అందరి దయచేత పాక్ బతికిపోయింది !
ఇక ఆధునిక ప్రపంచంలో పాపిష్టి పాకిస్థాన్ ఎన్ని అకృత్యాలు చేసినా ఏదో ఒక సమయంలో కొన ప్రాణంతో బతికి బట్ట కట్టేస్తుంది;
అరయంగ కర్ణుడీల్గే అర్గురి చేతన్ అని మహాభారతంలో ఒక పద్యం ఉంది. అంటే ఎంతో మహావీరుడు అయిన కర్ణుడు చావుకు ఆరుగురు కారకులు అయ్యారని దాని అర్థం. ఇక ఆధునిక ప్రపంచంలో పాపిష్టి పాకిస్థాన్ ఎన్ని అకృత్యాలు చేసినా ఏదో ఒక సమయంలో కొన ప్రాణంతో బతికి బట్ట కట్టేస్తుంది. ఇక చచ్చావ్ పో అని కరుణ చూపించి వదిలేయడం అలవాటు అయిపోయింది. అలా అందరి దయచేత పాక్ బతికిపోయింది
ఎలాగోలా ప్రాణం దక్కించుకుంటే మళ్ళీ ఒక్క అన్నం మెతుకు అయినా తిని బతుకు వెళ్ళదీస్తూ తన కుట్రలు అమలు చేయవచ్చు అన్నది పాక్ కి ఏడున్నర దశాబ్దాలుగా తెలిసి వచ్చిన విద్య. పాక్ వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న భారత్ ఈసారి దాని పని పట్టేస్తుంది అని అంతా అనుకున్నారు.
కానీ చివరికి భారత్ కాల్పుల నిలుపుదలకు అంగీకరించడంతో పాక్ కి ఎక్కడ లేని ప్రాణాలు ఒక్కచోటకు వచ్చినట్లు అయింది. ఈ దెబ్బతో బతికిపోయామని అనుకుంది. ఇదే తీరున యుద్ధం సాగితే పాక్ ముక్క చెక్కలు అయ్యేది. భారత్ వీర పరాక్రమంతో ఈ ప్రపంచ పటం మీద అదృశ్యం అయినా ఆశ్చర్యం లేదు.
కానీ అలా ఎందుకు కానిస్తారు, పాక్ కి పరోక్ష ప్రత్య్హక్ష మద్దతుదారులుగా పెద్ద దేశాలే ఉన్నాయి. వారంతా పాక్ అలా నిలిచి ఉండాలని బలంగా కోరుకుంటూ వచ్చారు. అందుకే ఈ రోజు పాక్ బతికి బట్టకట్టేసింది. భారత్ మీద ఉగ్ర దాడి జరిగింది అంటే అయ్యో అన్న వారే భారత్ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటే మాత్రం ఓర్వలేకపోయారు.
శాంతి మంత్రం జపిస్తూ భారత్ కే కొత్త పాఠాలు చెబుతున్నారు. అసలు శాంతి అన్నదే భారత్ గడ్డ మీద పుట్టింది. తన జోలికి వస్తే కానీ మరే దేశం మీద కనీసంగా చూపు అయినా చూడని భారత్ కి శాంతిని బోధించే హక్కు కానీ నైతిక స్థైర్యం కానీ ఈ ప్రపంచంలో మరో దేశానికి ఉన్నాయా అన్నది ప్రశ్న.
ఇకపోతే భారత్ ఉగ్ర బాధితురాలు. దాదాపుగా ముప్పావు శతాబ్ద కాలంగా ఉగ్ర భూతంతో బలి అవుతూనే ఉంది. ప్రపంచానికి మిత్రుడిగా ఉన్న భారత్ ఈ విధంగా బాధ పడుతూంటే ఎవరికీ నాడు దాయాది పాక్ ని చెప్పి ఇది తప్పు అని ఆపించాలనిపించలేదు. పాక్ ఉగ్ర కర్మాగారంగా మారిందని అందరికీ తెలుసు.
అయినా వారికి నొప్పి లేదు. ఎందుకంటే ఆ బాధలు నొప్పి అంతా భారత్ దే. పైగా వారి దృష్టిలో పాక్ ఒక దేశం. అందుకే పాక్ కోరినప్పుడల్లా రుణాలు ఇస్తూ పోతారు. ఆ రుణాలు ఉగ్రవాదులకు ఖర్చు చేస్తుందని తెలిసినా వారికి బేఖాతరుగా ఉంది. భారత్ లోని పౌరుల మీద ఆసుపత్రుల మీద విద్యా సంస్థల మీద పాక్ తెగబడి దాడులు చేస్తూంటే మందలించాల్సిన వారు కూడా లేరు.
ఇపుడు భారత్ తన ధర్మ ఆగ్రహాన్ని చూపిస్తూంటే మాత్రం పాపం పసి పాకిస్థాన్ ఏమైపోతొందో అని ఎక్కడ లేని కంగారూ పుట్టుకొచ్చేసింది. అందుకే రాత్రీ పగలూ కష్టపడి పంచాయతీ చేసి మరీ కాల్పుల నిలుపుదల చేయించి మరీ గొప్ప పరిష్కారం చూపించారు అని అంటున్నారు.
వీరికి పాక్ ప్రయోజనాలే ముఖ్యమా అన్న చర్చ కూడా నెటిజన్ల నుంచి వస్తోంది. ఈ కాల్పుల నిలుపుదలను నెటిజన్లు అంతా తప్పుపడుతున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో పాక్ విషయంలోనూ ఉగ్రవాదుల విషయంలో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అంతా ఆశపడ్డారు. కానీ పాక్ సమయానికి కాళ్ళ బేరానికి వచ్చినట్లుగా నటించింది. ప్రపంచాన్ని మరోసారి విజయవంతంగా వంచించింది.
దాంతో అంతర్జాతీయ సమాజం ముందు తాను నింద పడకుండా ఒక అనివార్యమైన పరిస్థితుల్లో భారత్ అంగీకరించాల్సి వచ్చింది. ఏది ఏమైనా కుక్క తోక వంకర అన్నట్లుగా పాక్ వక్ర బుద్ధి కూడా అలాగే ఉంటుంది. ఎన్నటికీ మారదు అన్నది అందరికీ తెలుసు. మారితే కనుక ఈ ప్రపంచంలో ఎనిమిదవ వింత. అలా మారాలని ఆ భగవంతుడిని ప్రార్ధించడం ఒక్కటే ఇపుడు ఎవరైనా చేయాల్సిన పని అని అంటున్నారు. పాక్ దుర్మార్గం అంతరించాలని ఇక దేవుడినే అంతా ప్రార్ధించాల్సి ఉంది.