కేజీ ప్లాస్టిక్ ఇస్తే చాలు వేడివేడి భోజనం ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
ఇకపోతే 2019 నుంచి ఈ కేఫ్ ద్వారా 23 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిందని వేస్ట్ మేనేజ్మెంట్ లో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రితేష్ షైనీ తెలిపారు.;
ప్లాస్టిక్ వాడకం ఈమధ్య కాలంలో ఏ రేంజ్ లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా పట్టణాలను మొదలుకొని పల్లెటూళ్ల వరకు ప్రతి ప్రాంతంలో ఏ చిన్న సందర్భంలో అయినా సరే తప్పకుండా ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు.. ముఖ్యంగా అంగళ్లలో, దుకాణాలలో, హోటల్స్ లో ప్లాస్టిక్ వాడకం నిషేధించినా.. అక్కడక్కడ ఈ ప్లాస్టిక్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఈ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి దాదాపు వందల ఏళ్ల సమయం పడుతుంది. ఇది భూమిని కలుషితం చేయడమే కాకుండా ఈ ప్లాస్టిక్ ను కాల్చడం వల్ల వెలువడే రసాయనాలు మనిషి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. అటు పర్యావరణాన్ని నాశనం చేస్తుంది.
కేజీ ప్లాస్టిక్ ఇస్తే వేడి వేడి ఆహారం మీ ముందే..
అందుకే సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ ఉత్పత్తి ఆపివేయాలి అని, అసలు ప్లాస్టిక్ వాడకూడదని ప్రభుత్వాలు ఎంత చెప్పినా అక్కడక్కడ ప్లాస్టిక్ వినియోగం మాత్రం మనకు కనిపిస్తూనే ఉంది. ఈ ప్లాస్టిక్ అనేది మన నిత్య అవసరాలలో ఒకటిగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక దీనిని నాశనం చేయాలి అంటే అంత సులభమైన పనికాదు. ఒకసారి ఉపయోగించి వాడిపడేసే ఈ ప్లాస్టిక్ ను తిరిగి రీసైక్లింగ్ చేస్తూ మళ్ళీ ఉపయోగిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. కానీ ఇక్కడ ఒక నగరంలో వినూత్న ఆలోచన చేసి ప్లాస్టిక్ ను తగ్గించి ఇప్పుడు ప్లాస్టిక్ రహిత నగరంగా ఆ ప్రాంతాన్ని మార్చేశారు. పైగా మీరు చేసిన ఆలోచన ఏంటంటే.. కేజీ ప్లాస్టిక్ ఇస్తే వేడి వేడి భోజనం క్షణాల్లో మీ ముందుకంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
"మోర్ ది వేస్ట్.. బెటర్ ది టేస్ట్"..
అసలు విషయంలోకి వెళ్తే.. నగరాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి ఒక కేఫ్ ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపించే ప్రయత్నం చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఛత్తీస్ ఘడ్ లోని సర్గుజ జిల్లాకి ప్రధాన కార్యాలయంగా ఉన్న అంబికాపూర్ నగరంలోని.. అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వినోద్ కుమార్ పటేల్ అనే వ్యక్తి ఈ కేఫ్ నిర్వహిస్తున్నారు. అరకిలో ప్లాస్టిక్ తీసుకొస్తే సమోసా, వడపావు లాంటి బ్రేక్ ఫాస్ట్ లభిస్తుందని .. ఒకవేళ కేజీ ప్లాస్టిక్ ఇస్తే వేడి వేడి అన్నం, రెండు కూరలు, పప్పు, పచ్చడి, సలాడ్ తో కూడిన ఫుల్ మీల్స్ లభిస్తుందని ఆయన తెలిపారు. అంబికాపూర్ నగరంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైందని , ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు వ్యర్థాలకు ఆహారాన్ని ముడిపెట్టారు. 2019లో "మోర్ ది వేస్ట్.. బెటర్ ది టేస్ట్" అనే నినాదంతో గార్బేజ్ కేఫ్ ను ప్రారంభించారు.
ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఆకలి సమస్యలు తీర్చడమే లక్ష్యం..
ఇకపోతే ఈ గార్బేజ్ కేఫ్ కి అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ బడ్జెట్ నుండి నిధులు కేటాయిస్తున్నారు.. దీనిని నగరంలోని ప్రధాన బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అంబికాపూర్ లో ఉన్న రెండు సమస్యలు ఉన్నాయి.. ఒకటి ప్లాస్టిక్ వ్యర్ధాలు రెండోది ఆకలి.. దీనిని పరిష్కరించడం కోసమే ఈ ఆలోచన చేసాము అని వినోద్ పటేల్ తెలిపారు. పేదలు , ముఖ్యంగా ఆశ్రయం లేని వాళ్ళు, చెత్త ఏరుకునేవారు.. డంపింగ్ వీధుల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి తీసుకొస్తే వారికి వేడివేడి భోజనం అందించడం జరుగుతుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా నగరాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడమే కాకుండా వీధుల్లో ఆకలితో అలమటించే ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చడం ఒక వినూత్న ఆలోచన అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచన అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వస్తే నిజంగా నగరాలు కాదు పట్టణాలు, వీధులు ప్రతి ఒక్కటి ప్లాస్టిక్ రహితంగా మారిపోతాయని, అటు నిరాశ్రయుల ఆకలి కూడా తీరుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ ఆలోచన ప్లాస్టిక్ నిరోధకం మాత్రమే కాదు ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడం అలాగే పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం అవుతుంది. ఇకపోతే ఈ కేఫ్ సగటున రోజుకు 20 మందికి ఆహారం అందిస్తోందని వినోద్ పటేల్ తెలిపారు.
ప్లాస్టిక్ రహిత నగరంగా అంబికాపూర్..
ఇకపోతే 2019 నుంచి ఈ కేఫ్ ద్వారా 23 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిందని వేస్ట్ మేనేజ్మెంట్ లో కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న రితేష్ షైనీ తెలిపారు. 2019లో నగరంలోని డంపింగ్ యార్డ్లకు 5.4 టన్నుల ప్లాస్టిక్ వెళ్ళేది. కానీ ఈ కేఫ్ వల్ల 2024 నాటికి రెండు టన్నులకు తగ్గింది అని తెలిపారు. ఈ నగరంలో లభ్యమయ్యే ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేస్తారని, వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపిస్తారని, అలాగే తడి వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మారుస్తారని సమాచారం. మొత్తానికైతే ఇప్పుడు అంబికాపూర్ వ్యర్థాలు లేని నగరంగా గుర్తింపు సొంతం చేసుకుంది.