బనకచర్ల..పక్కా ప్లానింగ్ తో చంద్రబాబు

ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కించే ప్రాజెక్ట్ గా మారింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది మెగా ప్రాజెక్ట్.;

Update: 2025-06-26 03:57 GMT

ఏపీలో బనకచర్ల ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కించే ప్రాజెక్ట్ గా మారింది. పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు భారీది అయినా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలకెత్తుకుంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికగా ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్ట్ ని బాబు 2014 నుంచి 2019 మధ్యలో సీఎం గా ఉండగానే ప్రతిపాదనలతో సిద్ధం చేశారు.

అయితే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కొర్రీలు వేస్తూ వచ్చింది. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో మధ్యలో చెడింది. దాంతో ఈ ప్రాజెక్ట్ అలా కొంత జాప్యంతో సాగుతున్న క్రమంలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో మొత్తం అటకెక్కింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఈ ప్రాజెక్ట్ ని పరిశీలించినా అది చాలా బృహత్ పధకం అని భావించారు అని చెబుతారు.

దాంతో ఆయన రాయలసీమ ఎత్తిపోతల పధకానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అంటారు. ఇక మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. ఈ రోజున కేంద్రంలో అనుకూలంగా నరేంద్ర మోడీ ప్రభుతం ఉంది. అనుమతులు ఈజీగా వస్తాయి.

ఇక ఈ ప్రాజెక్ట్ ఫీజుబిలిటీని చూసి ఆర్ధిక వనరులూ సమకూరుతాయని భావిస్తూ చాలా ధైర్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో బాబు ఎంత పట్టుదలగా ఉన్నారు అంటే తాజాగా జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో సైతం మరోసారి గట్టిగా చెప్పారు. ఇది ఎవరికీ నష్టం లేని ప్రాజెక్ట్ అని. అంతే కాదు దీని వల్ల సముద్రంలో వృధాగా కలుస్తున్న గోదావరి జలాలనే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆ మరునాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ దీని మీద బాబు సీరియస్ గా డిస్కషన్ చేశారు.

ఈ ప్రాజెక్ట్ మీద ఏపీ వాదనలను మంత్రులు ధీటుగా వినిపించాలని కోరారు. ఇక బనకచర్ల ప్రాజెక్ట్ మీద ప్రత్యేక కార్పోరేషన్ ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇక ఆగేది లేదు అని చెప్పడమే అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఒక వైపు తెలంగాణాలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డు చెబుతున్నా కూడా ఏపీ మాత్రం దూకుడుగానే ముందుకు సాగుతోంది అని అంటున్నారు. అందుకే ఏకంగా కార్పోరేషన్ నే ఏర్పాటు చేసింది అని గుర్తు చేస్తున్నారు.

ఇక పోలవరం బనకచర్ల విషయం తీసుకుంటే జూలై నెలలో కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తాయని చెబుతున్నారు. ఆ మీదట సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టాలని ఒక భారీ షెడ్యూల్ నే ఏపీ సర్కార్ సిద్ధం చేసుకుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల భారీ రాజకీయ లాభాన్ని కూడా టీడీపీ ఆశిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి అయితే రాయలసీమ అంతటా సస్యశ్యామలం అవుతుంది రాయలసీమ వైసీపీకి హార్డ్ కోర్ పొలిటికల్ సెంటర్. దాంతో వైసీపీకి నడ్డి విరిచేలా అక్కడే పట్టు సాధించే ఏపీలో వైసీపీకి ఎక్కడా ఊపిరి అందదు అన్నది కూడా ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ని శరవేగంగా పట్టాలు ఎక్కిస్తే 2029 ఎన్నికల వేళకు ఎంత పూర్తి అయినా దానిని చూపించి రాయలసీమ ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చు అన్నదే చంద్రబాబు మార్క్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. మరి ఏపీ తీసుకున్న ఈ వేగవంతమైన స్టెప్ కి తెలంగాణా నుంచి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News