ఏమి చేసినా ప్రసన్నమేనా...ఇలా అయితే ఎలా ?

అధినేత జగన్ అయితే ఈ విషయంలో ప్రసన్నకుమార్ రెడ్డితో మాట్లాడి ఆయన ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది అని ఆరా తీశారు అంటున్నారు.;

Update: 2025-07-10 02:45 GMT

ఒక రాజకీయ పార్టీలో విభిన్నమైన స్వభావం కలిగిన వారు ఉంటారు. అందరూ ఒకేలా ఉండాలని ఏమీ రూల్ లేదు. అయితే రాజకీయం అంటేనే దూకుడుగా చేయాలి. వర్తమానంలో అయితే భాష కూడా మారుతోంది. ఫైర్ బ్రాండ్ అన్న వారికి విలువ ఎక్కువ అవుతోంది. మీడియా ముందు కానీ పార్టీ మీటింగులలో కానీ ధాటీగా మాట్లాడేవారికి ప్రయారిటీ ఇస్తున్నారు.

దాంతో సహజంగానే ఆ వైఖరితో ఉన్న వారు మరింతగా రెచ్చిపోతున్నారు. రాజకీయం జనాలతో చేయాలి. సమాజం అన్నీ చూస్తూ ఉంటుంది. ఎంత కాలం మారినా కాళ్ళతో ఎవరూ అన్నం తినడం లేదు, చేతులతోనే తింటున్నారు. సభ్య సమాజంలో ఏమి మాట్లాడాలి ఏమి కూడదు అన్నది కూడా ఉంటుంది. జనాలు తమ భాష పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది.

అయితే పొరపాటు అయింది తడబాటులో దొర్లింది అని నేతలు అనడం లేదు మేము అనాలనే అంటున్నామని కట్టుబడి ఉన్నామని అంటున్నారు. ఇది మరింత బాధాకరమైన ధోరణిగా మారుతోంది. తాజాగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని అంటున్నారు.

ఆమె ప్రసన్నకుమార్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడిందని ఆయన ఏకంగా ఆమె వ్యక్తిత్వం మీద మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అంటున్నారు. ఇది తప్పు అని మొత్తం అంతా అంటున్నారు. ఆ వీడియో చూసిన వారు అనే మాట ఒక్కటే. ఇక్కడ రాజకీయాలు చూడకూడదు, తమ వారు పరవారు అంతకంటే లెక్క తీయరాదు, తప్పు చేసిన వారు ఎవరైనా కూడా పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిందే.

అయితే వైసీపీలో మాత్రం ఇంకా సమర్ధించే వైఖరితోనే ఉండడం విశేషం అంటున్నారు. అధినేత జగన్ అయితే ఈ విషయంలో ప్రసన్నకుమార్ రెడ్డితో మాట్లాడి ఆయన ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది అని ఆరా తీశారు అంటున్నారు. అదే సమయంలో దానికి ముందు ఏమి జరిగింది పర్యవసానాలు ఏమిటి అన్నది ఆయనకు తెలియకుండా ఉంటుందా అన్నదే చర్చగా ఉంది. తన పార్టీ వారు అయినా తప్పు జరిగితే ఖండించాలి కదా అని అంటున్నారు.

పైగా ప్రశాంతి రెడ్డి కూడా నిన్నటిదాకా వైసీపీలో ఉన్న వారే. మరి మహిళల విషయంలో ఈ తీరుగా వ్యవహరించడం తప్పు అని వైసీపీ పెద్దలకు ఎందుకు అనిపించలేదు అని అంటున్నారు. గతంలో నిండు అసెంబ్లీలో కూడా వైసీపీకి చెందిన వారు కొందరు ఈ తరహా ఆరోపణలు తమ కుటుంబం మీద వ్యక్తిగతంగా చేశారు అని చంద్రబాబు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేసి వచ్చారు. ఆ సంఘటన తరువాత కాలంలో వైసీపీ ఓటమికి ఒక కారణం అయింది అని అంటారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఈ విషయంలో తప్పుగా మాట్లాడింది ప్రసన్నకుమార్ రెడ్డి అయితే వైసీపీ అధినాయకత్వం దానిని ఖండించకుండా ఉండడం మరింత తప్పుగా చెబుతున్నారు. మాజీ ఎంపీ వైఎస్సార్ కి సన్నిహితుడు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే దీని మీద మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి విషయంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అని వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో ప్రసన్నకుమార్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు. అంతే కాదు ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను జగన్‌ ఖండించాలని కూడా సూచించారు. ఉండవల్లి ఇపుడు ఏ రాజకీయ పార్టీలోనూ లేరు. ఆయన రాజకీయ విశ్లేషకునిగా తటస్థునిగా ఉన్నారు. మరి ఆయన ఈ విషయంలో అన్నీ చూసి చెప్పినట్లుగానే భావించాలని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఖండించారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవమానకరమని ఆమె అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను మహిళా లోకం ఎన్నటికీ క్షమించదుని స్పష్టం చేశారు. ఈ తరహాలో మహిళలను కించపరిచే చర్యలను తిప్పికొడదామని ఆమె మహిళలకు పిలుపు ఇచ్చారు.

మొత్తం మీద చూస్తే కనుక వైసీపీ అధినాయకత్వం పార్టీలో ఎవరో చేసిన తప్పులను మొత్తం పార్టీకి ఆపాదించేలా చేసుకుంటూ రాజకీయంగా భారీ మూల్యం చెల్లిస్తోంది అని అంటున్నారు. అలా కాకుండా తప్పుని తప్పుగా చూసి తగిన విధంగా స్పందిస్తే పార్టీకి ఎంతో మేలు అన్న సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News