రాకెట్ స్పీడ్ లో మస్క్ సంపద.. సెకనుకు ఎంతో తెలుసా..!
ఈ క్రమంలో తాజాగా 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని ఆర్థిక, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.;
ఈ భూగ్రహం పై అత్యంత ధనవంతుడు, అపర కుబేరుడు, టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ సంపద రోజు రోజుకీ.. సారీ.. సెకను సెకనుకు స్పేస్ ఎక్స్ రాకెట్ కు మించిన స్పీడ్ తో దూసుకుపోతుంది! ఈ క్రమంలో తాజాగా 600 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని ఆర్థిక, మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అవును... ఎలాన్ మస్క్ సంపద రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. తాజాగా స్పేస్ ఎక్స్ ఐపీఓ విలువ పెరుగుతున్నట్లు కథనాలొచ్చిన నేపథ్యంలో ఆయన సంపద అమాంతం పెరిగి.. ఒక్కరోజులోనే 168 బిలియన్ డాలర్ లకు పెరిగింది. దీంతో.. ఆయన నికర సంపద సుమారు 670 బిలియన్ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది! దీంతో.. ఈ భూగ్రహంపై తనను మించిన ధనవంతుడు లేడు అన్నట్లుగా ఎలాన్ మస్క్ అవతరించారు.
వచ్చే ఏడాది ఐపీఓకు స్పేస్ ఎక్స్!:
రాకెట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ లో ఎలాన్ మస్క్ కు 42శాతం వాటా ఉండగా.. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కు వెళ్లనుంది. ఈ క్రమంలో తొలుత 400 బిలియన్ డాలర్లతో ఎక్స్చేంజీ మార్కెట్ లోకి రానున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో వార్తలు వచ్చిన పరిస్థితి. మరోవైపు 800 బిలియన్ డాలర్ల విలువతో ఐపీఓకు వస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ సంపద పరుగులు పెడుతోంది.
మరోవైపు మస్క్ కు టెస్లాలో 12శాతం వాటా.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ ఏఐ హోల్డింగ్స్ లో 53శాతం వాటా ఉంది.
ఐదేళ్లలోనే 600 బిలియన్ డాలర్లు!:
వాస్తవానికి 2020 మార్చి నాటికి మస్క్ సంపద 24.6 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది అక్టోబరులో ఆ నికర సంపద 500 బిలియన్ డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 15నాటికి 600 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. దింతో.. ఐదేళ్లలోనే 600 బిలియన్ డాలర్ల సంపదను గతంలో ఎవరూ ఆర్జించని స్థాయిలో మస్క్ సంపాదించారు.
సెకనుకు 6,750 డాలర్లు!:
ఎలాన్ మస్క్ సంపదను రోజుకి ఎంత, గంటకు ఎంత, సెకనుకు ఎంత అనేది ఇప్పుడు చూదామ్...! మస్క్ సంపద రోజుకు $584 మిలియన్లు (దాదాపు రూ.52 వేల కోట్లు), గంటకు $24 మిలియన్లు (దాదాపు రూ.21 వేల కోట్లు), సెకనుకు $6,750 (దాదాపు రూ.6.10 లక్షలు)