ఎలా ఉన్నారు.. మరింత విశ్రాంతి తీసుకోండి: పవన్‌కు మోడీ సూచన
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు.;
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. వీరిద్దరి నివాసాలు జూబ్లీహిల్స్ లోనే ఉన్నాయి. అయితే.. తొలుత పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన ప్రధాన మంత్రి.. ఆయనను పరామర్శించారు. ఇటీవల సైనస్ కారణంగా ముక్కుకు ఆపరేషన్ చేయించుకుని ఇంట్లోనే రెస్టు తీసుకుం టున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్‌ను పరామర్శించిన ప్రధాని.. మరింత రెస్టు తీసుకోవాలని సూచించారు. ``ఎలా ఉన్నారు`` అంటూ పలకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కుటుంబం వివరాలను ఆయన తెలుసుకున్నారు.
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చిన ప్రధాన మంత్రి.. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ప్రధాన మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం లోపలికి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధా నికి అరకు కాఫీ ఇచ్చినట్టు తెలిసింది. కుటుంబ సభ్యుల వివరాలు.. తెలుసుకున్న ప్రధాని.. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు మనవడి గురించి ఆరా తీశారు. ఎక్కడ చదువుతున్నాడు.. ఏం చేస్తున్నాడని తెలుసుకున్నారు. చెస్‌లో ఇటీవల కాలంలో సాధించిన ప్రగతిని లోకేష్ స్వయంగా వివరించారు. దీంతో మోడీ సంతోషం వ్యక్తం చేశారు. చెస్ క్రీడగానే కాకుండా.. మేథోశక్తిని సైతం పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి నివాసంలో గంటకుపైనే ఉన్న మోడీ.. ఏపీ పరిస్థితిని కూడా తెలుసుకున్నట్టు సమాచారం. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా.. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సంగతులను కూడా వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలిసింది. మరో తమిళనాడు రాజకీయాల ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం. సీఎంగా టీవీకే అధిపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంపై ఇరువురు మాట్లాడు కున్నారు. చంద్రబాబు పనితీరు బాగుందని ప్రధాని ప్రశంసలు గుప్పించారు. కాగా.. ఈసమావేశాలకు మీడియాను దూరంగా ఉంచారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.