టెన్షన్ పెంచుతున్న పాక్.. అణుబూచి చూపిస్తూ భారత్‌ను భయపెట్టాలని చూస్తోందా?

భారత్ పాక్ బెదిరింపులను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా పెహల్గాం ఘటనకు నిరసనగా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుండటంతో పాకిస్తాన్‌కు గుండెల్లో గుబులు మొదలైంది.;

Update: 2025-05-04 13:30 GMT

భారత్ పాక్ బెదిరింపులను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా పెహల్గాం ఘటనకు నిరసనగా ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుండటంతో పాకిస్తాన్‌కు గుండెల్లో గుబులు మొదలైంది. అందుకే కవ్వింపు చర్యలను ఆపకుండా, తాజాగా రష్యాలోని పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ భారత్‌ను అణ్వాయుధాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశాడు. న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే అణ్వాయుధాలతో సహా తమ పూర్తి శక్తిని ఉపయోగిస్తామని హెచ్చరించాడు. రష్యాకు చెందిన ఆర్టీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

"భారత్‌కు చెందిన బాధ్యత లేని మీడియాలో వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పకుండా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న డాక్యుమెంట్స్‌లో భారత్ కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం వస్తే మా సైన్యం సంఖ్యను చూసి భయపడమని మేము స్పష్టం చేస్తున్నాం. మా ప్రజల మద్దతుతో పాటు సంప్రదాయ, అణు బలంతో పూర్తి స్థాయిలో ప్రతిస్పందిస్తాం" అని జమాలీ అన్నాడు.

పాకిస్తాన్ మద్దతుతో పహల్గామ్‌లోని బైసారన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఆ టెర్రరిస్టులు పాకిస్తాన్ జాతీయులని తేలింది. వారిలో ఒకడు పాకిస్తాన్ మాజీ పారా కమాండో అని కూడా గుర్తించారు. ఈ ఉగ్రదాడిపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందిస్తుందని పాకిస్తాన్ బాగా భయపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి భారత్ ఇస్లామాబాద్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులపై, వారికి సహాయం చేసే వారిపై చర్యలు తీసుకోవడానికి భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో వారే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.

ఈ పరిస్థితుల్లో సైనిక చర్య కూడా ఉండవచ్చనే భయంతో పాకిస్తాన్ యుద్ధం వస్తే అణ్వాయుధాలు ఉపయోగిస్తామని పదే పదే ప్రకటనలు చేస్తోంది. గత వారం ఆ దేశ రైల్వే శాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే సిద్ధంగా ఉన్నాయని ప్రకటించాడు.

Tags:    

Similar News