నితీష్ హిజాబ్ తొలగించిన వైద్యురాలు బీహార్ ను వదిలి వెళ్లిపోయారా..!

ఈ సందర్భంగా స్పందించిన ఆయుష్ డాక్టర్ నుస్రత్... పర్వీన్ శనివారం సాయంత్రం 7 గంటల వరకూ విధులకు హాజరు కాలేదని తెలిపారు.;

Update: 2025-12-21 13:30 GMT

బీహార్ లోని పాట్నాలో గత వారం జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో.. అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఓ మహిళా ఆయుష్ వైద్యురాలి హిజాబ్ ను తొలగిస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా తీవ్ర దుమారాన్ని లేపింది. నితీష్ పై అన్ని వర్గాల నుంచీ తీవ్ర విమర్శలు వచ్చాయి! ఇ క్రమంలో ఆ వైద్యురాలు విధుల్లో చేరలేదనే విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

అవును... ఇటీవల జరిగిన అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హిజాబ్ తొలగించిన వైద్యురాలు ఇప్పటివరకూ విధుల్లో చేరలేదని అధికారులు వెల్లడించారు. వాస్తవానికి విధుల్లో చేరడానికి డిసెంబర్ 20 చివరి తేదీ అని తొలుత ప్రకటించినా.. శనివారం సాయంత్రం 7 గంటల వరకూ ఆమె విధుల్లో చేరలేదనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారగా, రకరకాల ఊహాగాణాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఆయుష్ డాక్టర్ నుస్రత్... పర్వీన్ శనివారం సాయంత్రం 7 గంటల వరకూ విధులకు హాజరు కాలేదని తెలిపారు. ఆరోజు తర్వాత అవకాశం మూసివేయబడిందని పాట్నా సివిల్ సర్జన్ అవినాష్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే... డిసెంబర్ 20 తర్వాత కూడ చేరడానికి చివరి తేదీని పొడిగించినట్లు సమాచారం అందిందని.. ఈ నేపథ్యంలో పర్వీన్ సోమవారం చేరుతారో లేదో ఇంకా తెలియాల్సి ఉందని చెబుతూ.. సవరించిన గడువును మాత్రం సింగ్ పేర్కొనలేదు.

వాస్తవానికి పాట్నాలోని సదర్ లో గల సబల్ పూర్ ప్రాథమిక అరోగ్య కేంద్రం (పీ.హెచ్.సీ)లో పర్వీన్ విధుల్లో చేరాల్సి ఉంది. ఈ సందర్భంగా స్పందించిన సదరు పీ.హెచ్.సీ. సర్జన్ విజయ్ కుమార్.. శనివారం ఐదు నుంచి ఆరు మంది విధుల్లో చేరారని.. వారిలో పర్విన్ లేరని.. ఆమె పేరు జాబితాలో ఉన్నప్పటికీ, పాట్నాలోని సివిల్ సర్జన్ కార్యాలయం నుంచి ఆమె నియామక లేఖ తమకు అందలేదని అన్నారు.

మరోవైపు... ఆ కుటుంబం మీడియా దృష్టిని తప్పించుకోవాలని కోరుకుంటుందని.. ఈ ఉద్యోగంలో చేరాలా వద్దా అనే విషయంపై ఆమె తర్జనభర్జన పడుతున్నారని.. ఈ నేపథ్యంలోనే జరిగిన దానికి నిరసనగా ఆమె కుటుంబం బీహార్ నుంచి కోల్ కతాకు తరలివెళ్లిందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న జార్ఖండ్ లోని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఓ బిగ్ డీల్ తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా... పర్వీన్ కు నెలకు రూ.3 లక్షల జీతం, ప్రభుత్వ ప్లాట్, ఆమెకు నచ్చినచోట పోస్టింగ్, పూర్తి భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు. నితీష్ కుమార్ హిజాబ్ తొలగించడం ద్వారా ముస్లిం సమాజాన్ని కించపరచడానికి ప్రయత్నించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో పర్వీన్ జాబ్ లో జాయిన్ అవుతారా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆమె జాయిన్ కాకపోతే అది మరో పెను దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు!

Tags:    

Similar News