ఉగ్రవాది గురించి బుకాయించి పరువు తీసుకొన్న పాక్ మాజీ మహిళా మంత్రి!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ లోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది.;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్ లోని ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది. ఈ సమయంలో సుమారు 100 మంది వరకూ ఉగ్రవాదులు మృతి చెందారు! ఈ సమయలో మురీద్కేలోని లష్కరే శిబిరంపై జరిగిన దాడిలో మృతి చెందిన వారికి నిర్వహించిన అంత్యక్రియల్లో అబ్దుల్ రవూఫ్ పాల్గొన్నాడు. అయితే అతడు ఉగ్రవాది కాదని పాక్ వాదించింది. ఈ సమయంలో ప్రపంచానికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది!
అవును... ఆపరేషన్ సిందుర్ కారణంగా మృతిచెందిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో... ఉగ్రమూకలతో పాక్ కు ఉన్న అనుబంధం మరింత అధికారికంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంతర్జాతీయ ఉగ్రవాదిని 'సాధారణ వ్యక్తి' అంటూ వెనకేసుకొచ్చారు. ప్రపంచం ముందు పరువు పోగొట్టుకున్నారు!
వివరాళ్లోకి వెళ్తే... ఇటీవల హీనా రబ్బానీ ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వం వహించాడని.. అతడిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా అమెరికా ప్రకటించిందనే విషయానికి సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి ఆమె చెప్పిన సమాధానంతో పరువు పోగొట్టుకున్నారు.
ఇందులో భాగంగా.. 'మీరు ఉగ్రవాది అంటూ ఆధారాల్లో చూపెడుతున్న వ్యక్తి.. మీరు అనుకొంటున్న ఉగ్రవాది కాదు. పాకిస్థాన్ లో లక్షల మంది అబ్దుల్ రవూఫ్ లు ఉన్నారు' అని ఆమె పేర్కొన్నారు. దీంతో ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టు స్పందిస్తూ.. అంత్యక్రియల సందర్భంగా విడుదల చేసిన ఫోటో ఫేక్ అని చెప్పలేదని.. ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి చెందినవాడని, అతడి నేషనల్ ఐడీ నెంబర్ ను కూడా విడుదల చేశారని గుర్తుచేశారు.
ఇదే సమయంలో... అమెరికా ఉగ్ర జాబితాలో వెల్లడించిన ఐడీ, ఆ నేషనల్ ఐడీ ఒకటే అని సదరు జర్నలిస్టు హీనాకు వివరించారు. దీంతో... ఒక్కసారిగా షాకైన హీనా రబ్బాని.. సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నించారు. అప్పటికీ పాక్ ఐఎస్‌ఐ ప్రజాసంబంధాల విభాగం మాత్రం భారత్ చెబుతున్న రవూఫ్ అతడు కాదన్న విషయాన్ని వెల్లడించిందని హీనా చెప్పుకొచ్చారు. ఆమె ఎంత సమర్ధించుకున్నా.. ప్రపంచానికి అసలు వాస్తవం తెలుసనే విషయాన్ని మరిచారు!
కాగా... భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో 9 ఉగ్రవాద శిబిరాలు, సుమారు 100 మంది ఉగ్రమూకలు మట్టుపెట్టబడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరణించిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు జరిగాయి. ఇందులో భాగంగా... లాహోర్ సమీపంలోని మురిద్కేలోని ఉగ్రవాద సంబంధిత ప్రదేశంలో జరిగిన అంత్యక్రియల్లో ప్రార్థనలకు లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఇలా అతడు నాయకత్వం వహించిన ఉగ్రవాదుల అంత్యక్రియల కార్యక్రమంలో పాకిస్థాన్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే... ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న అబ్దుల్ రవూఫ్.. మీరనుకుంటున్న అబ్దుల్ రఫూవ్ కాదంటూ బుకాయించిన పాక్ నేత తాజాగా పరువు పోగొట్టుకున్నారు.