పని వర్సెస్ జీతం... భారత్ లో పనివేళల గురించి దిగ్భ్రాంతికర నిజం!

ఈ సందర్భంగా దేశాల వారీగా వారానికి చేసే పని గంటలు, సంపాదన వివరాలు ఇప్పుడు చూద్దామ్...!;

Update: 2025-12-21 11:30 GMT

భారతదేశంలో చిన్నప్పటి నుంచీ పిల్లలకు ఒక మాట చెబుతారు.. అదేమిటంటే.. కష్టపడి పనిచేస్తే ఫలితం బాగా ఉంటుంది అని. అయితే.. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ నియమం లెక్క మారిపోతుంది. ప్రపంచ దేశాలలోని పని గంటలు, వేతనాలపై ఇటీవల వెలుగు చూసిన డేటా ఓ ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... ఈ ప్రపంచంలోనే భారతీయులు అత్యధిక గంటలు పనిచేస్తున్నారు కానీ.. అతి తక్కువ సంపాదిస్తున్నారు అని.

అవును... ఈ ప్రపంచంలోని టాప్ దేశాల్లోని ఉద్యోగులతో పోలిస్తే భారతీయుడు ఎక్కువ గంటలు పని చేస్తున్నాడు.. అయితే అందుకు పూర్తి భిన్నంగా అందరికంటే అత్యంత తక్కువ సంపాదిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘణాంకాలు భారతీయుడిని చూసి ప్రపంచం జాలి పడేలా ఉన్నాయని చెప్పినా అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో అమెరికాకు భారత్ కు నక్కకూ నాగలోకానికీ ఉన్న తేడా ఉంది!

తాజా డేటా ప్రకారం... పని గంటల విషయంలో చైనా (48.5 గంటలు) మొదటి స్థానంలో ఉంటే.. 46.7 గంటలతో భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ దేశాల ప్రజలతో పోలిస్తే ఈ దేశాల ప్రజలు ఆఫీసు లేదా ఫ్యాక్టరీలో గణనీయమైన ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా అమెరికాలో వారనికి సగటున 34.2 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. ఇది భారతీయుడి సగటు వారం పని గంటలకంటే 12.5 గంటలు తక్కువ.

ఇక సంపాదన విషయానికొస్తే... అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగి లేదా కార్మికుడు వారంలో అతి తక్కువ గంటలు (34.2 గంటలు) పనిచేస్తూ.. అత్యధికంగా నెలకు సుమారు రూ.5.6 లక్షలు సంపాదిస్తున్నాడు. దానికి పూర్తి విరుద్ధంగా అత్యధికంగా 46.7 గంటలు పనిచేస్తు.. పనిలో రెండో స్థానంలో ఉన్న భారతీయుడు నెలకు అత్యల్పంగా రూ.32,000 మాత్రమే సంపాదిస్తున్నాడు. ఈ గణాంకాలు అత్యంత షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి!

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... భారతదేశంలో రూ.32,000 అంటే అమెరికాలో కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు అమెరికాలో ఓ వ్యక్తి నెలకు ఇలా రూ.32,000 స్థాయిలో సంపాదించడం అంటే అది తీవ్ర పేదరికంగా పరిగణించబడుతుంది. అక్కడ అద్దెలు, ఆహారం సేవల ఖర్చులతో పోలిస్తే భారత్ లో ఖర్చులు చాలా తక్కువని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ డేటాతో ఓ విషయం స్పష్టం అవుతుంది.. అదేమిటంటే.. ఎక్కువ గంటలు ఎల్లప్పుడూ ఎక్కువ డబ్బుతో సమానం కాదు!

ఈ సందర్భంగా దేశాల వారీగా వారానికి చేసే పని గంటలు, సంపాదన వివరాలు ఇప్పుడు చూద్దామ్...!

అమెరికా - 34.2 గంటలు - రూ.5,60,520

స్విట్జర్లాండ్ - 42.0 గంటలు - రూ.5,45,490

జర్మనీ - 40.0 గంటలు - రూ.4,56,300

జపాన్ - 40.0 గంటలు - రూ.3,12,300

చైనా - 48.5 గంటలు - రూ.2,73,690

దక్షిణ కొరియా - 36.0 గంటలు - రూ.2,56,140

భారతదేశం - 46.7 గంటలు - రూ.32,000

Tags:    

Similar News