వర్క్ ఫ్రం హోంకి ఎండ్ కార్డు...రాకపోతే ఇంటికే !

వర్క్ ఫ్రం హోం అన్న కొత్త కాన్సెప్ట్ ని కరోనా మహమ్మారి పరిచయం చేసింది. కరోనా 2020లో ప్రపంచాన్ని ఎంతగా పట్టి పీడించిందో అందరికీ తెలుసు.;

Update: 2025-12-27 04:23 GMT

వర్క్ ఫ్రం హోం అన్న కొత్త కాన్సెప్ట్ ని కరోనా మహమ్మారి పరిచయం చేసింది. కరోనా 2020లో ప్రపంచాన్ని ఎంతగా పట్టి పీడించిందో అందరికీ తెలుసు. కరోనా పుణ్యమాని మనిషి రెండవ వారితో కలవలేని దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఆఫీసులకు తాళాలు పడ్డాయి. అంతా ఇళ్ళ నుంచి బయటకు రావడం అన్నది నెలల తరబడి పైగా జరగలేదు. సరిగ్గా ఆ సమయంలో అనేక కార్పోరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం అన్న విధానాన్ని అమలు చేశాయి. ఆ తరువాత కరోనా తగ్గినా కూడా దానికి పాక్షికంగా కొన్ని కంపెనీలు అమలు చేస్తే మరికొన్ని ఇంకా ఈ రోజు దాకా అమలు చేస్తూ ఉన్నాయి. అయితే ఇపుడు వర్క్ ఫ్రం హోం కి ఎండ్ కార్డు పడుతోంది. 2025 వెళ్ళిపోతూనే వర్క్ ఫ్రం హోం అన్న కల్చర్ ని కూడా తనతో తీసుకుని పోతోంది.

కొత్త ఏడాదితోనే :

ఇక ప్రపంచం అంతా ఎంతో ఆశగా ఆహ్వానిస్తున్న 2026 జనవరి 1 నుంచి అంతా ఆఫీసుకు రావాల్సిందే అని ఇప్పటికే ఐటీ టెక్నాలజీ ఫైనాన్షియల్ సంస్థలతో పాటు అనేక బడా కార్పోరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్తమానం పంపించాయి. వస్తే ఆఫీసుకు లేకపోతే ఇక పర్మనెంట్ గా ఇంటికే అని కూడా స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇక అంతా బద్ధకం వీడి ఆఫీసులకు కచ్చితంగా రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇక కార్పోరేట్ కల్చర్ ప్రకారం వారానికి అయిదు రోజుల పాటు ఆఫీసులో విధిగా ఉంటూ రోజుకు కచ్చితంగా ఎనిమిది గంటలు పనిచేయాల్సిందే అని హుకుం జారీ చేస్తున్నాయి.

కఠినంగానే అంతా :

ఇక ఉద్యోగులు ఆఫీసుకు రావడం అన్నది కఠినంగా అమలు చేస్తామని ఆ సంస్థలు చెబుతున్నాయి. అమెజాన్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజ సంస్థలతో పాటు జపీ మోర్గావ్ వంటి బ్యాంకింగ్ సంస్థలు ఇప్పటికే తమ ఉద్యోగుల విషయంలో కఠినంగా ఆదేశాలు అమలు చేస్తామని చెబుతున్నాయి. ఏవరికైనా ఆఫీసులకు రావడం అన్నది ఇష్టం లేకపోతే వారు ఏకంగా తమ సంస్థను వదిలేసి హాయిగా బయటకు వెళ్ళిపోవచ్చు అని అమెజాన్ క్లౌడ్ యాజమాన్యం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసింది. ఈ సంస్థ అయితే ఫిబ్రవరి 1 నుంచి వారంలో అయిదు రోజుల పాటు తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఆఫీసుకు రావాలని పేర్కొంటోంది.

ఆఫీసు వాతావరణంతోనే :

ఎక్కడైనా పనితీరు మెరుగు అయ్యేది ఆఫీసు వాతావరణంతోనే అని కార్పోరేట్ సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి. భారతదేశంలో ఐటీ దిగ్గజ సంస్థలుగా ఉన్న ఇన్ ఫోసిస్, టీసీఎస్ కూడా ఆఫీసుకే ఉద్యోగులు రావాలని కోరుతున్నాయి. సీనియర్ల వద్ద జూనియర్లు వర్క్ గురించి మెలకువలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని ముఖా ముఖీ చర్చల వల్ల ఎంతో ఫలితం ఉంటుందని సంస్థలు చెబుతున్నాయి. అలాగే ఎలా అభివృద్ధి చెందాలి, సంస్థను ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్న కొత్త ఆలోచనలు కూడా ఆఫీసులో పనిచేయడం ద్వారా వస్తాయని అంటున్నారు. దాంతో ఇక మీదట అంతా వర్క్ ఫ్రం హోం కి టాటా కొట్టేసి ఎంచక్కా ఆఫీసులకు వచ్చి తీరాల్సిందే అన్నది అందుతున్న సందేశంగా ఉంది.

Tags:    

Similar News