పవన్ మౌనం వెనక ఏముంది ?
ఇక పవన్ తనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అప్పగించిన శాఖల పట్ల పూర్తి శ్రద్ధ పెడుతున్నారు.;

జనసేన అధినేత టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఒక విధంగా ఆయన కూటమి ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. అలాంటిది పవన్ కీలకమైన విషయాలలో ఈ మధ్య పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అంతే కాదు కూటమి పాలన ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీడీపీ అధినాయకత్వం చాలానే హడావుడి చేసింది. కానీ జనసేన నుంచి అయితే పెద్దగా కనిపించడం లేదు.
మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ తన పరిధిలు పర్మితులు ఐరిగి ఒక వ్యూహం ప్రకారమే మౌనం వహిస్తున్నారు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వానికి పెద్దన్నగా టీడీపీ ఉంది. ఇరవై మంది మంత్రులు టీడీపీ నుంచి ఉన్నారు. అంతే కాదు చంద్రబాబు లోకేష్ ఇద్దరూ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం పట్ల సహజంగానే ఏడాది తర్వాత ప్రజా వ్యతిరేకత వస్తుంది అని ఉంది. ఎంతో కొంత ఉందని సర్వే నివేదికలు వెళ్లడిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం పట్ల వచ్చే వ్యతిరేకతలో తాము భాగస్వాములు కాదలచుకోలేదన్నట్లుగానే జనసేన అధినాయకత్వం ఉంది అని అంటున్నారు. అందుకే పెద్దగా ప్రభుత్వ పరిపాలనా విధానంలో జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు. ఏపీలో చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ వాటి మీద జనసేన నుంచి ఒక మాదిరి రియాక్షన్ వస్తోంది.
ఉదాహరణకు అమరావతి రాజధాని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు అంటూ పెద్ద రాజకీయ అలజడి రేగింది. అయితే ఆ విషయంలో పవన్ ఒక్క మాటలో తేల్చేశారు. రాజధానిని అలా అనకూడదని బాధ్యులపైన చట్ట ప్రకారం చర్యలు ఉండాలని అన్నారు. ఆ మీదట మరే మాటా కానీ ప్రకటన కానీ రాలేదు. ఇలా పరిమితంగానే స్పందిస్తున్నారు అని అంటున్నారు.
ఇదే కాదు ప్రభుత్వ తీసుకునే అనేక విధాన పరమైన నిర్ణయాల విషయంలో కూడా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు అని చెబుతున్నారు. వీటి మీద మాట్లాడినా హడావుడి చేసినా ఆ వచ్చే వ్యతిరేకత కచ్చితంగా తమకూ చుట్టుకుంటుంది అన్న చాలోచనతోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.
ఇక పవన్ తనతో పాటు మరో ఇద్దరు మంత్రులకు అప్పగించిన శాఖల పట్ల పూర్తి శ్రద్ధ పెడుతున్నారు. జనసేనకు ఇచ్చిన శాఖల ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. ఇక 2024లో 21కి 21 సీట్లు గెలిచి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేన రికార్డు క్రియేట్ చేసింది.
వచ్చే ఎన్నికల్లోనూ ఇంతకు ఇంతా సీట్లు గెలుచుకుంటే కనుక కచ్చితంగా 2029 తరువాత ఏర్పడే ప్రభుత్వంలో తమకు సరైన ప్రాధాన్యత ఉంటుందని ఉండాలని చూస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఎపుడు డిమాండ్ ప్రధాన పాత్ర వహిస్తుంది అందువల్ల రేపటి ఎన్నికల్లో కనుక అధిక సీట్లు టీడీపీ కానీ వైసీపీ కానీ సాధించినా తాము కూడా ముప్పయి నుంచి నలభై సీట్లు తెచ్చుకుంటే ఏపీలో కీలకమైన పాత్ర పోషించవచ్చు అన్నదే పవన్ ఆలోచన అంటున్నారు.
అంటే కర్నాటకలో కుమారస్వామి జేడీఎస్ పార్టీ పోషించినట్లుగా కింగ్ మేకర్ పాత్ర పోషించడం ద్వారా 2029లోనే సీఎం పోస్టుకు గురి పెట్టవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరగాలి అంటే టీడీపీకి దూరం కాకుండా ఆ పార్టీతో పొత్తు కొనసాగిస్తూనే తనకు ఉన్న అభిమాన గణాన్ని అలాగే చూసుకుంటూ బలమైన అండగా నిలిచే కాపు సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకోకుండా తగిన వ్యూహాలతో ముందుకు సాగాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు.
అందుకే ఆయన కూటమి ప్రభుత్వంలో మునుపటి మాదిరిగా ఎక్కువ హడావిడి చేయడం లేదు అని అంటున్నారు. ఎవరు కాదన్నా టీడీపీ లీడ్ చేస్తోంది. ఆ పార్టీదే పై చేయి అవుతుంది. అలాంటపుడు బయటపడి మాట్లాడినా ఇబ్బందికరమైన పరిస్థితులు కోరి తెచ్చుకోవడం తప్ప మరేమీ లేదని భావిస్తూనే జనసేన మౌనంగానే ఉంటోంది అంటున్నారు. అలా ఒక వ్యూహం ప్రకారం భవిష్యత్తు రాజకీయానికి పదును పెడుతోంది అని అంటున్నారు.