భారత్‌లో అత్యంత సురక్షిత నగరమేదో తెలుసా?
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 57.3 సేఫ్టీ స్కోరుతో గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానం దక్కగా, దేశ స్థాయిలో ఇది ఆరో స్థానంలో నిలిచింది.;
ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో భద్రతా ప్రమాణాలను అంచనా వేసే ప్రముఖ సంస్థ నంబియో తన 2025 మిడ్-ఇయర్ క్రైమ్ ఇండెక్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదికలో ప్రపంచంలోని 279 నగరాలను భద్రత దృష్ట్యా ర్యాంకింగ్ చేయడం జరిగింది. ఈ జాబితాలో భారతదేశానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షిత నగరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబి 88.8 సేఫ్టీ ఇండెక్స్ స్కోరుతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఇది వరుసగా తొమ్మిదోసారి అబుదాబికి ఈ గౌరవం దక్కడం విశేషం. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన మొదటి ఐదు నగరాల్లో రెండో స్థానంలో ఖతార్ రాజధాని దోహా, మూడో స్థానంలో దుబాయ్, నాలుగో స్థానంలో షార్జా, ఐదో స్థానంలో తైవాన్ రాజధాని తైపీ నిలిచాయి.
-భారత దేశంలో అగ్రస్థానంలో అహ్మదాబాద్
భారతదేశ స్థాయిలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు పొందింది. ఈ నగరానికి 68.6 సేఫ్టీ స్కోరుతో గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 77వ స్థానం లభించింది. అహ్మదాబాద్ తర్వాత భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాలుగా జైపూర్ 65.2 సేఫ్టీ స్కోర్‌తో దేశంలో రెండో స్థానం, కోయంబత్తూర్ 62 సేఫ్టీ స్కోర్‌తో మూడో స్థానం, చెన్నై 60.03 సేఫ్టీ స్కోర్‌తో నాలుగో స్థానం, పుణె 58.7 సేఫ్టీ స్కోర్‌తో ఐదో స్థానం నిలిచాయి.
-హైదరాబాద్‌కు ఆరో స్థానం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 57.3 సేఫ్టీ స్కోరుతో గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానం దక్కగా, దేశ స్థాయిలో ఇది ఆరో స్థానంలో నిలిచింది. ఇది హైదరాబాద్ నివాసితులకు కొంత ఊరట కలిగించే వార్తే. ఇతర భారత నగరాల ర్యాంకింగ్స్ చూస్తే.. 7వ స్థానంలో ముంబై (55.9) , 8వ స్థానంలో కోల్‌కతా (53.3), 9వ స్థానంలో గురుగ్రామ్ (46.0), 10వ స్థానంలో బెంగళూరు (45.7), 11వ స్థానంలో నోయిడా (44.9), 12వ స్థానంలో ఢిల్లీ (41.0) నిలిచింది.
నేరాల ఆధారంగా సురక్షిత అంచనా
నంబియో సంస్థ ఈ ర్యాంకింగ్స్‌ను ఆయా నగరాల్లో నమోదైన నేరాల స్థాయిని బట్టి నిర్ణయిస్తుంది. రాత్రి, పగటి వేళల్లో జరిగే దొంగతనాలు, హత్యలు, విధ్వంసకర చర్యలు, వేధింపులు వంటి అంశాలపై సాధారణ ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ క్రైమ్ ఇండెక్స్‌ను రూపొందిస్తుంది. ప్రజలు వ్యక్తిగతంగా ఎంతవరకు సురక్షితంగా భావిస్తున్నారో కూడా ఈ సర్వేలో పరిగణనలోకి తీసుకోబడుతుంది.
ఈ రిపోర్టు సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కొత్తగా నివాసం ఏర్పాటు చేయాలనుకునే వారు, విద్యార్థులు, ఉద్యోగాల కోసం నగరాలు మారుతున్నవారు ఈ సమాచారం ఆధారంగా తమ నిర్ణయాలను తీసుకోవచ్చు. సురక్షితమైన నగరాల్లో జీవనం మాత్రమే కాకుండా, అక్కడ అభివృద్ధికి మార్గం కూడా మరింత సాఫల్యంగా ఉంటుందని నంబియో నివేదిక పరోక్షంగా సూచిస్తోంది. భద్రతతో కూడిన వాతావరణం సామాజిక, ఆర్థిక వృద్ధికి అత్యంత కీలకం.