ఏమైనా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలకు రాజభోగం

తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ఒక కేసు విచారణకు నిందితుడిగా వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు స్టేషన్ అధికారులు వ్యవహరించిన తీరును తెలుగు తమ్ముళ్లు తిట్టిపోస్తున్నారు.;

Update: 2025-05-24 05:39 GMT

అధికారంలో ఉన్న వారికి పెద్దపీట.. విపక్షంలో ఉన్న వారికి చుక్కలు చూపించే తీరు రొటీన్. కానీ.. అందుకు భిన్నంగా కొన్ని పరిణామాలు ఇటీవల కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్నాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ఒక కేసు విచారణకు నిందితుడిగా వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు స్టేషన్ అధికారులు వ్యవహరించిన తీరును తెలుగు తమ్ముళ్లు తిట్టిపోస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులకు కీలక స్థానాలు అప్పగిస్తున్న వైనంపై ఇప్పటికే పలుమార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్లు.. ఇలాంటి ఉదంతాలపై మరింతగా మండిపడుతున్నారు.

అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. పాలనలో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇలాంటి తప్పులు ఎలా జరుగుతున్నాయి? అన్నది ప్రశ్నగా మారింది. కావలి మాజీ ఎమ్మెల్యే.. వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తాజాగా అమ్రత్ పైలాన్ కూల్చివేత కేసులో నిందితుడి హోదాలో విచారణకు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన పోలీస్ స్టేషన్ కు వచ్చిన సందర్భంగా కావలి టూ టౌన్ సీఐ వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం ఉదయం పదకొండు గంటల వేళలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్టేషన్ కు వెళ్లారు.

ఆయన పోలీస్ స్టేషన్ కు వెళుతున్న వేళలో.. స్టేషన్ సీఐ మాజీ ఎమ్మెల్యేకు ఎదురెళ్లి స్వాగతం పలకటం.. అనంతరం వెంట పెట్టుకొని మరీ స్టేషన్ లోపలకు తీసుకెళ్లటం లాంటి పరిణామాలు అక్కడి వారిని ముక్కున వేలేసుకునేలా చేశాయి. విచారణ అధికారిగా ఉన్న సీఐ నిందితుడు హోదాలో ఉన్న నేతకు ఇలాంటి రాచమర్యాదలు చేయటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ ఏ కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారన్నది చూస్తే.. 2020 ఏప్రిల్ 11న కావలి పట్టణం ట్రంకు రోడ్డులో ఏర్పాటైన అమ్రత్ శిలాఫలకాన్ని కూల్చేశారు. ఈ కేసులో ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ8గా ఉన్నారు. ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపారు ఈ నేపథ్యంలో న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు.

అంతేకాదు.. పోలీసు విచారణ జరుగుతున్న సమయంలో పోలీస్ స్టేషన్ వైపు స్థానికులు వెళ్లకుండా అడ్డుకోవటాన్ని తప్పు పడుతున్నారు. ఎందుకుంటే.. విచారణ ఐదున్నర గంట లపాటు సాగింది. అంతసేపు స్టేషన్ వైపు వెళ్లకుండా నిరోధించటం దేనికి నిదర్శనం? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతాపరెడ్డి విచారణకు స్టేషన్ లోపలకు వెళ్లి.. అక్కడే ఉన్న ఐదున్నర గంట లపాటు ఆయన అనుచరులు.. మద్దతుదారులు స్టేషన్ బయట కారులోనే ఉన్నారు.

విచారణలో భాగంగా మొత్తం 42 ప్రశ్నలు అడిగారని.. వాటన్నింటికి లాయర్ల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే సమాధానాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనుచరులు స్టేషన్ లోపలకు రాకుండా ఉండేందుకు సీఐ బయటకు వెళ్లారని.. మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలకలేదన్న వివరణ ఇస్తున్నారు. అయినా.. విచారణకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందితుడితో.. అతడి అనుచరులు స్టేషన్ లోపలకు ఎందుకు వస్తారు? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News