భార్య, అత్తగారి వేధింపుల కారణంగా పెళ్లైన రెండేళ్లకే యువకుడి ఆత్మహత్య
జీవితాంతం కలిసుంటుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ చేసుకున్న నాటి నుంచే అత్తింటి వారి వేధింపులు ఓ యువకుడిని బలితీసుకున్నాయి.;
జీవితాంతం కలిసుంటుందని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ చేసుకున్న నాటి నుంచే అత్తింటి వారి వేధింపులు ఓ యువకుడిని బలితీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఇండస్ట్రీయల్ నగరం నోయిడాకు చెందిన 33 ఏళ్ల మోహిత్ యాదవ్ అనే ఒక యువ ఇంజనీర్, తాను పనిచేస్తున్న ఇటావాలోని ఒక హోటల్ గదిలో ఉరేసుకుని బలవర్మరణానికి పాల్పడ్డాడు. తన మరణానికి ముందు అతడు రికార్డు చేసిన ఒక హృదయ విదారక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. దానిలో తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను అత్యంత దారుణంగా మానసికంగా హింసించారని పేర్కొన్నారు.
బతికుండగా తన బాధను అర్థం చేసుకునే వారు లేరని ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఏడేళ్ల పాటు సాగిన వారి ప్రేమ ప్రయాణం, రెండేళ్ల క్రితం వివాహ బంధంతో ముగిసింది. అయితే, యువకుడి భార్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దాంపత్య జీవితంలో ఊహించని కల్లోలాలు స్టార్ట్ అయ్యాయి. ఆ ప్రేమబంధం చివరకు ఇలాంటి విషాదకర ముగింపు పలకడం దురదృష్టకరం.
మోహిత్ తన చివరి వీడియోలో గుండెలు పిండేసే సంచలన నిజాలను బయటపెట్టాడు. తన భార్య గర్భవతిగా ఉన్నసమయంలో అత్తగారే దగ్గరుండి అబార్షన్ చేయించారని దిగ్భ్రాంతికి గురిచేశాడు. అంతేకాకుండా, పెళ్లి సమయంలో తాను ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదన్నాడు. తన కుటుంబానికి చెందిన ఆస్తులన్నింటినీ వారి పేరు మీద బదిలీ చేయకపోతే వరకట్న వేధింపుల కింద కేసు పెడతామని భార్య, అత్తింటి వారు తనను నిత్యం మానసికంగా చిత్రహింసలకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశఆడు.
తన కన్న తల్లిదండ్రులను ఉద్దేశించి కన్నీటితో క్షమాపణలు కోరుతూ తాను చనిపోయిన తర్వాత కూడా తనకు న్యాయం జరుగదని భావిస్తే, తన చితాభస్మాన్ని ఏదైనా కాలువలో కలిపేయంటూ వేడుకున్నాడు. ఈ హృదయ విదారక వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపిన కొద్ది క్షణాలకే మోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.