'ఏపీలో రీ-సర్వే రాజకీయం'.. ఏం జరుగుతోంది.. ?
రాష్ట్రంలో భూములను మరోసారి కొలిచి, హద్దులు నిర్ణయించి.. వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే కార్యక్రమమే భూముల రీ సర్వే.;
రాష్ట్రంలో భూములను మరోసారి కొలిచి, హద్దులు నిర్ణయించి.. వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే కార్యక్రమమే భూముల రీ సర్వే. దీనిని వైసీపీ హయాంలోనే ప్రారంభించారని.. ఆ పార్టీ అధినేత జగన్ చెబుతున్నారు. కానీ, తమ హయాంలోనే 2014-19మధ్యే చంద్రబాబు ప్రారంభించారని.. కానీ, దీనిని తమదిగా వైసీపీ ప్రచారం చేసుకుంటోందని టీడీపీ నేతలు, మంత్రులు కూడా ఆరోపిస్తున్నారు. దీంతో అసలు వాస్తవం ఏంటి? అనేది చర్చకు దారితీసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో రీ-సర్వే రాజకీయం అయితే.. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలకు.. విమర్శలు-ప్రతివిమర్శలకు కూడా దారితీసింది. దీంతో అసలు ఏం జరిగింది? అనేది ముఖ్యం. దేశవ్యాప్తంగా భూములు ఎన్ని ఉన్నాయి? వీటిలో పనికొచ్చేవి ఎన్ని? సాగవుతున్న భూములు ఎన్ని? రైతుల చేతిలో ఎన్ని ఉన్నాయి? భూపరిమితి చట్టం పక్కాగా అమలవుతోందా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2016-18 మధ్య దృష్టి పెట్టింది.
అప్పట్లో బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ను కూడా సంప్రదించారు. దీనికి ఆయన కూడా ఓకే చెప్పారు. దేశవ్యాప్తంగా బ్రిటీష్ కాలంలో జరిగిన భూముల కొలతల తర్వాత.. ఇప్పటి వరకు జరగకపోవడంతో భూముల సర్వే చేయించాలని ప్రతిపాదించిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు ఒకరు. ఇప్పుడు ఈ విషయాన్నే మంత్రులు చెబుతున్నారు. అసలు సర్వేకి నాంది పలికిందే చంద్రబాబు అంటున్నారు. అయితే.. 2019-2030లోగా.. దేశవ్యాప్తంగా భూముల రీసర్వే చేయాలని కేంద్రం గడువు పెట్టింది.
కానీ.. చాలా రాష్ట్రాలు ఇది వివాదంతో ముడిపడిన నేపథ్యంలో దాని జోలికి పోలేదు. ఇక, ఇదేసమయంలో కేంద్రం మరో షరతు పెట్టింది. సర్వేకు అయ్యే ఖర్చును తామే ఇస్తామని.. త్వరగా సర్వే పూర్తి చేసే ఐదు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణాలను 50 వేల కోట్ల వరకు ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో జగన్ హయాంలో దీనిని భుజాన వేసుకున్నారు. సర్వేయర్లను నియమించి చేపట్టారు. అయితే.. పాసు పుస్తకాలు.. సరిహద్దు రాళ్లపై జగన్ బొమ్మలు వేసుకోవడం వివాదంగా మారింది.. ఆయన అధికారం కూడా కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ రీసర్వేను కొనసాగిస్తోంది. ఇదీ.. అసలు వాస్తవం.