వంటింట్లో యుద్ధం.. హైదరాబాద్ లో హోటల్స్ బంద్! గ్యాస్ సిలిండర్ కొరత నిజమేనా?

దేశ రాజధాని ఆర్థిక ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు ప్రచారం జరుగుతోంది.;

Update: 2026-03-10 12:30 GMT

ఇరాన్ తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మన వంటింట్లోకి చొరబడుతుందనే భయాన్ని కలిగిస్తోంది. యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. దేశంలో సరిపడినంత చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు నెలకొంటున్నాయనే ప్రచారం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వంట గ్యాస్ కొరత కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితులు నెలకొంటోందని చెబుతున్నారు. దేశ రాజధాని ఆర్థిక ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు ప్రచారం జరుగుతోంది.

గ్యాస్ కొరతతో ముంబైలో హోటల్స్ మూసివేస్తున్నట్లు హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే నగరంలో సగం హోటళ్లు తెరుచుకునే అవకాశం లేదని అంటున్నారు. ఒక్క ముంబైలోనే కాదు రాజధాని ఢిల్లీ, బెంగళూరుల్లో కూడా గ్యాస్ కొరత వేధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హైదరాబాద్ లోనూ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న హాస్టళ్లు, హోటళ్లకు ఒక్కరోజుకు సరిపడే వాణిజ్య సిలెండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మార్కెట్లో వాణిజ్య గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో రేపటి నుంచి హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, హాస్టళ్లు నడపడం కష్టమని అంటున్నారు. కనీసం సిబ్బందికి కూడా అన్నం పెట్టే పరిస్థితి లేదని కొందరు హోటల్స్ యజమానులు చెబుతున్నారు. నగరంలోని చాలా హోటళ్లకు రోజుకు 15 నుంచి 20 సిలిండర్లు అవసరమవుతాయని చెబుతున్నారు. అయితే సరఫరా లేకపోవడంతో ఆయా హోటళ్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. ఇక పీజీ హాస్టళ్లలో ఉండేవారు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తోందని అంటున్నారు.

కాగా, ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని హోటల్, రెస్టారెంట్ పరిశ్రమల సంఘం డిమాండ్ చేస్తోంది. దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడాన్ని ఆ సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాసింది. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సాకుగా చూపుతూ సిలిండర్ల పంపిణీని డిస్టిబ్యూటర్లు అడ్డుకుంటున్నారని, దీనివల్ల రెస్టారెంట్ల నిర్వహణ కష్టతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు హోటల్, ఆహార సేవల రంగాలకు వర్తించదని ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతూ లేఖ రాసింది. మరోవైపు గ్యాస్ కొరత రాకుండా కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు.

వాణిజ్య అవసరాలకు సిలిండర్లు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఆ ప్రభావం గృహ వినియోగంపై చూపకుండా జాగ్రత్త పడుతోంది. గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడాన్ని అరికట్టేందుకు, అందరికీ గ్యాస్ సమానంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో గ్యాస్ బుకింగ్ విధానంలో మార్పులు చేసింది. ఇప్పటివరకు రీఫిల్ బుక్ చేసుకునేందుకు 21 రోజులు ఉన్న గడువును మరో నాలుగు రోజులు పెంచింది. ఇకపై గ్యాస్ సిలిండర్ డెలవరీ అయిన 25 రోజుల తర్వాత కొత్త రీఫిల్ బుక్ చేసుకునేలా మార్పులు చేసిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక వాణిజ్య సిలిండర్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం హోటల్ పరిశ్రమ వర్గాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి.

Tags:    

Similar News