బడ్జెట్ విషయంలో అరుణ్ జైట్లీ నిర్ణయం గొప్పదేనా..?
2017లో ఆ చర్చ ఓ కీలక నిర్ణయంగా మారింది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది.;
ఫిబ్రవరి 1 అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక మైలురాయి. కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. 2026, ఫిబ్రవరి 1 కోసం దేశం ఉత్కంఠతగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే వరుసగా తొమ్మిదవసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ బడ్జెట్‌లకు సంబంధించిన ఒక కీలక చరిత్రను తిరిగి గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇదే. భారత బడ్జెట్ వ్యవస్థలో 92 ఏళ్లుగా కొనసాగిన ఒక సంప్రదాయానికి ముగింపు పలికిన ఘట్టం ఇదే. ఒకప్పుడు బడ్జెట్ అంటే రెండు రోజుల ఉత్సవం లాంటిది. మొదటి రోజు రైల్వే బడ్జెట్, రెండో రోజు సాధారణ బడ్జెట్. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ ప్రత్యేకంగా రైల్వే బడ్జెట్ కోసం ఎదురుచూసేవారు. టికెట్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? కొత్త రైళ్లు, కొత్త లైన్లు, స్టేషన్ అభివృద్ధులు ఏవి వస్తాయన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఉండేది. రైల్వే బడ్జెట్ అనేది కేవలం ఆర్థిక ప్రకటన మాత్రమే కాదు.. సామాన్యుడి నిత్యజీవితానికి నేరుగా సంబంధించిన అంశం.
బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం..
ఈ సంప్రదాయం 1924లో మొదలైంది. బ్రిటిష్ పాలన కాలంలో రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండేది. భారీ పెట్టుబడులు, విస్తృత నెట్‌వర్క్, లక్షలాది ఉద్యోగాలు—ఇవన్నీ రైల్వే చుట్టూనే తిరిగేవి. అందుకే అప్పట్లో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అవసరమని భావించారు. ఆ రోజు నుంచి స్వాతంత్ర్యం తర్వాత అదే పద్ధతి కొనసాగింది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా రైల్వే బడ్జెట్ సంప్రదాయం మాత్రం అలాగే నిలిచింది. కానీ కాలం మారింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపం మారింది. రైల్వే ఒక్కటే అభివృద్ధికి కేంద్రం అన్న భావన క్రమంగా తగ్గింది. రోడ్లు, విమానయానం, ఐటీ, పరిశ్రమలు వంటి అనేక రంగాలు సమానంగా ఎదిగాయి. ఈ నేపథ్యంలో రైల్వేను ప్రత్యేకంగా వేరు చేసి చూడాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న మొదలైంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్చ మరింత బలపడింది.
2017 రెండు బడ్జెట్లు విలీనం..
2017లో ఆ చర్చ ఓ కీలక నిర్ణయంగా మారింది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దాంతో 92 ఏళ్ల చరిత్రకు తెరపడింది. ఆ ఏడాది పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఒకే ప్రసంగంలో దేశ ఆర్థిక అంశాలతో పాటు రైల్వే ప్రణాళికలను కూడా ప్రకటించారు. ఇది భారత బడ్జెట్ చరిత్రలో ఒక మలుపు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఉద్దేశాలు మాత్రమే కాదు, పరిపాలనా సౌలభ్యం కూడా ఉంది. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు ఈ మార్పు జరిగింది. రైల్వే కూడా దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమే కాబట్టి, దాన్ని వేరుగా చూడడం వల్ల లాభం లేదన్నది వారి వాదన. రెండు బడ్జెట్‌ల వల్ల విధానాల్లో గందరగోళం, వనరుల కేటాయింపులో సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
భిన్నమైన అభిప్రాయాలు..
అరుణ్ జైట్లీ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సంప్రదాయాన్ని కోల్పోయామనే భావన కొందరిలో కనిపించగా, సమగ్ర ఆర్థిక దృష్టికోణానికి ఇది సరైన అడుగని మరికొందరు ప్రశంసించారు. కాలక్రమేణా ఈ మార్పు సాధారణమైపోయింది. ఇప్పుడు కొత్త తరం బడ్జెట్ అనగానే ఒకే రోజు, ఒకే ప్రసంగం అనే ఆలోచనకు అలవాటు పడింది. ఈ నేపథ్యంలో చూస్తే, అరుణ్ జైట్లీ చేసిన ఈ నిర్ణయం కేవలం ఒక సంప్రదాయానికి ముగింపు కాదు. అది భారత ఆర్థిక పాలనలో మారుతున్న దృక్పథానికి ప్రతీక. పాత పద్ధతులకు గౌరవం ఇస్తూనే, కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించిన ఘట్టంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.