ఐఫోన్ల తయారీలో భారత్ వాటా అంతలా పెరిగింది

ఎవరు అవునన్నా కాదన్నా..ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనాలని ఆసక్తి ఉన్న వారిలో అత్యధికుల మొదటి ఛాయిస్ ఐఫోన్.;

Update: 2026-03-10 14:30 GMT

ఎవరు అవునన్నా కాదన్నా..ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనాలని ఆసక్తి ఉన్న వారిలో అత్యధికుల మొదటి ఛాయిస్ ఐఫోన్. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరి ముఖ్యంగా.. జెన్ జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవసరమైతే తమ ఇష్టాయిష్టాలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేసి మరీ ఐఫోన్ సొంతం చేసుకోవటానికి సైతం సిద్ధంగా ఉన్నోళ్లు బోలెడంత మంది కనిపిస్తారు.

ఆ మధ్య వరకు అక్కడెక్కడో తయారైన ఐఫోన్ ను.. మనం కొనాల్సి వచ్చేది. అయితే.. అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు.. చైనా కంటే భారత్ లోనే ఉత్పత్తికి మెరుగైన పరిస్థితులు ఉండటంతో పాటు.. ప్రభుత్వ విధానాలు కూడా యాపిల్ సంస్థకు అనుకూలంగా ఉండటంతో తమ ఐఫోన్ల తయారీని పెంచేస్తోంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే ప్రపంచ వ్యాప్తంగా అమ్ముతున్న ఐఫోన్లలో 25 శాతం భారత్ లోనే తయారవుతున్న విషయాన్ని తాజాగా బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది.

2025లో భారతదేశంలో ఉత్పత్తి అయిన ఐఫోన్ల సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే దాదాపు 53 శాతం పెరిగినట్లుగా వెల్లడైంది. చైనాపై ట్రంప్ విధించిన భారీ సుంకాల్ని తప్పించుకోవటానికి యాపిల్ తన ఉత్పత్తులను భారత్ లో ఉత్పత్తి పెంచినట్లుగా పేర్కొంది. బ్లూమ్ బర్గ్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థ ప్రతి ఏడాది గరిష్టంగా 23 కోట్ల ఐఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. 2024లో భారత్ లో 3.6 కోట్ల ఫోన్లు అసెంబుల్ చేయగా.. గత ఏడాది అది కాస్తా 5.5కోట్లకు పెరగటం విశేషం. భవిష్యత్తులో ఐఫోన్ల తయారీ మరింత పెరుగుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దేశీయ తయారీని పెంచే లక్ష్యంతో కేంద్రంలోని మోడీ సర్కారు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కూడా సాయంగా నిలిచిందని చెప్పాలి. ఇది కూడా భారత్ లో యాపిల్ సంస్థ మరింత వేగవంతంగా మారిందని చెప్పాలి. మోడీ సర్కారు ఇస్తున్న స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి సబ్సిడీలు మార్చి 31తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంతో యాపిల్ సంస్థ కొత్త ప్రోత్సాహకాల్ని పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాధారణంగా ఐఫోన్ విడిభాగాల్ని భారత్ కు తీసుకొచ్చి.. ఇక్కడ తయారు చేసి పలు దేశాలకు ఎగుమతి చేస్తున్న వైనం తెలిసిందే. మరి.. ఐఫోన్ బాక్స్ మీద ఏమని ఉంటుంది? మేకిన్ ఇండియా? మేడిన్ ఇండియా? లేక మరేదైనా? అంటే.. మూడోదనే చెప్పాలి. ఒక వస్తువును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేసినప్పుడు మాత్రమే ఆ వస్తువుపై మేడిన్ ఇన్ ఇండియా అని ప్రింట్ చేస్తారు. ఐఫోన్ విషయంలో అందుకుభిన్నంగా జరుగుతుంది కాబట్టి.. భారత్ లో తయారైన ఐఫోన్ బాక్సుల మీద అసెంబుల్డ్ ఇన్ ఇండియా అని ముద్రిస్తారు. విడిభాగాల్ని అసెంబుల్ చేస్తారన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనటం గమనార్హం.

Tags:    

Similar News