విదేశీ చదువు.. మనోళ్ల మైండ్ సెట్ మారిందిగా
తాజా ఆధ్యయనం ప్రకారం 2024-25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 337 శాతం పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇది 219శాతంగా ఉంది.;
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లటం కొత్త విషయమేం కాదు. దశాబ్దాల నుంచి ఉన్నదే. గడిచిన కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకుంటున్న మనోళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2.0తో వచ్చిన మార్పుల నేపథ్యంలో మనోళ్ల ఫారిన్ చదువుకు సంబంధించిన ప్లానింగ్ మారిపోయింది. గతంలో విదేశీ విద్య అన్నంతనే ఉన్న లెక్కలకు భిన్నంగా ఇప్పుడు ఆలోచనలు మారిన విషయాన్ని తాజాగా నిర్వహించిన ఆధ్యయనం ఒకటి స్పష్టం చేసింది.
దాదాపు 30 లక్షల మందికి పైనే విద్యార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ రిపోర్టును రూపొందించారు. 2024-25లో విదేశీ విద్య అన్నంతనే అమెరికా మాత్రమే కాదు.. మిగిలిన దేశాలు కూడా అన్న భావన ఎక్కువైంది. ఈ క్రమంలో కొన్ని దేశాల మీద ఫోకస్ ఎంత ఎక్కువగా పెరిగిందన్న విషయం తాజా రిపోర్టు స్పష్టం చేస్తుంది. గతంలో అయితే అమెరికా లేదంటే కెనడా.. యూకే దేశాలు ముందు వరసలో ఉండేవి. ఆ మధ్యలో కొంతకాలం ఆస్ట్రేలియా బూమ్ నడిచింది.
తాజా ఆధ్యయనం ప్రకారం 2024-25లో జర్మనీపై భారతీయ విద్యార్థుల ఆసక్తి వార్షికంగా 337 శాతం పెరిగింది. అంతకు ముందు ఏడాది ఇది 219శాతంగా ఉంది. న్యూజిలాండ్ మీద ఆసక్తి 6 శాతం నుంచి 2900 శాతం పెరిగితే.. మరింత ఆసక్తికరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై 7 శాతం నుంచి 5400 శాతం ఆసక్తి పెరగటం గమనార్హం. చదువు పూర్తైన తర్వాత 18నెలల పాటు వర్కు వీసా లభిస్తుండటం జర్మనీకి సంబంధించిన పాజిటివ్ అంశంగా చెప్పాలి. దీనికి తోడు ప్రాశ్చాత్య దేశాల వర్సిటీలతో పోలిస్తే ఖర్చులు తక్కువగా ఉండటం.. కాస్తంత అందుబాటు దూరంలో ఉండటం యూఏఈకి పాజిటివ్ అంశంగా చెబుతున్నారు.
న్యూజిలాండ్ విషయానికి వస్తే.. చదువు పూర్తైన తర్వాత మూడేళ్లు నివాసం ఉండేందుకు.. పని చేసేందుకు వర్కు వీసా ఇచ్చేందుకు ఆ దేశం ఆఫర్ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ పాలసీ మన విద్యార్థులకు ఆకర్షణీయంగా మారినట్లుగా చెప్పాలి. గతానికి వర్తమానానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమంటే.. గతంలో విద్యార్థులు తాము ఫలానా వర్సిటీలో చదివామన్న గొప్పలకు పోయేటోళ్లు. ఇప్పుడు అందుకు భిన్నంగా చదువు మీద పెడుతున్న ఖర్చును పెట్టుబడిగా చూస్తూ.. చదువు పూర్తైన తర్వాత ఉపాధి అవకాశాల్ని లెక్కలోకి తీసుకుంటున్నారు.
అంతేకాదు.. ఖర్చులను వీలైనంత తక్కువగా ఉండే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్లుగా తేలింది. స్పెషలైజేషన్ కు గతానికి మించి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్లుగా తేలింది. 40 శాతం విద్యార్థులు ఏఐ.. మెషిన్ లెర్నింగ్.. డేటా సైన్స్ లాంటి మాస్టర్స్ ప్రోగ్రామ్స్ పై ఆసక్తిని ప్రదర్శించటం కనిపిస్తోంది. కోర్సు చేసేందుకు అయ్యే ఖర్చు.. ఇతర ఖర్చులు కూడా మనోళ్లు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. ఇలాంటి వారు 75 శాతం మంది ఉండటం విశేషం.
స్కాలర్ షిప్ కు 70 శాతం మంది.. కెరీర్ పురోగతికి 58 శాతం మంది.. మంచి జీతభత్యాలకు ఉన్న అవకాశాలకు 49 శాతం ఓట్లు వేశారు. తాము కోర్సు చేసేందుకు విద్యార్థుల టాప్ 5 ప్రయారిటీలో వర్సిటీ ర్యాంకింగ్ కు చోటు ఇవ్వకపోవటం కొత్త పరిణామంగా చెబుతున్నారు. అంతేకాదు విదేశీ విద్య కోసం వెళుతున్న అబ్బాయిలు.. అమ్మాయిల మధ్య గతంలో ఉన్న అంతరం అంతకంతకూ తగ్గుతోంది. ప్రస్తుతం అబ్బాయిలు 58 శాతం ఉంటే అమ్మాయిలు 42 శాతం ఉన్నట్లుగా అధ్యయనం తేల్చింది.