రేవంత్ చెప్పిన కర్ణాటక తరహా చట్టం ఏమిటి?

ప్రస్తుతం ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి కేసులు నమోదు చేయటానికి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 295ఎ ఈ కోవలోకే వస్తుంది. దీని కింద పలు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-21 09:30 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావటం... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత విద్వేషాన్ని ప్రదర్శించే వారి మీదా.. ద్వేషాల్ని రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలను ఉద్దేశించేందుకు వీలుగా కర్ణాటక తరహాలోనే తాము చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించటం తెలిసిందే. ఇంతకూ కర్ణాటకలో ఉన్న చట్టం ఏమిటి? దీని మీద ఉన్న పాజిటివ్.. నెగిటివ్ వాదనలు ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

2025 మేలో మంగళూరులో జరిగిన ఒక రివెంజ్ హత్య పెను సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో పలు మతపరమైన ఘర్షణలు కర్ణాటకలోచోటు చేసుకుంటున్న నేపథ్యంలో అలాంటి వాటికి చెక్ చెప్పేందుకు వీలుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తెచ్చేందుకు వీలుగా రాష్ట్ర విధాన సభ (అసెంబ్లీ)లో ఒక బిల్లును ప్రవేశ పెట్టారు. ‘‘The Karnataka Hate Speech and Hate Crimes (Prevention) Bill, 2025’’ గా దీన్ని పేర్కొన్నారు. దీన్ని తెలుగులో చెప్పాలంటే.. కర్ణాటక రాష్ట్ర ద్వేషపూరిత ప్రసంగం మరియు ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు, 2025గా చెప్పాలి. ఈ బిల్లుకు ఒక ప్రత్యేకత ఉంది.

భారతదేశంలో ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అయితే. ఇది పూర్తిస్థాయి చట్టంగా మారలేదు. 2025 మే 17న దీన్ని అక్కడి విధానసభలో బిల్లును కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అదే రోజు ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అనంతరం దీన్ని విధాన పరిషత్ (మన దగ్గర శాసన మండలి)కి పంపారు.

2025 మే 22న అక్కడి మండలిలో బిల్లును ప్రవేశ పెట్టారు. అయితే ఆ రాష్ట్ర ప్రతిపక్ష బీజేపీ.. జేడీఎస్ సభ్యులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుపై ఉన్న అభ్యంతరాలు.. నిరసనల నేపథ్యంలో దీనిపై చర్చ జరగలేదు. దీంతో మండలిలో బిల్లు ఆమోదం పొందలేదు. మండలిలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ రాజముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇది పూర్తిస్థాయి చట్టంగా అమల్లోకి వస్తుంది.

ప్రస్తుతం ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి కేసులు నమోదు చేయటానికి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 295ఎ ఈ కోవలోకే వస్తుంది. దీని కింద పలు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఇక.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన ఈ బిల్లులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

- ఈ బిల్లు మతం, కులం, భాష, లింగం, లైంగిక ధోరణి, పుట్టిన ప్రదేశం, వైకల్యం లేదా తెగ ఆధారంగా వ్యక్తులు లేదా సమూహాలపై హాని, అసమ్మతి లేదా ద్వేషాన్ని కలిగించే ఉద్దేశ్యంతో కూడిన ఏదైనా బహిరంగ వ్యక్తీకరణను ద్వేషపూరిత ప్రసంగంగా పరిగణిస్తుంది.

- అది మాటల్లో ఉన్నా.. రాత రూపంలో ఉన్నా పరిగణలోకి తీసుకుంటారు. ఈ చట్టం కింద నమోదయ్యే నేరాలకు బెయిలబుల్. నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు. వీటిని జ్యుడిసియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ విచారిస్తారు.

- ఈ బిల్లు సంస్థలను కూడా బాధ్యులుగా చేస్తుంది, సంస్థలోని ఆఫీస్ బేరర్లు నేరం గురించి తమకు తెలియదన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకున్నారని నిరూపించుకోని పక్షంలో వారు కూడా దోషులుగా పరిగణించే వీలుంది. ఈ కొత్త చట్టం భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 295ఎకు అదనంగా వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న చట్టాలకు లోబడి పని చేస్తుంది.

- ఇందులో పేర్కొన్న తరహాలో మొదటిసారి నేరానికి పాల్పడితే ఒక ఏడాది గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలుశిక్ష. రూ.50వేలు జరిమానా విధిస్తారు. అదే పనిగా మళ్లీ నేరానికి పాల్పడితే గరిష్ఠంగా పదేళ్లు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.

ఈ బిల్లుకు మద్దతుగా ఉన్న వాదనలు చూస్తే..

- బిల్లు సమాజంలో పెరుగుతున్న మత, కుల విద్వేషాలను, విభేదాలను అరికట్టి సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడానికి వీలవుతుంది.

- హేట్ స్పీచ్ కు ప్రత్యేకంగా నిర్వచించేందుకు.. పరిష్కరించేందుకు స్పష్టమైన చట్టం లేని నేపథ్యంలో ఇది సాయం చేస్తుంది.

- ద్వేషపూరిత ప్రసంగాన్ని సహించకూడదని, ఇలాంటి అంశాలపై క్రియాశీలకంగా వ్యవహరించాలని సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ బిల్లుకు స్పూర్తిగా పేర్కొంటారు. దీంతో బాధితులకు తగిన పరిహారం అందించేందుకు వీలు కలుగుతుంది.

దీనికి వ్యతిరేకంగా వాదనలు ఏమంటే..

- ఈ చట్టం పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధం. ఈ బిల్లులో పేర్కొన్న "హాని", ‘‘అసమ్మతి"లాంటి వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేవు. దీంతో అధికారంలో ఉన్న పార్టీలచే రాజకీయ ప్రత్యర్థులను, విమర్శకులను అణచివేయడానికి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.

- ఈ బిల్లు పోలీసులకు వారెంట్ లేకుండా అరెస్టు చేసేందుకు, బెయిల్ మంజూరు కాని నేరాలుగా పేర్కొనటం సరికాదు. దీంతో విచారణ ప్రక్రియ సైతం శిక్షగా మారే ప్రమాదం ఉంది.

- ఈ బిల్లు చట్టంగా మారితే ప్రజాస్వామ్యానికి అవసరమైన విమర్శనాత్మక విశ్లేషణ, ప్రభుత్వ విమర్శపై "గ్యాగ్" (gag) లాగా పని చేసి, స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని దెబ్బతీస్తుంది.

- ఈ బిల్లులోని కొన్ని అంశాలు, సుప్రీం కోర్టు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ కొట్టివేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఎతో సారూప్యత కలిగి ఉంది.

- రాజకీయ ప్రత్యర్థులను.. ఉద్యమకారులను.. జర్నలిస్టులను.. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవటానికి విస్తృత అధికారాలను ఇస్తాయి.

Tags:    

Similar News