ధర్మేంద్ర తరువాత ...టార్గెట్ అమిత్ షా !

ఎన్డీయే ప్రభుత్వం ఇపుడు రాజకీయంగా అనేక సవాళ్ళు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే నీటి పేపర్ లీక్ తరువాత ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడింది.

Update: 2026-07-29 22:30 GMT

ఎన్డీయే ప్రభుత్వం ఇపుడు రాజకీయంగా అనేక సవాళ్ళు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చెప్పాలంటే నీటి పేపర్ లీక్ తరువాత ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడింది. రెండున్నర నెలల విద్యార్ధుల ఉద్యమం తరువాత ఎట్టకేలకు దిగి వచ్చి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అక్కడితో కధ సుఖాంతం అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు విద్యార్థుల పోరాటం నుంచి రాజకీయ సమరంగా ఈ ఇష్యూ కొత్త రూపు సంతరించుకుంది. పార్లమెంట్ లో విద్యార్థుల మీద జరిగిన పోలీసుల దాడులు లాఠీచార్జి వంటి వాటి మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా విపక్ష నేతలు అంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అలాగే కొత్త విద్యా మంత్రి ప్రహ్లాద్ జోషీ మీద కూడా గట్టిగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీ అయితే పార్లమెంట్ లో తమ స్టైల్ మార్చారు. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో వారు చేస్తున్న హాట్ కామెంట్స్ అధికార పక్షానికి గట్టిగానే గుచ్చుకుంటున్నాయి.

నేరుగానే గురి పెడుతూ :

ఇదిలా ఉంటే లోక్ సభలో రాహుల్ గాంధీ అమిత్ షాను నేరుగానే గురి పెడుతూ కీలక వ్యాఖ్యలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. ఇరువర్గాల సభ్యులు గట్టిగా అరుచుకోవడంతో సభలో కోలాహలం ఏర్పడింది. ఇక అటూ ఇటూ పక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. విద్యార్థుల మీద పోలీసుల దాడికి అమిత్ షాయే కారణం అంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన పోలీసు దమనకాండకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రధాన బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన ఆయన ఆదేశాలతోనే పెల్లెట్ గన్లు, లాఠీచార్జీలు జరిగాయని లోక్‌సభలో రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీస్ వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుందని విద్యార్థులపై జరిగిన హింసకు అమిత్ షా మొత్తం బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

సభలో మాట్లాడనివ్వలేదంటూ :

ఇక ఇదే విషయం మీద రాహుల్ గాంధీ లోక్ సభలో తనను మాట్లాడనివ్వలేదని అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇంకా కీలక వ్యాఖ్యలు మొత్తం అక్కడ చేశారు. సభలో అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల అమిత్ షాకు క్షమాపణ చెప్పాలని అధికార పక్షం కోరింది. రాహుల్ గాంధీవి ఆధారం లేని ఆరోపణలు కాబట్తి ఆయన లోసభకు క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. అయితే తాను ఎలాంటి క్షమాపణలు చెప్పేది లేదని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎప్పటికీ క్షమాపణ చెప్పనని రాహుల్ గాంధీ పేర్కొనడం విశేషం. ఇక మీడియా ముందు కూడా రాహుల్ గాంధీ ఇదే తరహాలో అమిత్ షా మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షాని తొలగించాలంటూ :

అంతే కాదు కేంద్ర హోం మంత్రి అమిత్ షాని తొలగించాలని కూడా రాహుల్ గాంధీ సరికొత్త డిమాండ్ చేయడం విశేషం. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి హోంమంత్రి అమిత్ షానే బాధ్యుడని, ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. విద్యార్ధుల మీద పోలీసుల దాడులలో .పెల్లెట్ గన్స్ వాడకం జరిగిందని ఆయన మండిపడ్డారు. ఆ విధంగా నిరసనకారులపై పోలీసులు పెల్లెట్ గన్స్, మేకులున్న లాఠీలు ఉపయోగించారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దీనికి అంతటికీ హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసి మరీ మీడియా ముందు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఇపుడు రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరారు. ఆయన ఎట్టకేలకు చేశారు, ఇపుడు కాంగ్రెస్ ఇతర విపక్షాలు అన్నీ అమిత్ షాని టార్గెట్ చేస్తున్నాయి. పార్లమెంట్ లోపలా బయటా ఇదే డిమాండ్ తో ముందుకు వస్తున్నాయి. మరి దీని మీద ఎన్డీయే సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతుంది అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News