భట్టి ఫైర్..పెట్టుబడులు.. కట్టుకథలు.. విషపు రాతల రాధాకృష్ణ
ఆ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకు ఎడిటోరియల్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని భట్టి మండిపడ్డారు.;
తెలంగాణలో తలెత్తిన సింగరేణి వివాదం ఇప్పుడు అప్పుడే చల్లారేలా లేదు. ఇటీవలి కాలంలో సింగరేణి బొగ్గు బ్లాక్ టెండర్ల విషయమై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క టార్గెట్ గా కథనాలు రావడంతో చర్చనీయం అయింది. దీనిపై ఇప్పటికే గత వారం భట్టి విలేకరుల సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించారు. ఆ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకు ఎడిటోరియల్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని భట్టి మండిపడ్డారు. అయితే, ఆ తర్వాత కూడా ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో సింగరేణి అంశమై కథనాలు ఆగడం లేదు. వరుసగా ప్రత్యేక కథనాలు రాస్తుండడంతో తాజాగా శనివారం భట్టి మళ్లీ విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, కట్టుకథల విషపు రాతల రాధాకృష్ణ అంటూ నిప్పులు చెరిగారు. ఆయన రాసిన కొత్త పలుకు నుంచే ఇదంతా మొదలైందని భట్టి తీవ్రంగా స్పందించారు. ఇదంతా చూస్తుంటే వివాదం ఇప్పుడు అప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. మరోవైపు భట్టికి మద్దతుగా కొన్ని వర్గాలు, రాధాకృష్ణకు అండగా మరికొన్ని వర్గాలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన వర్గం... రాధాకృష్ణ పట్ల భట్టి తీరును తాము ఖండిస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. కాగా, శనివారం భట్టి విలేకరుల సమావేశానికి కారణం.. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. సింగరేణి బోర్డులో కేంద్ర ప్రభుత్వం తరఫున ఉండే డైరెక్టర్ సంఖ్యను పెంచుకునేందుకు ఆలోచన చేస్తోందని వివరించింది. తద్వారా సంస్థపై నిర్ణయాధికారం కేంద్రానికి వస్తుందని పేర్కొంది. సింగరేణి ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, గనుల వివాదమే దీనికి కారణమని తెలిపింది. నైనీ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై సింగరేణి కేంద్రం ఆరా తీసిందని కూడా రాసింది. ఈ నేపథ్యంలోనే భట్టికి మరోసారి తీవ్రం ఆగ్రహం కలిగింది. మీడియా సమావేశంలో నేరుగా రాధాకృష్ణను విమర్శించారు. సింగరేణి తెలంగాణ ఆత్మ అని.. అలాంటి సంస్థపై కట్టుకథలు రాస్తున్నారని అన్నారు. తద్వారా సింగరేణి ఉద్యోగుల మనో స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.
సైట్ విజిట్ ఎప్పటిది..?
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయం ప్రస్తావించిన భట్టి.. అందులో వివాదాస్పదంగా నిలిచిన సైట్ విజిట్ అంశాన్ని 2018లో ప్రవేశపెట్టారని తెలిపారు. అందుకే 2021లో సైట్ విజిట్ ను సింగరేణి తప్పనిసరి చేసిందన్నారు. ఈ రెండు సందర్భాల్లో అధికారంలో ఉన్నది ఎవరు..? (బీఆర్ఎస్) అని భట్టి నిలదీశారు. సింగరేణికి స్వయం ప్రతిపత్తి ఉన్న సంగతిని గుర్తుచేస్తూ, అది తీసుకునే నిర్ణయాలు అన్నీ రాష్ట్ర మంత్రివర్గం వద్దకు రావని భట్టి వివరించారు. వాస్తవం ఇలా ఉండగా.. సైట్ విజిట్ నిబంధన దేశంలో ఎక్కడా లేదనేలా దుష్ప్రచారం సాగించారని మండిపడ్డారు. అందుకే టెండర్లు రద్దు చేయకపోతే అపోహలు వస్తాయనే, రద్దు చేశామని పేర్కొన్నారు. అసలు నైనీ బ్లాక్ టెండర్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పిలిచినవేనని అన్నారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే 20 బీఆర్ఎస్ పాలనా కాలం నాటివేనని వివరించారు.
దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ...?
ఉప ముఖ్యమంత్రి భట్టి-ఏబీఎన్ రాధాకృష్ణ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ఈ ఆదివారం కొత్త పలుకులో రాధాకృష్ణ మరోసారి తన అభిప్రాయాలు వెల్లడించడం ఖాయం. ఇక సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం (కోల్ బెల్ట్)లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు రోజులు పర్యటించనున్నారు. ఆయన పర్యటన శనివారం, ఆదివారం సాగనుంది. ఇందులో మరింత రాజకీయం రగలడం ఖాయం. చివరకు ఫుల్ స్టాప్ ఎక్కడ? ఎవరిది రైటు? అనేది ఎలా తేలుతుంది? అన్నది చూడాలి.