ముందుకొచ్చి కొట్టలేక.. పాకిస్తాన్ మళ్లీ దొంగదెబ్బ

తాజాగా తంగ్డర్ సెక్టార్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.;

Update: 2025-05-07 04:38 GMT

పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి అత్యంత కిరాతకంగా ప్రదర్శించింది. భారత సైన్యం కేవలం సరిహద్దులోని ఉగ్రవాద స్థావరాలపై, వారి లాంచ్‌పాడ్‌లపై లక్షిత దాడులు నిర్వహించి, దేశ భద్రతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, దానికి ప్రతీకారంగా పాక్ సైన్యం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి ఉన్న అమాయక భారతీయ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్‌లోని పౌర గ్రామాలపై పాక్ రేంజర్లు విచక్షణారహితంగా ఫిరంగులు, మోర్టార్లతో భీకర దాడులకు పాల్పడుతున్నారు.

ఈ అకస్మాత్తు దాడులు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా తంగ్డర్ సెక్టార్‌లోని ఓ గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాక్ షెల్లింగ్‌ తీవ్రతకు ఒక కశ్మీరీ పౌరుడి ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. ఈ దాడుల్లో ముగ్గురు సాధారణ పౌరులు దుర్మరణం పాలవడం పాక్ అకృత్యానికి నిదర్శనం. అనేక మంది గాయపడి చికిత్స పొందుతున్నారు.

పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే కాకుండా, ఎటువంటి రెచ్చగొట్టకపోయినా భారత పౌర లక్ష్యాలను చేసుకుని దాడులు చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ, వారి స్థావరాలపై భారత సైన్యం చర్యలు తీసుకుంటే, అమాయక పౌరులపై దాడులకు తెగబడటం దాని పిరికితనాన్ని, నీచబుద్ధిని తెలియజేస్తుంది.

భారత సైన్యం పాక్ కాల్పులను అత్యంత సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ రేంజర్ల దుశ్చర్యలకు ధీటుగా బదులిస్తూ, సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. అయినప్పటికీ, పాకిస్తాన్ తీరు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిరంతరం షెల్లింగ్ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చాల్సిన దుస్థితి ఏర్పడింది.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మానవతా విలువల‌ను కాలరాసేలా పాకిస్తాన్ పాల్పడుతున్న ఈ దుశ్చర్యల పట్ల అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలని భారత్ గట్టిగా కోరుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించే పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఖండించాలని, తగిన చర్యలు తీసుకోవాలని భారత్ పిలుపునిస్తోంది. అమాయక పౌరులపై దాడులకు పాల్పడే పాకిస్తాన్ చర్యలు ప్రాంతీయ శాంతికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి.

Tags:    

Similar News