టి20 ప్రపంచ కప్.. బంగ్లా బదులు వచ్చింది.. రికార్డులు కొట్టింది
అరుదైన ఈ రికార్డును అందుకోవడం అంత తేలిక కూడా కాదు. అయితే, ఇటలీ రూపంలో స్కాట్లాండ్ కు తమ కంటే తేలికైన ప్రత్యర్థి ఎదురవడంతో అది సాధ్యమైంది.;
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు డొంక తిరుగుడు కారణాలు చెప్పి తప్పుకొన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామా? అని బాధపడుతుండొచ్చు..! ఒకవేళ మేకపోతు గాంభీర్యాన్ని వీడి టి20 ప్రపంచ కప్ లో పాల్గొని ఉంటే బాగుండేది కదా? అని చింతిస్తూ ఉండొచ్చు.. మరోవైపు అవకాశాలు చెప్పి రావు.. వచ్చినప్పుడే వాటిని రెండు చేతులతో ఒడిసి పట్టాలి..! అనే సామెతను గుర్తుచేస్తూ స్కాట్లాండ్ అదరగొట్టింది. పేరుకు పసికూనే అయినా... క్రికెట్ కల్చర్ కు లోటులేని స్కాట్లాండ్ టి20 ప్రపంచ కప్ లో ఒక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అరుదైన ఈ రికార్డును అందుకోవడం అంత తేలిక కూడా కాదు. అయితే, ఇటలీ రూపంలో స్కాట్లాండ్ కు తమ కంటే తేలికైన ప్రత్యర్థి ఎదురవడంతో అది సాధ్యమైంది. 2022 ప్రపంచ కప్ లో ఆడిన తర్వాత 2024లో అర్హత సాధించిన స్కాట్లాండ్ ఇప్పుడు బై చాన్స్ దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
మూడో రోజు సంచలనం లేనట్లేనా?
టి20 ప్రపంచ కప్ శనివారం మొదలైంది. తొలి రెండు రోజులు పెద్ద జట్లను అందులోనూ మాజీ చాంపియిన్లు అయిన పాకిస్థాన్, ఇంగ్లండ్, భారత్ లను చిన్న జట్లయిన నెదర్లాండ్స్, నేపాల్, అమెరికా వణికించాయి. కేవలం అనుభవం లేక కానీ.. లేదంటే ఒకటైనా సంచలనం రేపేవో. ఇక సోమవారం మూడో రోజు ఇటలీతో జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన 207 పరుగులు చేసింది. 208 టార్గెట్ ను ఛేదించే క్రమంలో ఇటలీ 134 పరుగులకే ఆలౌటైంది. ఇక సోమవారం ఒమన్-జింబాబ్వే, దక్షిణాఫ్రికా-కెనడాల మధ్య మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండింట్లో ఒమన్, కెనడాలు గెలిస్తే సంచలనమే.
ఆడడమే ఒక రికార్డు.. ఇదీ స్కాట్లాండ్ రికార్డు..
ఇటలీ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ ఆడుతోంది. ఇది ఒక రికార్డు అనుకుంటే, బంగ్లాదేశ్ స్థానంలో టి20 ప్రపంచ కప్ లోకి వచ్చిన స్కాట్లాండ్ మరో రికార్డు కొట్టింది స్కాట్లాండ్. స్కాట్లాండ్.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో అసోసియేట్ సభ్య దేశం. ఈ హోదా ఉన్న దేశాలకు టెస్టు హోదా ఉండదు. ఈ క్రమంలో టి20 ప్రపంచ కప్ లో 200 పైగా పరుగులు చేసిన తొలి అసోసియేట్ దేశంగా నిలిచింది. దీనికిముందు ఈ రికార్డు అమెరికా (197) పేరిట ఉంది. వాస్తవానికి ఇటలీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకుంటే స్కాట్లాండ్ కు రికార్డు దక్కేది కాదేమో? ఆ జట్టు ఓపెనర్ జార్జ్ మున్సే 54 బంతుల్లో 84 పరుగులు చేశాడు. 13 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ (37) సైతం రాణించాడు. వీరిద్దరే తొలి వికెట్ కు 126 పరుగులు జోడించారు. మెక్ ముల్లన్ 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు.
కొసమెరుపుః స్కాట్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో మైకేల్ లీస్ 4, 2, 4, 6, 6 కొట్టాడు. దీంతో 22 పరుగులు వచ్చి ఆ జట్టు స్కోరు 200 దాటింది. రికార్డు దక్కింది.