ఇరాన్ తో యుద్ధం అమెరికన్ల స్పందన ఇదే
ఇరాన్ తో యుద్ధాన్ని చాలా సింఫుల్ గా తేల్చేస్తున్నారు అగ్రరాజ్య అధిపతి ట్రంప్. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఒక సరదా విహారయాత్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.;
ఇరాన్ తో యుద్ధాన్ని చాలా సింఫుల్ గా తేల్చేస్తున్నారు అగ్రరాజ్య అధిపతి ట్రంప్. మరింత స్పష్టంగా చెప్పాలంటే.. ఒక సరదా విహారయాత్రగా ఆయన అభివర్ణిస్తున్నారు. యుద్ధం కారణంగా ఓపక్క వందలాది మంది ప్రాణాలు పోవటం.. మరోవైపు విలువైన సహజ వనరులు సర్వనాశనం కావటం.. ప్రపంచం మొత్తం కిందా మీదా పడుతున్న ఈ యుద్ధాన్ని ట్రంప్ అంత తేలిగ్గా తీసుకోవటంపై అమెరికన్లు ఎలా స్పందిస్తున్నారు?
ఇరాన్ తో చేస్తున్నయుద్దానికి అమెరికన్ల మద్దతు ఎంత? ట్రంప్ మాదిరే అమెరికన్లు సైతం ఇరాన్ ను శత్రువుగా.. తమ రక్షణకు ప్రమాదంగా చూస్తున్నారా? లేదా? ట్రంప్ లాంటి దుందుడుకు అధినేత అమెరికా భవిష్యత్తును సమస్యల్లోకి నెడుతున్నారా?అన్నది మరో ప్రశ్న. ఈ సందేహాలను తీర్చుకునే ప్రయత్నంలో ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి. ఇరాన్ తో చేస్తున్న యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా తేలిగ్గా.. సింఫుల్ గా తీసుకుంటున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నప్పటికీ.. మనకెందుకీ యుద్ధం అన్నట్లుగా సగటు అమెరికన్ల స్పందన ఉందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు కూడా అదే విషయాన్ని వెల్లడించటం గమనార్హం.
అమెరికా ప్రజలు మాత్రమే కాదు అమెరికా రాజకీయ వర్గాలు సైతం ఇరాన్ పై వార్ విషయంలో రెండుగా చీలిపోయిన పరిస్థితి. ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ నేతల్లో చాలామంది ట్రంప్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఇరాన్ ను అడ్డుకోవటానికి ఈ తరహా చర్యలు అవసరమని అధికార పార్టీ నేతల్లో పలువురు భావిస్తున్నారు. అయితే.. విపక్ష డెమొక్రాట్లు మాత్రం ట్రంప్ నిర్ణయాల్ని దుందుడుకు.. ప్రమాదకరంగా పేర్కొంటున్నారు.
అంతేకాదు.. ఇరాన్ తో యుద్ధానికి దిగటానికి ముందు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. కానీ.. అదేమీ లేకుండానే యుద్ధానికి వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు. ఇరాన్ తో యుద్ధానికి దిగటం.. దానికి అవసరమైన అనుమతులు లేకుండా వెళుతున్న ట్రంప్ తీరు రాజ్యాంగ విరుద్దంగా అభివర్ణిస్తున్నారు. అమెరికాను మరో సుదీర్ఘ యుద్ధంలోకి నెట్టటంగా పేర్కొంటున్నారు.
తాజాగా నిర్వహించిన సర్వేల ప్రకారం అమెరికా ప్రజల్లో అత్యధికులు తాజా యుద్ధం విషయంలో అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. దాదాపు 59 శాతం మంది అమెరికన్లు సైనిక చర్యల్ని వ్యతిరేకిస్తున్నారు. 60 శాతం మంది యుద్ధానికి సంబంధించి ట్రంప్ వద్ద సరైన ప్లాన్ లేదని భావిస్తుండటం గమనార్హం. ట్రంప్ తన వ్యూహాల్ని కాంగ్రెస్ కు కానీ ప్రజలకు కానీ స్పష్టంగా వివరించకపోవటంతో..ఆయన లక్ష్యాన్ని కేవలం 33 శాతం మంది మాత్రమే అర్థం చేసుకున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. గతంలో ట్రంప్ చర్యల్ని.. నిర్ణయాల్ని సమర్థించిన కొన్ని కన్జర్వేటివ్ మీడియా వర్గాలు సైతం ట్రంప్ ను విమర్శించటం మొదలు పెట్టాయి. ఇరాన్ తో యుద్ధాన్ని తక్కువ సమయంలో ముగిసేదిగా ట్రంప్ చెబుతున్నప్పటికి.. అమెరికా ప్రజలు మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా.. అమెరికా ప్రయోజనాల్ని దెబ్బ తీసేదిగా భావిస్తుండటం గమనార్హం.
పీబీఎస్ న్యూస్, ఎన్ పీఆర్, రాయిటర్స్, ఎన్ పీఆర్, మారిస్ట్ పోల్ ప్రకారం చూస్తే.. అమెరికన్లలో 56 శాతం మంది ఇరాన్ పై సైనిక చర్యను తప్పు పడుతున్నారు. అదే సీఎన్ఎన్ పోల్ ప్రకారం ఇది 59 శాతంగా ఉంది. తాజా యుద్ధంతో అమెరికా సమాజం పార్టీల వారీగా విడిపోవటం గమనార్హం. యుధ్దాన్ని అధికార రిపబ్లిక్ పార్టీ ఫాలోయర్లలో 85 శాతం మంది మద్దతు ఇస్తుంటే.. విపక్ష డెమొక్రాట్ పార్టీని ఫాలో అయ్యేవారిలో 89 శాతం మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇండిపెండెంట్ పార్టీలను ఫాలో అయ్యే వారిలో 60 శాతం మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.
క్విన్నిపియాక్ వర్సిటీ పోల్ ఫలితాన్ని చూస్తే.. ఇరాన్ పై అమెరికా జరిపే సైనిక చర్యల్ని దాదాపు 53 శాతం ఓటర్లు వ్యతిరేకిస్తుంటే.. 40 శాతం మంది మాత్రమే మద్దతు తెలుపుతున్నారు. ఇరాన్ లోకి అమెరికా సైన్యాన్ని పంపటాన్ని 74 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతాయని 74 శాతం మంది ఆందోళన చెందుతున్నారు. మరో కీలక అంశం ఏమంటే.. ఈ యుద్ధం కారణంగా అమెరికా భూభాగంపై ఉగ్రవాద దాడులు జరగటానికి అవకాశం ఉందని 77 శాతం మంది నమ్ముతున్నారు.
ఇక్కడే ఒక సందేహం రావొచ్చు. క్విన్నిపియాక్ వర్సిటీ చేసే పోల్ కు ఉన్న విశ్వసనీయత ఎంత? అని. ప్రపంచ వ్యాప్తంగా ఈ వర్సిటీ చేసే పోల్ కు విశ్వసనీయత ఎక్కువ. ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండదు. ఫలితాలు నిష్పక్షపాతంగా ఉంటాయన్న నమ్మకం చాలా ఎక్కువ. వీరు జరిపే సర్వేను రాండమ్ డిజిట్ డయలింగ్ ద్వారా.. లైవ్ ఇంటర్వ్యూయర్ల ను ఉపయోగిస్తారు. ఈ పోల్ మొత్తం శాస్త్రీయ పద్ధతుల్లో సాగుతుందన్న పేరుంది.
మరో కీలక అంశం ఏమంటే అమెరికాలోని సోషల్ మీడియా సైతం చీలిపోయింది. ట్రంప్ మద్దతుదారులు ఆయన్ను బలమైన నాయకుడిగా ట్రంప్ కు చెందిన ట్రూత్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల మీద పొగిడేస్తుంటే.. ఫేస్ బుక్, ఇన్ స్టా లాంటి వాటిల్లో మాత్రం పెరుగుతున్న గ్యాస్ ధరలు.. అమెరికా సైనిక మరణాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. యుద్దంలో అమెరికా సైనికుల మరణాలు.. తమకు ఇప్పుడున్న మద్దతును తగ్గేలా చేస్తుందని 42 శాతం మంది రిపబ్లికన్లు స్పష్టం చేస్తున్నారు.
రాయిటర్స్ సర్వే చూస్తే.. కేవలం 27 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఇరాన్ పై దాడుల్నిసమర్థించారు. 43 శాతం మంది వ్యతిరేకించారు. తన సైనిక శక్తిని ఉపయోగించటానికి ట్రంప్ మరీ ఆత్రుతగా ఉన్నట్లుగా 56 శాతం మంది అమెరికన్లు పేర్కొనటం గమనార్హం. రాయిటర్స్ మొదలు ప్రముఖ మీడియా సంస్థలు రోజువారీగా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గడిచిన ఒకట్రెండు రోజుల్లో నిర్వహించిన సర్వేల్లో.. యుద్ధం త్వరగా ముగుస్తుందన్న ట్రంప్ ప్రకటనను 60 శాతం మంది అమెరికన్లు నమ్మటం లేదు. ఇది సుదీర్ఘకాలం సాగుతుందని భావిస్తున్నారు. కేవలం 36 శాతం మంది మాత్రమే కొన్ని వారాల్లో ముగుస్తుందన్న భావనలో ఉన్నారు. పెట్రోల్.. గ్యాస్ ధరలు మరింత దారుణంగా పెరుగుతాయని 67 శాతం మంది పేర్కొంటే.. వీరిలో 44 శాతం మంది రిపబ్లికన్లు కూడా ఉండటం విశేషం.