పెళ్లై 4 నెలలు.. భర్త టైం ఇవ్వటం లేదని సూసైడ్
ఎవరి బిజీలో వారు. తాను కలలు కన్నట్లుగా వైవాహిత జీవితం లేకపోవటంతో మానసికంగా కుంగిపోయిన మహిళ ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది.;
కొత్తగా పెళ్లైంది. భర్త ప్రైవేటు జాబ్. భార్య ఐటీ ఉద్యోగిని. ఇంటి నుంచే పని చేయొచ్చు. ఎవరి బిజీలో వారు. తాను కలలు కన్నట్లుగా వైవాహిత జీవితం లేకపోవటంతో మానసికంగా కుంగిపోయిన మహిళ ఆత్మహత్య చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే.. ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పాతికేళ్ల చందనా జ్యోతికి కొత్తగూడెంకు చెందిన వెంకటసాయి యశ్వంత్ తో ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున పెళ్లైంది.
వీరిద్దరూ తమ కొత్త కాపురాన్ని మూసాపేటలోని ఆంజనేయ నగర్ లో షురూ చేశారు. ఐటీ ఉద్యోగిని అయిన చందనా జ్యోతి ఇంటి నుంచే పని చేస్తున్నారు. భర్త యశ్వంత్ మెడ్ ప్లస్ సంస్థలో పని చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా ఉదయాన్నే బయటకు వెళ్లే భర్త రాత్రికి కాని తిరిగిరాని పరిస్థితి. కొత్తగా పెళ్లి కావటం.. ఇంట్లోనే ఉండటంతో చందనా జ్యోతి మానసికంగా వేదనకు గురైనట్లుగా చెబుతున్నారు.
ఇదే విషయం మీద భార్యభర్తల మధ్య మూడు రోజులుగా గొడవ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎవరి గదిలో వారు పడుకుండిపోయారు. శనివారం తెల్లవారుజామున యశ్వంత్ ఎంత పిలిచినా భార్య నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో గది తలుపులు పగలకొట్టారు. అప్పటికే బెడ్ షీట్ తో సూసైడ్ చేసుకున్న చందనా జ్యోతి కనిపించింది. ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లుగా వైద్యులు నిర్దారించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.