిక్ సైకిల్స్ కు సంబంధించిన స్టార్టప్ ‘ఈ మోటారాడ్’ భవిష్యత్తు రవాణా వ్యవస్థకు దోహదపడే ఈ రంగంలో ధోని పెట్టుబడులు పెట్టడం అతడి దూరదృష్టికి నిదర్శనం. ఇక చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు అకౌంటింగ్ సేవలు అందించే ‘ఖాతాబుక్’ లో కూడా ధోని పెట్టుబడులు పెట్టారు. ఇక ‘సెవన్ బై ఎంఎస్ ధోని’ అనే బ్రాండ్ ద్వారా ఆయన తన లైఫ్ స్టైల్ దుస్తులు, క్రీడా పరికరాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ‘తగ్దారోహో’ అనే ఫిట్ నెస్, వెల్ నెస్ ఫ్లాట్ ఫామ్ లోనూ ధోనికి వాటాలన్నాయి.
క్రికెట్ పిచ్ పై ప్రత్యర్థులను అంచనావేసి ఎలా అయితే విజయం సాధిస్తాడో.. అదే తరహాలో వ్యాపార ప్రపంచంలోనూ భవిష్యత్తు అవకాశాలను అంచనావేస్తూ.. 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి ధోని ఇప్పుడు ‘మిస్టర్ కూల్’ తోపాటు మిస్టర్ బిజినెస్ గా కూడా నిరూపించుకున్నాడు.. మైదానంలో ఉన్నట్టుగానే వ్యాపారంలోనూ ధోని లాంగ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవతున్నారని స్పష్టమవుతోంది.