బొలీవియాలో భూ ఆక్రమణకు నిత్యానంద? ఏం జరిగిందంటే?
ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమై నిత్యానందకు చెందిన 'కైలాస'తో సంబంధాలున్న 20 మందిని అరెస్టు చేసి వారి స్వదేశాలకు తిప్పి పంపింది.;
లైంగిక వేధింపులు, పిల్లల అపహరణ వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ భారతదేశం నుంచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన దృష్టి దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాపై పడింది. అక్కడ భారీ ఎత్తున భూమిని ఆక్రమించేందుకు ఆయన ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమై నిత్యానందకు చెందిన 'కైలాస'తో సంబంధాలున్న 20 మందిని అరెస్టు చేసి వారి స్వదేశాలకు తిప్పి పంపింది.
వివరాల్లోకి వెళితే నిత్యానందకు చెందిన 'కైలాస' సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల బొలీవియాలో పర్యటించారు. అగ్నికి రాజకున్న కార్చిచ్చు సమయంలో స్థానిక ప్రజలకు సహాయం చేసిన వీరు, ఆ తర్వాత అక్కడి భూములపై కన్నేశారు. స్థానిక గిరిజన తెగలతో భూమిని లీజుకు తీసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో కూడా కైలాస ప్రతినిధులు ఫొటోలు దిగడం గమనార్హం.
ఒకానొక సమయంలో స్థానిక తెగకు చెందిన ప్రతినిధి దాదాపు ఢిల్లీకి మూడు రెట్లు పెద్దదైన భూభాగాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు అంగీకరించారు. దీనికి గాను 2 లక్షల డాలర్లు చెల్లించేందుకు కూడా ఒప్పందం కుదిరింది. అయితే కైలాస ప్రతినిధులు మాత్రం ఏకంగా 1000 సంవత్సరాల పాటు లీజుతో పాటు, ఆ ప్రాంతంలో గగనతలాన్ని వినియోగించుకునేందుకు, సహజ వనరులను తవ్వుకునేందుకు అనుమతులు కోరారు.
ఈ విషయం బొలీవియాలోని ఓ వార్తాపత్రికలో పరిశోధనాత్మక కథనంగా ప్రచురితం కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దీంతో అప్రమత్తమైన బొలీవియా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో కైలాసతో సంబంధాలు ఉన్న 20 మందిని అరెస్టు చేసింది. స్థానికులతో వారు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. పట్టుబడిన వారిలో భారతీయులు, చైనీయులు, అమెరికన్ పౌరులు ఉన్నారు. వీరంతా పర్యాటక వీసాలపై బొలీవియాలోకి ప్రవేశించి, పలుమార్లు దేశంలో పర్యటించారని, ఈ క్రమంలోనే స్థానికులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. గత నవంబర్ నుండి కొందరు వ్యక్తులు అక్కడే ఉండిపోయారని కూడా గుర్తించారు.
ఈ ఘటనపై బొలీవియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ, వివాదాస్పదమైన 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస'తో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
కాగా నిత్యానంద భారతదేశం నుండి పారిపోయిన తర్వాత 'కైలాస' అనే పేరుతో ఒక ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాంతం ఎక్కడ ఉందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గతంలో నిత్యానంద ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒక కేసు విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు హైకోర్టుకు తెలియజేసింది.
మొత్తానికి నిత్యానంద, ఆయన అనుచరులు మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. బొలీవియాలో వారి భూ ఆక్రమణ ప్రయత్నం విఫలం కావడంతో పాటు, అంతర్జాతీయంగానూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.