రేవంత్ పై కేసీఆర్ రివర్స్ అటాక్ కు రె'ఢీ'

ఈసారి కేసీఆర్ కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడం విశేషం.;

Update: 2025-12-21 13:30 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ఆయన తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మలుపుతిరిగింది. సుధీర్ఘ విరామం తర్వాత ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఫాంహౌస్ కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఇకపై ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆదివారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

యాక్షన్ ప్లాన్ సిద్ధం.. ఎజెండా ఇదే

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటిలో కేసీఆర్ కేవలం పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ప్రబుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు. జలపోరాటంలో భాగంగా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే నీటికే పరిమితం కావడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతోంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడామని.. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల , మున్సిపల్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై చర్చించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రాన్ని కూడా ఖరారు చేయనున్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఖరారు చేయనున్నారు.

రంగంలోకి స్వయంగా గులాబీ బాస్

ఈసారి కేసీఆర్ కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడం విశేషం. రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ‘తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన నిలబడి మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం.. అని కేసీఆర్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

నిజానికి ఈ సమావేశం ఈనెల 19నే జరగాల్సి ఉన్నప్పటికీ పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా నేటికి వాయిదా పడింది. చాలా కాలం తర్వాత కేసీఆర్ పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొంటుడడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ఇచ్చే పిలుపుతో రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News