2029 ఎన్నికల కోసం పవన్ యాక్షన్ ప్లాన్ !
అదే విధంగా చూస్తే 2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు, తిరుపతి అసెంబ్లీ సీట్లలో జనసేన విజయం సాధించింది.;
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన బలోపేతం మీద దృష్టి సారించారు. చేతిలో అధికారం ఉంది ఇంకా నాలుగేళ్ల దాకా సమయం ఉంది. దాంతో జనసేనను మొత్తం ఏపీలో అంతటా మరింతగా పటిష్టం చేయాలని పవన్ నిర్ణయించారు అని తెలుస్తోంది.
సహజంగా జనసేన బలం ఎక్కడ అంటే గోదావరి జిల్లాలోనే అని వినిపిస్తోంది. అయితే ఆ ముద్రను చెరిపేసుకోవడానికి పవన్ రాష్ట్ర పర్యటనలకు యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు అని అంటున్నారు. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలలో గట్టి బలం ఉంది. ఆ తరువాత చూస్తే ఉత్తరాంధ్రాలో కొంతదాకా బలం ఉంది. రాయలసీమలో కూడా ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉంది
ఈ నేపధ్యంలో జనసేనను బలోపేతం చేసేందుకు ఇదే సరైన తరుణం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక తన ఆలోచనలలో భాగంగా మొదటిగా పార్టీ పదవులలో అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు మహిళలకు కూడా పెద్ద పీట వేయాలని చూస్తున్నారు.
అదే సమయంలో నామినేటెడ్ పదవులలో సైతం అన్ని జిల్లాలలో ఉన్న వారికి ఇవ్వాలని పార్టీ కోసం నిరంతరం చురుకుగా పనిచేసే వారికి చాన్స్ ఇవ్వాలని పవన్ ఒక ప్రణాళిక రూపొందించుకున్నారని అంటున్నారు. అదే విధంగా చూస్తే పవన్ పార్టీని బలోపేతం చేసేందుకు భవిష్యత్తు ఆలోచనలు చాలా ఉన్నాయని అంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కాస్తా 225 సీట్లు అవుతాయని అంటున్నారు. ఇక జనసేన చూస్తే 2024లో 21 సీట్లకు 21 సీట్లూ గెలుచుకుని ఒక రికార్డుని సృష్టించింది. దాంతో వచ్చే నాటికి ఈ సంఖ్యను డబుల్ చేసుకోవాలని అనుకుంటోంది. అంటే 50 దాకా అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి చూస్తోంది అని అంటున్నారు.
మరి అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటే పార్టీ బలంగా ఉండాలి, ఇప్పటికే పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి ప్రోత్సహించాలని ఆలోచిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో తూర్పు కాపులు బలంగా ఉన్నారు. దాంతో అక్కడ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే 2024 ఎన్నికల్లో రైల్వే కోడూరు, తిరుపతి అసెంబ్లీ సీట్లలో జనసేన విజయం సాధించింది. ఈసారి అక్కడ మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని పవన్ యోచిస్తున్నారు అని అంటున్నారు. సీమలో ఎక్కువగా బలిజ సామాజిక వర్గం నేతలు ఉన్నారు. దాంతో పార్టీని సులువుగానే పటిష్టం చేసుకోవచ్చు అన్నది కూడా ప్లాన్ గా ఉంది అని అంటున్నారు.
ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది దాంతో మిగిలిన నాలుగేళ్ళలో పార్టీని ఒక గాడిలో పెట్టుకుని బలోపేతం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వీలైనంత తొందరలో పవన్ జిల్లాల పర్యటనలు చేస్తారు అని అంటున్నారు. ప్రభుత్వం అందించే కార్యక్రమాల అమలుని ఆయన పరిశీలిస్తూనే మరో వైపు పార్టీ పనితీరుని కూడా గమనించి ఎక్కడికక్కడ చురుకైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2029 ఎన్నికల కోసం పవన్ ఇప్పటి నుంచే మాస్టర్ స్కెచ్ తో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. చూడాలి మరి జనసేనాని స్పీడ్ ఏ విధంగా ఉంటుందో అన్నది.