పాక్‌పై బలూచిస్తాన్ `బెబ్బులి`.. గుక్కతిప్పని దాడి!
పాక్ ఆర్మీ పై 39 చోట్ల మెరుపు దాడులు చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాయాది దేశానికి గుక్కతిప్పుకోనివ్వడం లేదు.;
ఒకవైపు భారత్ చేస్తున్న దాడులు.. ప్రపంచ దేశాల సహాయనిరాకరణతో తలబొప్పి కడుతున్న పాకిస్థాన్ కు ఇప్పుడు బలూచిస్తాన్ రూపంలో భయంకరమైన దాడులు ఎదురయ్యాయి. పాక్ ఆర్మీ పై 39 చోట్ల మెరుపు దాడులు చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాయాది దేశానికి గుక్కతిప్పుకోనివ్వడం లేదు. దీంతో పాక్ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.
ఏంటీ బలూచిస్తాన్?
బలూచిస్తాన్ అనేది పరిపాలనాపరంగా మూడు దేశాల మధ్య ఉంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ల మధ్య విస్తరించి ఉన్న ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా పేర్కొంటూ.. కొన్నాళ్లుగా వేర్పాటు వాద ఉద్యమానికి తెరదీసింది. విస్తీర్ణం, జనాభా పరంగా అతిపెద్ద భాగం పాకిస్తాన్‌లో ఉంది. అంతేకాదు.. పాకిస్థాన్ ప్రజల్లో 69 లక్షల మంది ప్రజలు బలూచ్(ఇదొక జాతి)లే కావడం గమనార్హం. అయితే.. గత పాకిస్థాన్ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అనుసరించిన విధానాలు బలూచ్‌లను ఏకం చేసింది.
దీంతో తమకంటూ ప్రత్యేక దేశం ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లోని బలూచ్‌లు ఉద్యమిస్తున్నారు. వీరిలో లిబరేషన్ ఆర్మీ.. దాడులకు, హెచ్చరికలకు కూడా దిగింది. తమను సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించాలన్నది వీరి డిమాండ్. దీనికి ఆఫ్ఘన్, ఇరాన్‌లు సమ్మతించినా.. పాకిస్థాన్ మాత్రం సైనిక చర్య ద్వారా బలూచ్‌ను తన అధీనంలో ఉంచుకుంది. అనేక వందల మంది బలూచ్‌లను హత్య చేసిందన్న ఆరోపణలు వున్నాయి.
అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. తాజాగా భారత్ దాడులు చేస్తున్న నేపథ్యంలో దీనిని తమకు అవకాశంగా మార్చుకుని పాకిస్థాన్‌పై విరుచుకుపడడం ఖాయమని ప్రపంచ స్థాయిలో చర్చ జరుగుతున్న క్రమంలోనే.. అనూహ్యంగా పాక్ మిలటరీపై విరుచుకుపడింది. దీని దాడిలో సుమారు 200 మందికిపైగా పాక్ సైనికులు మృతి చెందారని.. అంతే మొత్తంలో బలూచ్‌కు కూడా నష్టం వాటిల్లిందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.