ప్రభుత్వ ఆఫీసుల్లో పవన్ ఫోటోలు....తొలగించాల్సిందేనా ?

ఏపీలో 2024 జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ ప్రకటించింది.;

Update: 2025-09-10 03:56 GMT

ఏపీలో 2024 జూన్ 12న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా కూటమి సర్కార్ ప్రకటించింది. అయితే రాజ్యాంగం ప్రకారం చూస్తే ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది లేదు. ఇక చూస్తే పవన్ కళ్యాణ్ తాను మంత్రిని అని మాత్రమే రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు హోదాని ప్రభుత్వం ఇస్తోంది. కేవలం ఉప ముఖ్యమంత్రులు ఏపీకి మాత్రమే లేరు. తెలంగాణా కర్ణాటక తమిళనాడుకు కూడా ఉన్నారు. కానీ అక్కడికి ఇక్కడికి తేడా చాలా ఉంది అని అంటున్నారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోలు :

ప్రభుత్వ ఆఫీసుల్లో పోటోలు ఎవరికి ఉండాలి అన్నది ఒక నిర్దిష్టమైన విధానం ఉంది అని అంటున్నారు. దేశ రాష్ట్రపతి ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ముగ్గురు ఫోటోలు మాత్రమే దేశంలో ఎక్కడ చూసినా ఉంటాయి. ఏపీకి వచ్చేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెడుతున్నారు. మరి దానికి చట్టబద్ధత ఉందా ఉత్తర్వులు ఏమైనా ప్రత్యేకంగా జారీ చేశారా అన్న దాని మీదనే ఇపుడు ఒకరు కోర్టుకు వెళ్ళారు. ఎటువంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రభుత్వ ఆఫీసులలో ఉంచుతున్నారు అని పిల్ దాఖలు చేశారు.

ప్రజా ప్రయోజన వ్యాజ్యం :

ఇక ఈ పిల్ ని దాఖలు చేసిన వారు విజయవాడకు చెందిన రైల్వే శాఖ విశ్రాంత ఉద్యోగి వై కొండలరావు. ఆయన చట్టబద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా పవన్ ఫోటోలు పెడతారు అని కోర్టుకు వెళ్ళారు. దీనికంటే ముందు ఆయన సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించారు. పవన్ కళ్యాణ్ ఫోటోలు ఏ ప్రాతిపదికన ఆఫీసుల్లో పెడుతున్నారు, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు కానీ నిబంధనలు కానీ లేదా సర్క్యులర్లు కానీ జారీ చేసిందా అని ప్రశ్నించారు. ఉంటే కనుక వాటి వివరాలు ఇవ్వాలని ఆయన కోరారు. అయితే దీని మీద సమాచార, పౌర సంబంధాల శాఖ అయితే ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు కానీ ఆదేశాలు కానీ లేవని స్పష్టంగా పేర్కొంది. దాంతోనే ఆయన కోర్టుకు వెళ్ళారు. ఏ రకమైన చట్టబద్ధ అనుమతి లేకపోయినా పవన్ ఫోటోలు ఎలా ఆఫీసుల్లో పెడుతున్నారు అని పిల్ ని దాఖలు చేశారు.

రాజ్యాంగ బద్ధం కాదు :

ఉప ముఖ్యమంత్రి పదవి అన్నది రాజ్యాంగబద్ధం కాదని ఆయన తన పిల్ లో పేర్కొన్నారు. రాజకీయ నేతలను పెద్దవారుగా చూపుతూ వారిని పొగిడేందుకు కానీ స్థాయిని పెంచెందుకు కానీ ప్రజా ధనం వెచ్చించకూడదు

అని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయని చెబుతున్నారు. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను అయినా పెంచాలని చూడడం కోసం ప్రభుత్వ ధనంతో అది చేయకూడదని స్పష్టంగా సుప్రీం కోర్డు గైడ్ లైన్స్ ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కనుక ఈ విషయంలో ఒక నిర్దిష్టమైన విధానం రూపొందించేంతవరకూ కూడా పవన్ ఫోటోలు ఆఫీసు నుంచి తొలగించాలని ఆయన కోరుతున్నారు.

ప్రతివాదులుగా వారంతా :

అయితే ఈ పిటిషన్ మీద హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి, సహాయ కార్యదర్శి, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కూడా వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చింది. ఇక ఈ కేసుని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ఆధ్వర్యంలోని ధర్మాసనం బుధవారం విచారిస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News