పహల్గాం బాధితులకు న్యాయంపై రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ!
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.;
భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఈ కాల్పుల విరమణ తమ విజయమని బీజేపీ ప్రకటించుకుంది! మరోపక్క ఈ కాల్పుల విరమణ తమ చారిత్రక విజయమని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సాధించిందేమిటో వెల్లడించారు.
అవును... తాజాగా ఉత్తరప్రదేశ్ లోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ఇందులో భాగంగా.. ఈ ఆపరేషన్ ద్వారా అనేక మంది మహిళల నుదిటి నుంచి సిందూరాన్ని తుడిచిన భారత వ్యతిరేక, ఉగ్రవాద సంస్థలపై సైన్యం ప్రతీకారం తీర్చుకుందని అన్నారు.
ఇదే సమయంలో... సైన్యం చర్యలు సారిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదని.. రావల్పిండిలోని పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో కూడా బిగ్గరగా ప్రతిధ్వనించాయని అన్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం పాకిస్థాన్ ప్రజలకు,, సైనిక స్థావరాలకు సైతం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా, సంయమనం పాటిస్తూ, ఖచితమైన దాడులు చేసిందని అన్నారు.
అయితే... ఆపరేషన్ సిందూర్ కు ప్రతిస్పందనగా పాక్ సైన్యం మాత్రం భారత పౌరులను, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుందని రాజ్ నాథ్ తీవ్రంగా విమర్శించారు. తాము మాత్రం ఉగ్రవాద మౌలిక సదుపాయాలపైనే ఖచ్చితంగా గురిచూసి కొట్టామని తెలిపారు. తాము పాక్ పౌరులను ఏనాడూ లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.
ఈ విధంగా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదంపై పోరాడటానికి భారత్ ఇప్పుడు శత్రువుల భూభాగంలోకి లోతుగా వెళ్లి దాడి చేయగలదని ప్రపంచానికి చూపించిందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్సీ విధానాన్ని అనుసరిస్తున్నట్లు మోడీ స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు.