ఆయుధాలతో కంటే అబద్దాలతో యుద్ధం చేస్తున్న పాక్

ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో నిజాల కంటే అబద్ధాలు అత్యంత వేగంగా ప్రపంచాన్నిచుట్టి వస్తున్న వేళ..దాన్నో యుద్ధ ఆయుధంగా వాడుతోంది.;

Update: 2025-05-10 09:30 GMT

ఒళ్లంతా కుట్రలు.. కుతంత్రాలు.. భారత్ మీద అనుక్షణం విషం చిమ్మే పాకిస్తాన్ తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తన ద్వేషాన్ని మరింత పెంచుకుంటోంది. అధర్మ యుద్ధం చేస్తోంది. ఆయుధాలతో యుద్ధాన్ని వదిలేసిన పాకిస్తాన్.. దానికి మించి అబద్ధాల్ని ప్రచారం చేసే యుద్ధాన్ని చేస్తోంది. ఇప్పుడున్న సోషల్ మీడియా కాలంలో నిజాల కంటే అబద్ధాలు అత్యంత వేగంగా ప్రపంచాన్నిచుట్టి వస్తున్న వేళ..దాన్నో యుద్ధ ఆయుధంగా వాడుతోంది.

తాను చెప్పాలనుకున్న అబద్ధాల్ని తనతో పాటు.. తన మిత్రుల సాయాన్ని కోరి.. వారితో లోకం మొత్తానికి తప్పుడు ప్రచారం జరిగేలా ప్లాన్ చేసిందని చెప్పాలి. ఇలా చేస్తున్న ప్రచారాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించింది భారత్. ఉద్రిక్తతల వేళ.. పాక్ చేసే తప్పుడు ప్రచారంతో పాటు.. ఆ దేశానికి మద్దతు ఇచ్చే మిత్రదేశాల సాయం తీసుకొని తాను క్రియేట్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రపంచం నమ్మేలా చేస్తోంది.

భారత అమ్ములపొదిలో అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ 400 ను పాకిస్తాన్ ఒక క్షిపణితో కూల్చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం ఈ కోవకు చెందినదే. ఎస్ 400 రాడార్ రేంజ్ దాదాపు 600 కి.మీ.గా చెబుతారు. అలాంటి పవర్ ఫుల్ క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్ కు చెందిన జేఎఫ్ 17 వార్ ఫ్లైట్ ఒక క్షిపణితో కూల్చేసినట్లుగా పాక్ కు చెందిన పీటీవీ కథనం రాస్తే.. దాన్ని చైనా ప్రభుత్వ రంగానికి చెందిన షినువా మీడియా సంస్థ ప్రచారంలోకి తీసుకొచ్చింది.

ఆ వెంటనే దీన్ని చైనాకు చెందిన దిగ్గజ మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ అందుకుంటే.. దాని నుంచి పాక్ కు మరో స్నేహితుడైన అజర్ బైజన్ కు చెందిన మరో మీడియా సంస్థ ఆన్ లైన్ లో పెట్టటంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ అసత్య ప్రచారం నిజంలా ప్రచారం సాగుతోంది. దీంతో.. ఈ విష ప్రచారంపై భారత మిలటరీ విభాగం స్పందించింది. హైపర్ సోనిక్ క్షిపణితో ఎఫ్400ను ధ్వంసం చేసినట్లుగా చేస్తున్న ప్రచారం తప్పుగా తేల్చింది.

ఇదే కాదు.. ఇలాంటి బోలెడన్ని తప్పుడు ప్రచారాల్ని పాక్ మొదలు పెట్టింది. శనివారం పాక్ కు చెందిన స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని చెప్పుకునే కమర్ చీమా అనే వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్ సైట్ అనే హ్యాండిల్ ద్వారా అసత్య ప్రచారాల్ని చేస్తున్నాడు. పాక్ సైబర్ సైన్యం చేసిన దాడిలో భారత పవర్ గ్రిడ్ దాదాపు 70శాతం నిర్వీర్యమైనట్లుగా పేర్కొంటూ ఒక తప్పుడు కథనాన్ని అల్లారు. దీంతో రంగంలోకి దిగిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి.. అదంతా శుద్ధ తప్పుగా స్పష్టం చేసింది.

ఇవే కాదు.. భారత్ లో ఆహార ధాన్యాల కొరత ఉందని.. గుజరాత్ పోర్టుపై దాడి.. భారత సైనికులు మరణించినట్లుగా.. జలంధర్ లో డ్రోన్ దాడిలో భారీగా దెబ్బ తిన్నట్లు.. జమ్ముకశ్మీర్ ఎయిర్ బేస్ మీద పాక్ దాడులు జరిపినట్లుగా.. ఇలా ఎంత అవకాశం ఉంటే అంతలా తప్పుడు ప్రచారాలు చేస్తూ.. అబద్ధాల్ని నిజాలుగా ప్రచారం చేసేందుకు పాక్ అండ్ కో ప్రయత్నిస్తోంది. దీనికి పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ తో ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ.. వారి ఫేక్ ప్రచార యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్న పరిస్థితి.

Tags:    

Similar News