ట్యాపింగ్ చేయమన్నది నాటి డీజీపీ.. ప్రభాకర్ రావు కొత్త పల్లవి

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నోట కొత్తమాట ఒకటి వచ్చింది.;

Update: 2025-06-21 04:10 GMT

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు నోట కొత్తమాట ఒకటి వచ్చింది. ఇప్పటివరకు పలుమార్లు విచారణకు హాజరైన ఆయన.. పొంతన లేని వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అందుకు భిన్నంగా శుక్రవారం సిట్ విచారణలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. నాటి డీజీపీ చెబితేనే తాను అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేశానని.. నాటి ప్రభుత్వ పెద్దలు ఎవరు తనకు ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇదే కేసులో గతంలో సిట్ చేపట్టిన విచారణలో పాల్గొన్న ప్రణీత్ రావు.. భుజంగరావు.. రాధాకిషన్ రావు.. తిరుపతన్న అందరూ ప్రభాకర్ రావు ఆదేశాల్ని పాటించినట్లు చెప్పగా.. తాజాగా ఆయన నాటి డీజీపీ పేరును తెర మీదకు తీసుకురావటం గమనార్హం. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినట్లు? అలాంటి చర్యలకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారన్న సిట్ ప్రశ్నలకు స్పందిస్తూ తొలుత మావోలకు సహకరించినట్లుగా సమాచారంతో తాము ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

ఆయన వాదనకు తగిన ఆధారాలు చూపాలని సిట్ ప్రశ్నించటంతో ఉన్నతాధికారులపై వేలెత్తి చూపిన వైనం ఇప్పుడు పోలీసు వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. తనపై నమోదైన కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు వీలుగా ఈ తరహా వాదనను వినిపించారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రానున్న రోజుల్లో పెను సంచలనాలకు.. రాజకీయ అలజడులకు కారణమవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News