పదేళ్లకు భారత్ లో టి20 ప్రపంచకప్..అధికార సాంగ్ కంపోజర్ అతడే
టి20 ప్రపంచ కప్ నకు ఈసారి అఫీషియల్ సాంగ్ కంపోజర్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కావడం విశేషం.;
భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో మరొక్క రెండువారాల్లో ప్రతిష్ఠాత్మక టి20 ప్రపంచ కప్ మొదలుకానుంది. ఇందులో విశేషం ఏమంటే.. భారత్ తొలిసారిగా డిఫెండింగ్ చాంపియన్ గా స్వదేశంలో బరిలో దిగుతోంది. 2007లో జరిగిన తొలి టి20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న టీమ్ఇండియా మళ్లీ 17 ఏళ్ల తర్వాతకు కానీ టైటిల్ ను కొట్టలేకపోయింది. 2024లో అమెరికా, వెస్టిండీస్ దీవుల సంయుక్త ఆతిథ్యంలో జరిగిన టి20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీతోనే స్టార్ క్రికెటర్లు రోహిత్, విరాట్ కోహ్లి, మేటి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ టి20లకు వీడ్కోలు పలికారు. కాగా, 2007లో భారత్ విజేతగా నిలిచికా 2009లో రెండో ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టింది. ఇంగ్లండ్ లో జరిగిన ఈ కప్ లో పాకిస్థాన్.. శ్రీలంకను ఓడించి విజేతగా ఆవిర్భవించింది. 2010, 2012 ఇలా తర్వాత రెండేళ్లకోసారి టి29 విశ్వ సమరం జరుగుతోంది. చివరగా 2024 జూన్ లో నిర్వహించారు.
భారత్ రెండోసారి..
2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి టైటిల్ కొట్టింది టీమ్ ఇండియా. అదే ఏడాది వెస్టిండీస్ దీవుల్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో దారుణ ఓటమిని మూటగట్టుకుంది మన జట్టు. దీంతో టి20 ప్రపంచకప్ నాటికి చాలా మార్పులు జరిగాయి. సీనియర్లు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లు ఇది కుర్రాళ్ల ఫార్మాట్ అంటూ తప్పుకొన్నారు. అలా ధోనీ నాయకత్వంలో కప్ లో దిగిన భారత్ ఏకంగా పాకిస్థాన్ పడగొట్టి చాంపియన్ అయింది. అయితే, మన దేశం తొలిసారిగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది మాత్రం 2016లో కావడం గమనార్హం. అంటే, కప్ మొదలైన దాదాపు పదేళ్లకు అన్నమాట. మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత వచ్చే ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 మధ్య భారత్ లో ప్రపంచ కప్ జరగనుంది. అయితే, ఈసారి శ్రీలంకనూ కలుపుకొంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ఆ దేశ బోర్డును ఆదుకునే ఉద్దేశంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పెద్ద మనసు చూపింది.
అదిరిపోయే అనిరుధ్ మ్యూజిక్ లో..
టి20 ప్రపంచ కప్ నకు ఈసారి అఫీషియల్ సాంగ్ కంపోజర్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ కావడం విశేషం. తమిళంలో మొదలుపెట్టిన అనిరుధ్ అనతి కాలంలో భారతీయ మ్యూజిక్ ప్రపంచాన్ని దున్నేస్తున్నాడు. ఇప్పడు ఆయనకు టి20 ప్రపంచ కప్ అఫీషియల్ సాంగ్ కంపోజింగ్ చాన్స్ దక్కింది. కానా, అనిరుధ్ క్రికెట్ లవర్. తనకు దక్కిన అవకాశాన్ని ఆయన మహదానందంగా వెల్లడించారు. క్రికెట్ అంటే తన విషయంలో ఓ గేమ్ కాదని.. అదొక ఫీలింగ్ అని వెల్లడించారు. ఏదో ఒకవిధంగా ప్రపంచకప్ క్రికెట్ లో భాగం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
సాంగ్ విడుదల ఎప్పుడు?
ఫిబ్రవరి 7న ప్రపంచ కప్ మొదలవుతుంది. ఇప్పటికే టీవీ చానళ్లలో దీనిపై అడ్వర్టయిజ్ మెంట్లు వస్తున్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ నెగ్గిన అమ్మాయిలతో.. టి20 పురుషుల ప్రపంచ కప్ యాడ్స్ చేయడం గమానార్హం. ఈ క్రమంలో అనిరుధ్ కంపోజ్ చేసిన ప్రపంచకప్ సాంగ్ త్వరలో విడుదల అవుతుందని తెలుస్తోంది.