ఆ కళ్లద్దాలతో గుడిలోకి వెళ్లి రికార్డు చేసిన సింగపూర్ వ్యక్తి అరెస్టు

సింగపూర్ లోని నార్త్ షోర్ డ్రైవ్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల తిరునీపనార్ ఇటీవల భారతదేశానికి వచ్చాడు. శ్రీలంక మూలాలు ఉన్న ఇతను.. కేరళలోని ప్రఖ్యాత శ్రీఅనంత పద్మనాభస్వామి టెంపుల్ లోకి వెళ్లాడు.;

Update: 2025-12-21 06:30 GMT

కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి గుళ్లో ఒక విదేశీయుడి దుర్మార్గపు ఆలోచనకు అక్కడి భద్రతా సిబ్బంది బ్రేకులు వేశారు. అతని ప్రయత్నం ఫెయిల్ అయ్యేలా చేశారు. కెమేరా అమర్చిన స్మార్ట్ కళ్లద్దాలను ధరించి ఆలయంలోకి ప్రవేశించిన అతను.. ఆలయం లోపల ప్రాంతాన్ని రికార్డు చేసే పాడు పనికి తెర తీశారు. ఇతడి పాడు పనిని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పజెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శనివారం చోటు చేసుకున్న ఈ ఉదంతం కలకలాన్ని రేపింది. ఇంతకూ అతడెవరు? అతడిప్పుడు ఎక్కడ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.

సింగపూర్ లోని నార్త్ షోర్ డ్రైవ్ ప్రాంతానికి చెందిన 49 ఏళ్ల తిరునీపనార్ ఇటీవల భారతదేశానికి వచ్చాడు. శ్రీలంక మూలాలు ఉన్న ఇతను.. కేరళలోని ప్రఖ్యాత శ్రీఅనంత పద్మనాభస్వామి టెంపుల్ లోకి వెళ్లాడు. గుళ్లోకి వెళ్లిన అతని ఉద్దేశం వేరు. గుడి లోపలి ప్రాంతాల్ని రికార్డు చేయాలన్న తప్పుడు ఉద్దేశంతో స్మార్ట్ కళ్లద్దాల్ని ధరించి టెంపుల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఆలయం లోపలకు ప్రవేశించిన తర్వాత తన పని మొదలు పెట్టాడు. ఆలయం ఉత్తరం ప్రాంతాన్ని.. తులాభారం మండపంతో పాటు ఇతర ప్రదేశాల్ని రికార్డు చేశాడు. అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటం.. మిగిలిన భక్తుల మాదిరి అతడి తీరు లేకపోవటంతో అక్కడి భద్రతా సిబ్బంది అతడ్ని అనుమానించారు. వెంటనే.. అతడ్ని అడ్డుకొని.. అతడి కళ్లద్దాల్ని పరిశీలించారు.

ఈ క్రమంలో అతను ఆలయం లోపలి కొన్ని ప్రాంతాల్ని రికార్డు చేసిన వైనాన్ని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. కళ్లద్దాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి నోటీసులు అందజేశారు.ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. సదరు విదేశీయుడ్ని ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని ఆదేశించారు. అతను ఈ పని ఎందుకు చేశాడు? అతని బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఈ రోజు విచారణ వేళ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News