జమిలి ఎన్నికలపై ఎన్డీయే కీలక నిర్ణయం
దేశంలో ఒకేసారి పార్లమెంట్ కి అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించాలని గత పన్నెండేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.
దేశంలో ఒకేసారి పార్లమెంట్ కి అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించాలని గత పన్నెండేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయితే ఇది అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు దాంతో ఎప్పటికపుడు ఇది అలా వెనక్కి వెళ్తూనే ఉంది. ఎట్టకేలకు జమిలి ఎన్నికల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఏర్పాటు చేసింది. దాని కంటే ముందు మాజీ రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాల మీద పరిశీలన చేయాలని కోరింది. అలా వచ్చిన సిఫార్సుల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి అధ్యయనం చేయిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన పరిణామాల నేపధ్యలో జమిలి ఎన్నికల కోసం 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గడువును వచ్చే శీతాకాల సమావేశాల చివరి వారం తొలి రోజు వరకు పొడిగిస్తూ లోక్ సభ నిర్ణయం తీసుకుంది.
ఇంకా సేకరించాల్సి ఉంది :
ఇక ఈ జేపీసీ అధ్యక్షుడుగా పీపీ చౌదరి వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని 41 మంది సభ్యుల బృందం ఈ జమిలి ఎన్నికల బిల్లును పరిశీలిస్తోంది. జమిలి బిల్లు లక్ష్యాలు చూస్తే కనుక లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు అలాగే స్థానిక సంస్థలకు 2029 నాటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంగా ఉంది. అందుకోసం దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు సేకరించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల విషయంలో జేఏసీ నివేదిక కోసం మరింత సమయం ఇవ్వాలనే గడువు పెంచారు అని అంటున్నారు.
సాధ్యమేనా అంటూ :
జమిలి ఎన్నికలను నిర్వహించాలని బీజేపీకి అయితే కోరికగా ఉంది. అది ఆ పార్టీ అజెండాలోనే ఉంది. అయితే ఇపుడున్న పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు నిర్వహించడం అంత సులువేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నార్యి. జమిలి ఎన్నికల నిర్వహణ చట్టపరంగా సాధ్యమే అనుకున్నా దీనికి రాజ్యాంగ సవరణలు రాజకీయ సమ్మతి అసలు సమస్యలుగా ఉన్నాయని చెప్పలై. బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ 2029 నాటికి జమిలి ఎన్నికలను అమలు చేసేలా చూడాలని పట్టుదలగా ఉంది. కానీ లోక్ సభ రాజ్యసభలలో రాజ్యాంగ సవరణకు సరిపడా బీజేపీకి సంఖ్యాబలం ఉందా అన్నదే చర్చగా ఉంది. ఇక చూస్తే కనుక లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితి మార్చడానికి ఆర్టికల్ 83, 85, 172, 174, 356 వంటి రాజ్యాంగ అధికరణలను సవరించాలి.దానితో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వేర్వేరుగా ఉండటంతో వాటిని కుదించడం లేదా పొడిగించడం చేయాలి.
వారితోనే వ్యతిరేకత :
జమిలి ఎన్నికలు అంటే ప్రధానంగా ప్రాంతీయ పార్టీలతోనే సమస్యలు వస్తాయని అంటున్నారు. ఒకే సారి ఎన్నికలు దేశమంతటా అంటే జాతీయ అజెండా మేరకే జరుగుతాయి. అపుడు ప్రాంతీయ పార్టీల ఆకాంక్షలు దెబ్బ తింటాయని ఆందోళన ఉంది. అందుకే జమిలి అంటే ప్రాంతీయ పార్టీలు దీనివల్ల తమ మనుగడ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో అనేకమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని ఒప్పించడం అన్నది కష్టతరమైన వ్యవహారం అని అంటున్నారు. ఇక ఇపుడు చూస్తే పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉంది. అనేక ముఖ్య బిల్లులే సభ ముందు ఆమోదానికి నోచుకుంటాయా అన్నది కూడా ఉంది. దాంతో జమిలి ఎన్నికల బిల్లు వంటివి ఆమోదం పొందడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
లాభాలు ఉన్నాయని :
ఇక జమిలి ఎన్నికల ప్రయోజనాలు చాలానే ఉన్నాయని బీజేపీ అంటోంది. ఎన్నికల నిర్వహణకు అయ్యే వేల కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని చెబుతోంది. తరచూ ఎన్నికలు రాకుండా ఉంటే ప్రభుత్వాలు అభివృద్ధి పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చు అని అంటోంది. లోక్‌సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకే సమయంలో ఎన్నికలు జరపడం వల్ల ఖర్చు తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, అభివృద్ధి పనులకు ఆటంకం ఉండదని చెబుతోంది. కానీ జమిలి ఎన్నికల విషయంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడం కష్టమేనా అన్నదే అసలైన చర్చ.