'హాట్' కామెంట్... బెంగళూరు వాసులకు ఈ ఏప్రిల్ ఇలా కూడా గుర్తుండిపోతుంది!

ఇదే సమయంలో మరో రకంగా కూడా ఈ ఏప్రిల్ బెంగళూరు వాసులకు గుర్తుంటుందని అంటున్నారు!

Update: 2024-05-01 13:00 GMT

ప్రస్తుతం బెంగళూరు పరిస్థితి అత్యంత దయణీయంగా ఉందనే కామెంట్లు గతకొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరు గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో విపరీతమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుందని అంటున్నారు. దీంతో... ఈ ఏప్రిల్ బెంగళూరు వాసులకు బాగా గుర్తుంటుందని అంటున్నారు. ఇదే సమయంలో మరో రకంగా కూడా ఈ ఏప్రిల్ బెంగళూరు వాసులకు గుర్తుంటుందని అంటున్నారు!

అవును... చుక్క నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న బెంగళూరు నగర వాసుల కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో బెంగళూరు నగరంలో ఒక్క వాన కూడా పడలేదు. దీంతో... గత నాలుగు దశాబ్దాలలో అత్యంత పొడి ఏప్రిల్ గా 2024 ఏప్రిల్ నెల నిలిచిందని చెబుతున్నారు! చివరిగా 1983 ఏప్రిల్ లో బెంగళూరు సిటీలో సున్నా వర్షపాతం నమోదైందట!

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఐఎండీ లోని సీనియర్ శాస్త్రవేత్త... గత 41 సంవత్సరాలలో బెంగళూరు నగరంలో ఏప్రిల్ నెలల్లో వర్షాలు పడకపోవడం ఇదే మొదటిసారని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, జనాభా పెరుగుదల, వేగవంతమైన పట్టణీకరణ, ఎల్ నినో వంటివి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కఠిన వాతావరణ పరిస్థితులకు కారణాలని ఆయన వివరించారు.

మరోవైపు ఆదివారం బెంగళూరులో సుమారు 38.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని చెబుతున్నారు. ఇది గత ఐదు దశాబ్దాలలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రత అని అంటున్నారు. 2016 ఏప్రిల్ 25న బెంగళూరులో నమోదైన 39.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నగరంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డుగా కొనసాగుతోందని.. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 28న 38.5 డిగ్రీలు, ఏప్రిల్ 27న 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెబుతున్నారు.

ఇదే సమయంలో... మే నెలలో 2016 ఏప్రిల్ లోని 39.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డ్ బద్దలైపోవచ్చని అంటున్నారు! ఇదే క్రమంలో... మే 3 తేదీ లోపు బెంగళూరు అర్బన్, విజయపుర, చిత్రదుర్గ, రాయచూర్, హసన్, బళ్లారి, దావణగెరె, బెళగావి, శివమొగ్గ, బీదర్, కలబుర్గి, యాద్గిర్, తుమకూరు, చామరాజనగర్, రామనగర, చిక్కమగళూరు, మండ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags:    

Similar News