ఇక బ్యాక్ బెంచ్ మాటే ఉండదా..? కేరళ క్లాస్ రూములు ఇలా ఉండబోతున్నాయా..?

విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ సంస్థల మీటింగ్ రూమ్స్‌లో ఈ 'U' షేప్ లేదా 'సర్కిల్' సీటింగ్ విధానాన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు.;

Update: 2026-04-26 07:22 GMT

పాఠశాల గదిలో ‘ముందు బెంచీ’, ‘వెనుక బెంచీ’ అనే విభజన కూర్చునే స్థలానికి సంబంధించినది మాత్రమే కాదు.., అది విద్యార్థుల ఆత్మవిశ్వాసంపై కూడా ప్రభావం చూపుతుంది. కేరళలోని కొన్ని పాఠశాలలు ఈ వివక్షను తొలగించడానికి ప్రవేశపెట్టిన 'U' ఆకారపు సీటింగ్ విధానం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విద్యార్థి దశలో ‘నేను బ్యాక్ బెంచర్’ అనే ముద్ర పడడం వల్ల చాలా మంది విద్యార్థులు తరగతి గదిలో జరిగే చర్చల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. దీనిని గమనించిన కేరళలోని కొన్ని పాఠశాల యాజమాన్యాలు సంప్రదాయ బెంచీలను తొలగించి, తరగతి గదిని 'U' ఆకారంలోకి మార్చాయి. దీనివల్ల ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడికి నేరుగా కనిపిస్తాడు.., ఉపాధ్యాయుడికి కూడా ప్రతి విద్యార్థిపై సమాన దృష్టి ఉంటుంది. తరగతి గదిలో ఎవరు ముందు, ఎవరు వెనుక అనే వ్యత్యాసాన్ని చెరిపివేయడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

ప్రయోజనాలు ఏంటి?

ఈ కొత్త విధానం వల్ల తరగతి గది వాతావరణం మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో 'ముందు', 'వెనుక' అనే తేడా ఉండదు. అందరూ ఒకే వరుసలో ఉంటారు. దీనివల్ల వెనుక బెంచీలో కూర్చుని టీచర్ కంటికి కనపడకుండా ఉండాలనుకునే విద్యార్థులు చర్చల్లో పాల్గొనక తప్పదు. విద్యార్థులు కేవలం టీచర్‌ను మాత్రమే కాకుండా, తమ తోటి విద్యార్థులను కూడా ముఖాముఖి చూసే అవకాశం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్, టీమ్ వర్క్ సులభం అవుతుంది. టీచర్ క్లాస్ మధ్యలోకి వచ్చి అందరికీ సమాన దూరంలో ఉండి బోధించవచ్చు. ప్రతి విద్యార్థికి తాము టీచర్ నిఘాలో ఉన్నామన్న భావన కలిగి, పాఠంపై దృష్టి పెడతారు.

చదువు సీటింగ్‌లో ఉందా..?

అయితే, ఈ విధానంపై సోషల్ మీడియాలో, విద్యావేత్తల నుంచి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థి ఎక్కడ కూర్చున్నా చదువుతాడు.. చదువుపై ఇంట్రస్ట్ లేని వాడిని ఎక్కడ కూర్చోబెట్టినా ఫలితం ఉండదు’ అనే విమర్శలు కూడా వినిపిస్తు్న్నాయి. సీటింగ్ మార్చడం వల్ల మార్కులు పెరగవని వాదిస్తున్న వారు లేకపోలేదు. మన దేశంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ, స్థలం తక్కువ. 'U' ఆకారంలో కూర్చోబెట్టాలంటే తరగతి గది పెద్దదిగా ఉండాలి లేదంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండాలి. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతవరకు సాధ్యం? అన్నది ప్రశ్న. ప్రపంచ ప్రఖ్యాత నాయకులు, శాస్త్రవేత్తలు, బిలియనీర్లలో చాలా మంది తాము ‘బ్యాక్ బెంచర్స్’ అని గర్వంగా చెప్పుకుంటారు. వెనుక కూర్చోవడం వల్లే తమలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెరిగాయని వారి నమ్మకం. ఈ కొత్త పద్ధతి వల్ల ఆ ‘బ్యాక్ బెంచ్ కల్చర్’ అనేది ఉండదు.

విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్ సంస్థల మీటింగ్ రూమ్స్‌లో ఈ 'U' షేప్ లేదా 'సర్కిల్' సీటింగ్ విధానాన్ని ఎప్పటి నుంచో వాడుతున్నారు. దీనివల్ల అందరి మధ్య సమానత్వం నెలకొంటుందని వారు నమ్ముతారు. కేరళ పాఠశాలలు అదే అంతర్జాతీయ ప్రమాణాలను ప్రాథమిక స్థాయి నుంచే అమలు చేయాలని ప్రయత్నిస్తున్నాయి.

కేరళ పాఠశాలల ఈ ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుందో లేదో చెప్పేందుకు సమయం పడుతుంది. అయితే, విద్యార్థుల మధ్య ఉన్న అంతరాలను తొలగించడానికి చేసే ఏ ప్రయత్నమైనా ఆహ్వానించదగ్గదే. సీటింగ్ మార్చడం మాత్రమే కాకుండా, బోధనా పద్ధతుల్లో కూడా మార్పులు తీసుకువస్తే, 'U' ఆకారపు క్లాస్‌రూమ్‌లు విద్యార్థులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెనుక బెంచీ విద్యార్థి అనే ‘నెగటివ్’ ముద్రను తొలగించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ వినూత్న ప్రయోగం.

Tags:    

Similar News